ఈజిప్టు ఎన్నికల్లో ‘ముస్లిం బ్రదర్ హుడ్’ పై చేయి, ‘రనాఫ్’ తధ్యం


Egyptian electionఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికీ ‘ముస్లిం బ్రదర్ హుడ్’ అభ్యర్ధి మహమ్మద్ ముర్సి దాదాపు పై చేయి సాధించాడు. 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని ప్రెస్ టి.వి తెలిపింది. 26 శాతం ఓట్లతో ముర్సి ముందంజలో ఉండగా, మాజీ నియంత హోస్నీ ముబారక్ ప్రభుత్వంలో చివరి ప్రధానిగా పని చేసిన అహ్మద్ షఫిక్ 24 శాతం ఓట్లతో రెండవ స్ధానంలో ఉన్నాడని బి.బి.సి తెలిపింది.  వీరి ఓట్ల శాతం వరుసగా 25 శాతం, 23 శాతం అని ప్రెస్ టి.వి తెలిపింది. ఎవరికీ 50 శాతం ఓట్లు రానందున ‘రనాఫ్ ఎన్నికలు తధ్యంగా మారాయి.

మొత్తం 13,100 పోలింగు స్టేషన్లకు గాను దాదాపు 12,800 కి పైగా లెక్కింపు పూర్తయినట్లు ప్రెస్ టి.వి తెలిపింది. అధికారికంగా మే 29 న ఫలితాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. మొదటి సారి ఎన్నికల్లోనే అధ్యక్ష స్ధానం చేజిక్కించుకోవాలంటే 50 శాతం ఓట్లు తప్పనిసరి. ఆ దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేదు. దానితో మొదటి రెండు స్ధానాల్లో నిలిచిన అభ్యర్ధుల మధ్య ‘రనాఫ్ ఎన్నికలు’ జరుగుతాయి. ముర్సీ, షఫిక్ ల మధ్య పోటీ పాత విరోధుల మధ్య పోటీగా బి.బి.సి విలేఖరి యోలండే నెల్ వ్యాఖ్యానించింది. ముబారక్ పాలన కొనసాగిన 30 యేళ్ళ పాటు ‘ముస్లిం బ్రదర్ హుడ్’ తీవ్ర అణచివేతకు గురయింది. ఈ నేపధ్యంలో యోలండే వ్యాఖ్య సందర్భోచితం.

ప్రజాస్వామిక సంస్కరణల కోసం జరిగిన విప్లవంలో పాల్గొన్నవారికి ఇష్టుడుగా పలువురు భావించిన హాండిన్ సబ్బాహి మూడవ స్ధానంలో ఉండగా, ముస్లిం బ్రదర్ హుడ్ నుండి బైటికి వచ్చి అధ్యక్షుడుగా పోటీ చేసిన అబౌల్ ఫోతౌ నాల్గవ స్ధానంలో నిలవగా ‘ఫ్రంట్ రన్నర్’ గా పశ్చిమ దేశాలు ఇష్టంగా పిలుచుకున్న ‘అమీర్ మౌస్సా’ ఐదవ స్ధానంలో నిలిచాడు. విప్లవంలో పాల్గొన్నవారి ఓట్లను సబ్బాహి, మౌస్సా లు చీల్చారని బి.బి.సి విశ్లేషించింది. విప్లవ కార్యకలాపాలకు రెండవ కేంద్రంగా ఉన్న ‘అలెగ్జాండ్రియా’ లో సబ్బాహీ అత్యధిక ఓట్లు గెలుచుకున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారని బి.బి.సి తెలిపింది.

ఈజిప్టు సమాజంలో ముస్లిం బ్రదర్ హుడ్ కు ప్రముఖ స్ధానం ఉంది. ముబారక్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆ సంస్ధ నియంతృత్వ పాలనలో తీవ్ర నిర్భంధాన్ని ఎదుర్కొంది. ముస్లిం బ్రదర్ హుడ్ ని అణచివేయడం వల్లనే ముబారక్ పాలనను ‘సెక్యులర్ పాలన’ గా పశ్చిమ దేశాల పత్రికలు కీర్తిస్తూ వచ్చాయి. ప్రజల ఇష్టా యిష్టాలే అంతిమ పాత్ర పోషించాలన్న సూత్రాన్ని అవి విస్మరించాయి. ప్రజాస్వామిక విప్లవంలో సైతం ముస్లిం బ్రదర్ హుడ్ సంస్ధ ప్రముఖ పాత్ర పోషించింది. పశ్చిమ దేశాల మద్ధతు ఉన్న ఎన్.జి.ఓ సంస్ధలు ఉద్యమంలో ‘లెఫ్ట్’ ముద్రతో ముస్లిం బ్రదర్ హుడ్ తో సమాన పాత్ర పోషించాయి.

అమిర్ మౌస్సా ముబారక్ మంత్రివర్గంలో ప్రముఖుడు. అనేక ఏళ్ల పాటు అరబ్ దేశాల కూటమి ‘అరబ్ లీగ్’ కు నాయకత్వం వహించాడు. ఆయన నేతృత్వంలోనే అరబ్ లీగ్ సాటి అరబ్ దేశం లిబియా పై హంతక వైమానిక దాడులకు అనుమతించి గడ్దాఫీ ప్రభుత్వం కూలిపోవడానికి సహకరించింది. అలాంటి అమీర్ మౌస్సా అధ్యక్షుడుగా ప్రమోట్ చేయడానికి పశ్చిమ దేశాలు ఆసక్తి చూపడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అలాగని ముస్లిం బ్రదర్ హుడ్ గానీ, షఫిక్ గానీ అమెరికా, యూరప్ ల సామ్రాజ్యవాద ఆధిపత్యానికి సహకరించకుండా ఉండరని చెప్పలేము. మహా అయితే ఇజ్రాయెల్ తో ఘర్షణాత్మక వైఖరిని ముస్లిం బ్రదర్ హుడ్ అవలంబించవచ్చు. అందులో కూడా నిజాయితీ ఉండగలదన్న సూచనలు ప్రస్తుతానికైతే లేవు.

ఈజిప్టులో మొత్తం 50 మిలియన్ల మంది (5 కోట్లు) ఓటింగ్ కు అర్హులు కాగా కేవలం 50 శాతం మాత్రమే అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. 13 మంది అభ్యర్ధులు అధ్యక్ష పదవికి పోటీ చేశారు.

వ్యాఖ్యానించండి