ఆఫ్ఘనిస్ధాన్ లో ఉన్న తమ యుద్ధ బలగం (combat troops) అంతటినీ సంవత్సరం ముందే ఉపసంహరించుకోవడానికి నిర్ణయించినట్లు ఫ్రాన్సు కొత్త అధ్యక్షుడు ‘ఫ్రాంకోయిస్ హాలండే’ ప్రకటించాడు. ఒక రోజు సందర్శన కోసం ఆఫ్ఘనిస్ధాన్ వచ్చిన హాలండే, ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో కలిసి విలేఖరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశాడు. ఆఫ్ఘన్ నుండి ఫ్రెంచి బలగాల ఉపసంహరణ హాలండే ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. ఈ వారం చికాగోలో జరిగిన నాటో సమావేశాల్లోనే తన ఉద్దేశ్యం వెల్లడించిన హాలండే వారాంతానికల్లా దాన్ని ఆచరణలో పెట్టాడు.
2013 లోగా మొత్తం బలగాలను ఉపసంహరిస్తామని గత అధ్యక్షుడు సర్కోజీ ప్రకటించాడు. దాని కంటే ముందే ఉపసంహరిస్తానని హాలండే వాగ్దానం చేశాడు. ఆఫ్ఘన్ యుద్ధం పట్ల ఫ్రాన్సు ప్రజల్లో ప్రబలిన వ్యతిరేకతను హాలండే సొమ్ము చేసుకున్నాడు. ఆఫ్ఘన్ లో మొత్తం 3400 బలగాలు ఉండగా అందులో 2000 మందిని ఈ సంవత్సరమే ఉపసంహరిస్తామని విలేఖరుల సమావేశంలో ప్రకటించాడు. మిగిలిన 1400 మంది ఆఫ్ఘన్ బలగాలకు శిక్షణ ఇవ్వడానికీ, లాజిస్టిక్స్ కోసమూ ఆఫ్ఘన్ లో కొనసాగుతారనీ, వారికి యుద్ధ బాధ్యతలేవీ ఉండవని తెలిపాడు.
కపిసా రాష్ట్రం, నిజ్రబ్ జిల్లాలో ఉన్న ఫ్రెంచి సైనిక స్ధావరాన్ని హాలండే సందర్శించాడు. హాలండే ఆఫ్ఘన్ సందర్శనను ముందుగా ప్రకటించలేదు. భద్రతా భయాలే దీనికి కారణం. కొద్ది వారాల క్రితం ఒబామా ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి ఆఫ్ఘన్ సందర్శించినప్పటికీ ఆయన విమానం వెళ్ళిన కొద్ది నిమిషాలకే విమానాశ్రయం సమీపంలోనే పేలుడు సంభవించింది. తమ సైనికులను కలిసిన అనంతరం హాలండే ఆఫ్ఘన్ అధ్యక్షుడితో ఉపసంహరణ విషయమై చర్చలు జరిపాడు. ఆయన పధకం ప్రకారం కొంత మంది సైనికులు మిలట్రీ పరికరాలను వెనక్కి పంపడానికి సాయం చేస్తారు. మరి కొందరు ఆఫ్ఘన్ సైనికులకు శిక్షణ ఇస్తారు. 1400 మంది సైనికుల్లో ఎంతమందిని ఈ రెండు పనులకు కేటాయిస్తున్నదీ హాలండే చెప్పలేదు.
“డిసెంబరు 31, 2012 తర్వాత ఆఫ్ఘనిస్ధాన్ లో మా యుద్ధ బలగాలేవీ ఉండవు. యుద్ధ బలగాలని నిర్ధిష్టంగా చెబుతున్నాను. ఆఫ్ఘన్ ఆర్మీ అధికారులకు శిక్షణ ఇవ్వడానికి ఇంకా మా మిలిటరీ బలగాలు ఇక్కడ కొనసాగుతాయి. వారు ఆసుపత్రి దగ్గరా, ఎయిర్ పోర్ట్ దగ్గరా కూడా ఉంటారు. ఆఫ్ఘన్లు శక్తివంతమైన పోలీసు బలగాలు కలిగి ఉండడానికి వారు సాయం చేస్తారు” అని ఫ్రాన్సు ఎంబసీలో జరిగిన కార్యక్రమంలో హాలండే ప్రసంగిస్తూ అన్నాడని ‘ది హిందూ’ తెలిపింది. ఆఫ్ఘన్ లో ఫ్రాన్సు బలగాల ఉనికి కొనసాగినప్పటికీ అవి భిన్న పాత్ర స్వీకరిస్తాయని ఆయన స్పష్టం చేశాడు.
