టి.వి ఇంటర్వ్యూ మధ్యలోనే ఆగ్రహంతో వెళ్ళిపోయిన మమత


Mamata storms out of CNN-IBN studioపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తన ఫాసిస్టు ఉద్దేశాలను మరోసారి వెళ్లగక్కింది. విద్యార్ధులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి బదులు “మీరంతా మావోయిస్టులు, సి.పి.ఐ (ఎం) పార్టీ వాళ్ళు” అని ఆరోపిస్తూ టి.వి ఇంటర్వూని మధ్యలోనే వదిలి వెళ్లిపోయింది. ప్రశ్నలను అడుగుతున్న విద్యార్ధులందరినీ ఫోటోలు తీసి విచారించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ మోడరేటర్ సాగరికా ఘోష్ వారంతా విద్యార్ధులని చెబుతున్నా వినకుండా స్టూడియో నుండి ఆగ్రహంతో ఊగిపోతూ వెళ్లిపోయింది. పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మే 20 తో మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి కావస్తున్నది. ఈ సందర్భంగా ఆమెతో సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ చానెల్ ఇంటర్వ్యూ కోరింది. ఇంటర్వ్యూ రికార్డింగ్ కోసం ఆమె చానెల్ కి చెందిన స్టూడియో కి వచ్చింది. ప్రశ్నలు అడిగిన వారిలో జాదవ్ పూర్ యూనివర్సిటీ, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ లకు చెందిన విద్యార్ధులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడుల పైనా, ప్రజల ప్రజాస్వామిక హక్కులను అధికారులు హరించడం పైనా, జాదవ్ పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒకరిని కార్టూన్ విషయంలో అరెస్టు చేయడం పైనా విద్యార్ధులు ప్రశ్నలు సంధించడం మమత కి నచ్చలేదు. తనకు నచ్చని ప్రశ్నలు అడగడమే నేరంగా ఆమె నిర్ధారించి విద్యార్ధులపైకి పోలీసుల్ని ఉసి గోల్పింది.

“నేను మీకో విషయం చెప్పి తీరాలి. మీరంతా సి.పి.ఐ(ఎం) కేడర్లు, మావోయిస్టు కేడర్లు. సి.పి.ఐ(ఎం) ప్రశ్నలకు నేను జవాబు చెప్పను” అని చెప్పి ఆగ్రహంతో ఊగిపోయింది. “విద్యార్ధులు మావోయిస్టు ప్రశ్నలూ, సి.పి.ఐ(ఎం) ప్రశ్నలే అడుగుతున్నారు. వాళ్ళంతా మావోయిస్టు విద్యార్ధులు.” అంటూ యాంకర్ సాగరికా ఘోష్ తో మమత ఫిర్యాదు చేసీంది. సాగరికా ఘోష్ ఆమెను శాంత పరచడానికి విఫలయత్నం చేసింది. వారంతా యూనివర్సిటీ విద్యార్ధులని నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. “అయితే ఏంటి? వారు మావోయిస్టు కార్యకలాపాల్లో ఉన్నందునే వారిని సెలెక్ట్ చేశారు” అంటూ గుడ్లురిమింది.

శనివారం నుండి పోలీసులు విచారణ ప్రారంభించినట్లు అనధికారిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని ‘ది హిందూ’ తెలిపింది. ఈ దెబ్బతో యూనివర్సిటీ విద్యార్ధులు బిక్కు బిక్కు మంటున్నారు. రానున్నది తలచుకుని బెంబేలెత్తుతున్నారు. “శుక్రవారం జరిగింది చూసి షాక్ కీ, భయానికీ గురయ్యాను. ప్రజాస్వామ్యం గురించి ఆక్రోశించే ఓ ముఖ్యమంత్రి నుండి ఇలాంటిది అసలు ఊహించలేదు” అంటూ టి.వి కార్యక్రమంలో పాల్గొన్న ఓ విద్యార్ధి అన్నాడని ‘ది హిందూ’ తెలిపింది. ప్రతీకార చర్యలు ఉంటాయన్న భయంతో విద్యార్ధి పేరు చెప్పడానికి ఇష్టపడలేదని పత్రిక తెలిపీంది.

జాదవ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. సత్యజిత్ రే సినిమాల్లో ప్రాచుర్యం పొందిన ఓ సినిమాలో సన్నివేశాన్ని పేరడీ చేస్తూ ఉన్న ఒక కార్టూన్ ను ఆయన ఈమెయిల్ ద్వారా మిత్రులకు పంపాడు. ఆ కార్టూన్ సందేశంలో తనను చంపేసే కుట్ర దాగి ఉందని ఆమె రెండు రోజుల క్రితం పత్రికలతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ సిబ్బంది హౌసింగ్ సొసైటీ కి సంబంధించి ఒక కాంట్రాక్టు వివాదం ప్రొఫెసర్ అరెస్టు వెనుక పని చేసిందని ఆ తర్వాత పత్రికలు వెల్లడించాయి.

ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే తనను ముఖ్యమంత్రిగా ఎంన్నుకున్నారన్న సంగతిని మమత బెనర్జీ పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. తనపై విమర్శలన్నింటినీ కుట్రగా ఆమె అభివర్ణిస్తోంది. తనను ఎవరో చంపాలని చూస్తున్నట్లుగా పదే పదే ఆరోపిస్తున్నది. కలకత్తా లో సామూహిక మాన భంగం జరిగినా అలాంటిదేదీ జరగలేదనీ, తన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి సి.పి.ఎం చేసీన కుట్రగా ఆమె కొట్టిపారేసింది. సామూహిక మానభంగం నిజమేనని మహిళా పోలీసు అధికారి జరిపిన సమర్ధవంతమైన విచారణలో తేలడంతో ఆ అధికారిని ప్రాధాన్యత లేని పోస్టుకి బదిలీ చేయడానికి సైతం మమత వెనుకాడలేదు. ఇంకా నాలుగు సంవత్సరాల పాలన మిగిలి ఉన్నప్పటికీ ఐదేళ్లలో చేయదలుచుకున్న దానిలో 90 శాతం ఇప్పటికే పూర్తి చేశానని ఆమె ప్రకటించుకుంది. ఆమె పాలన ఎలా ఉందో నిర్ణయించాల్సింది ప్రజలేనన్న కనీస సూత్రాన్ని ఆమె విస్మరించింది. పట్ట పగలు ఊరేగింపులో జరిగిన రాజకీయ హత్యను సైతం ఆమె తనపై జరిగిన కుట్రగా అభివర్ణించి అప్రతిష్టపాలయింది. తాజాగా తనకు నచ్చని ప్రశ్నలు అడినందుకే విద్యార్ధులను మావోయిస్టులుగా, సి.పి.ఐ(ఎం) కేడర్ గా ముద్ర వేసి శిక్షించడానికి పూనుకుంది. ప్రతిపక్ష పార్టీ సి.పి.ఐ(ఎం) ని సమర్ధించడమే నేరంగా, చట్ట వ్యతిరేకంగా ఆమె పరిగణిస్తున్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక పాలన సమర్ధవంతగా పని చేయడానికి ప్రతిపక్షం అత్యవసరమన్న కనీస సూత్రాన్ని ఆమె పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది. తాను కూడా సంవత్సరం క్రితం వరకూ ప్రతిపక్షం లో ఉన్నానన్న సంగతిని మరిచి ప్రవర్తిస్తోంది. తన అధికారం శాశ్వతమని భ్రమిస్తున్నట్లు కనిపిస్తోంది.

వ్యాఖ్యానించండి