భూకంపం, ఫుకుషిమా అణు కర్మాగారాన్ని సాయంత్రం 2:50 ప్రాంతంలో తాకింది. దాదాపు మరో ముప్పావు గంటకి సునామీ అలలు 20 మీటర్ల ఎత్తున విరుచుకుపడి కర్మాగారాన్ని ముంచెత్తాయి. మార్చి 12 తేదీన పొద్దు గుంకక ముందు రియాక్టర్ లో నీటి స్ధాయి పడిపోవడం మొదలయింది. అంటే ఇంధన రాడ్లు వేడెక్కడం మొదలయిందని అర్ధం. దాదాపు సాయంత్రం 4 గంటలకు టెప్కో ఓ ప్రకటన విడుదల చేసింది. “కంటెయిన్ మెంట్ వెసెల్ (containment vessel) లో అధికంగా ఉంది. కానీ స్ధిరంగా ఉంది” అని ఆ ప్రకటన పేర్కొంది. ఈ ప్రకటనలో ఒక భాగాన్ని చాలామంది మిస్ ఆయారని ‘డి ఇండిపెండెంట్’ తెలిపింది: “అత్యవసర వాటర్ సర్క్యులేషన్ వ్యవస్ధ కోర్ లోపలి నీటియావిరిని (స్టీమ్) చల్లబరుస్తుండేది; అది పని చేయడం ఆగిపోయింది” అన్నదే ఆ భాగం.
ది ఇండిపెండెంట్ ఇలా తెలిపింది: రాత్రి 9:51 కల్లా రియాక్టర్ బిల్డింగ్ లోపలి భాగాన్ని ‘నో ఎంట్రీ జోన్’ గా చీఫ్ ఎక్జిక్యూటివ్ నుండి ఆదేశాలు వచ్చాయి. 11 గంటలకల్లా రియాక్టర్ కి పక్కనే ఉండే టర్బైన్ బిల్డింగ్ లో రేడియేషన్ స్ధాయి పెరిగిపోయింది. గంటకి 0.5 నుండి 1.2 మిల్లీ సీవర్ట్ ల వరకూ నమోదు అయింది. మరో విధంగా చెప్పాలంటే అప్పటికే చాలా ముందునుండే మెల్ట్ డౌన్ మొదలైపోయింది. ఆ స్ధాయిలో రేడియేషన్ కి 20 నిమిషాల పాటు ఎక్స్ పోజ్ అయితే జపాన్ లో ఒక న్యూక్లియర్ రియాక్టర్ కార్మికుడుకి ఉన్న 5 సంవత్సరాల పరిమితిని దాటినట్లు అవుతుంది.
మార్చి 12 ఉదయం 4, 6 గంటల మధ్యలో ప్లాంట్ మేనేజర్ ‘మసావో యోషిడా’ రియాక్టర్ కోర్ లోకి సముద్ర నీరు పంప్ చేయాలని నిర్ణయించి టెప్కో కి నోటిఫై చేశాడు. అయితే సాయంత్రం 8 గంటలకి రియాక్టర్ లో హైడ్రోజన్ పేలుడు సంభవించిన కొన్ని గంటల వరకూ కూడా సుముద్ర నీటిని పంపింగ్ చేసే పని మొదలు కాలేదు. అప్పటికే చాలా లేతయిందని ‘ది ఇండిపెండెంట్’ వ్యాఖ్యానించింది. ఆ తర్వాత రోజుల్లో టెప్కో తాను ముందు చేసిన ప్రకటనలను కొంతమేరకయినా సవరించుకుందని పత్రిక తెలిపింది. “Reactor Core Status of Fukushima Daiichi Nuclear Power Station Unit One” అన్న రిపోర్టు లో ‘సునామికి ముందే కర్మాగారంలోని కొన్ని కీలక భాగాలు, పైపులతో సహా, దెబ్బతిన్నాయని’ అంగీకరించిందని తెలిపింది.
“దీనర్ధం జపాన్ తో పాటు ఇతర దేశాల్లో కూడా పరిశ్రమ వర్గాలు రియాక్టర్లు దృఢమైనవని (robust) ఇస్తూ వచ్చిన హామీలు ఉత్తిదే (blown apart) అని తేలిపోయిందని షాన్ బర్నీ వ్యాఖ్యానించాడు. ఈయన ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణ ఉద్యమ సంస్ధ ‘గ్రీన్ పీస్’ కు అణు వ్యర్ధ పదార్ధాలకి సంబంధించిన సలహాదారు. “భూకంప తీవ్రత ఉన్న ప్రాంతాల్లో రియాక్టర్ల భద్రత గురించి మౌలికమైన అనుమానాలు దీనితో తలెత్తాయి” అని ఆయన అన్నాడు.
చల్లబరిచే వ్యవస్ధ దెబ్బతిన్న 16 గంటల తర్వాతా, యూనిట్ 1 లో పేలుడు జరిగిన ఏడెనిమిది గంటలకు ముందే పెద్ద ఎత్తున ఇంధన రాడ్లు కరిగిపోయాయని టెప్కో కూడా అంగీకరించినట్లు షాన్ ఎత్తి చూపినట్లు పత్రిక తెలిపింది. “ఇదంతా వారికి తెలిసినందున పెద్ద ఎత్తున నీటితో ముంచెత్తడానికి తీసుకున్న వారి నిర్ణయం మరింతగా భారీ స్ధాయిలో, సముద్రంలోకి లీక్ కావడంతో సహా, కాలుష్యం జరిగే అవకాశం గ్యారంటీగా ఉంది” అని షాన్ ని పత్రిక ఉటంకించింది.
భూకంపం వల్ల కర్మాగారానికి ఎంత నష్టం జరిగిందో పూర్తిగా ఎవరికీ తెలియదనీ, ఈ నష్టం వల్లనే ‘మెల్ట్ డౌన్’ జరిగిందనీ కూడా తెలియదనీ పత్రిక వ్యాఖ్యానించింది. అయితే టెప్కో డేటా ను బట్టీ, ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యాన్ని బట్టి చూస్తే భూకంపం వల్ల జరిగిన నష్టం గణనీయంగా ఉండని స్పష్టమవుతోందని వ్యాఖ్యానించింది.
హశుయికే వ్యాఖ్యతో ‘ది ఇండిపెండెంట్’ తన కధనాన్ని ఇలా ముగించింది. “టెప్కో మరియు జపాన్ ప్రభుత్వమూ అనేక వివరణలు ఇచ్చారు. వాటిలో దేనికీ అర్ధం లేదు. వారు అందజేయని ఒకే ఒక్క అంశం ‘నిజం’. ఇప్పటికైనా వారు నిజం చెప్పాలి.”