అమెరికా, బ్రిటన్ తర్వాత ఆఫ్ఘన్ లో ఫ్రెంచి బలగాల సంఖ్యే ఎకువ. ఆఫ్ఘనిస్ధాన్ లో నలుమూలలా అవి ఉన్నాయి. తూర్పున కపిసా రాష్ట్రంలో సూరోబి జిల్లాలోనూ, దక్షిణాన కాందహార్ వైమానిక స్ధావరంలోనూ, రాజధాని కాబూల్ లోనూ ఫ్రాన్సు బలగాలు ఉన్నాయి. కాందహార్ లో మూడు ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఉపసంహరించబడుతున్న 2000 మందిలో ఎక్కువ మంది సురోబి లో ఉన్నారని ఫ్రాన్సు మిలట్రీ ప్రతినిధి కల్నల్ ధియేర్రీ బర్ఖర్డ్ తెలిపాడు. బలగాల ఉపసంహరణ వెనువెంటనే జరగదనీ అలా చేస్తే ఇక్కడ ఉండే బలగాల బధ్రతకు ప్రమాదమనీ ధియేర్రీ తెలిపాడు.
హాలండే చేసిన ప్రకటనతో ధియేర్రీ విభేదిస్తున్నట్లు కనిపిస్తోంది. యుద్ధ బలగాలను ఉపసంహరిస్తే ఇక్కడ ఉన్నవారిని ఎవరు కాపాడుతారని ఆయన ఒక టి.వి ఇంటర్వ్యూలో ప్రశ్నించాడని ‘ది హిందూ’ తెలిపింది. “మా సైనికులకి అది పెద్ద ప్రమాదం … దీని బట్టి చూస్తే ఫ్రాంకోయిస్ హాలండే కి రక్షణ విషయాలు, ప్రపంచ జియో పాలిటిక్స్ తెలియవని అనుకోవలసి వస్తోంది” అని బి.ఎఫ్.ఏం టెలివిజన్ లో మాట్లాడుతూ ధియర్రే వ్యాఖ్యానించాడు. “నాటో కూటమికి ఫ్రాన్సు మాట ఇచ్చింది. దానిని వెనక్కి తీసుకుంటే అది (మాట) బలహీనపడుతుంది” అని ఆయన వ్యాఖ్యానించాడు. యుద్ధరంగంలో ఉన్నవారికీ ప్రజా రంగంలో ఉన్నవారికీ మధ్య ఉండే తేడాను ధియర్రే, హాలండే ల మధ్య విభేధాలు ప్రతిబింబిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాలకే అంతిమ విలువ గనక హాలండే అభిప్రాయమే అంతిమమన్నది స్పష్టమే.
ఈ సంవత్సరం సెప్టెంబరు లోగా 33,000 అమెరికా బలగాలు ఉపసంహరిస్తామని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా గత సంవత్సరం ప్రకటించాడు. సెప్టెంబరు 30 నాటికల్లా ఆఫ్ఘనిస్ధాన్ లో 68,000 అమెరికా బలగాలు, 40,000 ఇతర దేశాల బలగాలు మిగులుతాయని ఈ వారంలోనే అమెరికా, నాటో ల కమాండర్ జాన్ అలెన్ ప్రకటించాడు. వీరి సంఖ్య గత యేడు 130,000 అని ఆయన తెలిపాడు. ఆఫ్ఘన్ బలగాల సంఖ్య 352,000 గా తెలుస్తోంది.