ముంబై లో జరిగిన ఒక రేవ్ పార్టీ పై పోలీసుల రెయిడింగ్ పుణ్యమాని తాను పుట్టి బుద్ధెరిగాక ఆల్కహాల్ చుక్క కూడా ముట్టి ఎరగని క్రికెటర్ గురించి దేశానికి తెలిసొచ్చింది. నిజానికి ఒక క్రికెట్ ప్లేయర్ ఆల్కహాల్ తాగుతాడా లేదా అన్నది పెద్ద వార్త కాదు. కానీ జాతీయ జట్టుకో, ఐ.పి.ఎల్ జట్టుకో ఆడటం మొదలు పెట్టాక తాగకుండా ఉంటే గనక పెద్ద వార్తే.
ముఖ్యంగా ఐ.పి.ఎల్ లో పొంగి ప్రవహిస్తున్న డబ్బూ, ప్రతీ లీగ్ మ్యాచ్ తర్వాతా పార్టీల పేరుతో పొంగి పారుతున్న సారా (షాంపేన్, డ్రగ్స్) లను ఒక్కసారి తలచుకున్నాక రాహుల్ శర్మ నియమబద్ధత గురించి చెప్పుకోక తప్పదు.
“నేను సామాన్య కుటుంబానికి చెందినవాడిని. నా జీవితంలో బీరు కూడా ముట్టి ఎరగను. ఇక రేవ్ పార్టీ కి హాజరయ్యే సమస్య ఎక్కడిది?” అని ముంబై రెయిడింగ్ లో పట్టుబడిన సెలబ్రిటీలలో ఒకరయిన రాహుల్ శర్మ ‘ది హిందూ’ తో మాట్లాడుతూ ప్రశ్నించాడు.
భారత జట్టు సభ్యుడు, పూణే వారియర్స్ ఐ.పి.ఎల్ జట్టు సభ్యుడు కూడా అయిన రాహుల్ శర్మ ముంబై, జూహు లో జరిగిన రేవ్ పార్టీలో ఉన్నాడంటూ పోలీసులు అరెస్టు చేసారు. తన అరెస్టు విషయమై ఆయన ‘ది హిందూ’ పత్రిక కు వివరాలిచ్చాడు. పూణే వారియర్స్ జట్టులో మరో సభ్యుడయిన వేన్ పేర్నెల్ కూడా ‘లెగ్ స్పిన్నర్’ రాహుల్ శర్మతో ఉన్నట్లు తెలుస్తోంది.
“నేను అమాయకుడ్నని నాకు తెలుసు. రిపోర్ట్స్ లో ‘పాజిటివ్’ వస్తే క్రికెట్ ని వదిలేస్తాను” అని రాహుల్ శర్మ ప్రకటించాడు. రాహుల్ వ్యక్తం చేస్తున్న ఆత్మ విశ్వాసమే ఆయన నిర్దోషిత్వానికి రుజువుగా కనిపిస్తోంది. “విజయాల తర్వాత జరిగే పార్టీల్లో నేనెప్పుడూ షాంపేన్ ముట్టనని మా జట్టు సభ్యులందరికీ తెలుసు” అని రాహుల్ తెలిపాడు. తాను వాస్తవానికి బర్త్ డే పార్టీకి వెళ్లాననీ అక్కడ రేవ్ పార్టీ జరుగుతున్న సంగతి తనకి తెలియదని తెలిపాడు.
బీరు, విస్కీ, సారా లాంటి మత్తు పదార్ధాలకి అలవాటు పడడం యువతరానికి ఒక ఫ్యాషన్. నిజానికి తాగుడు ఫ్యాషన్ ఇప్పటి యువతరానికే పరిమితం చెయ్యడానికి లేదు. ఎప్పటినుండో ఉన్నదే ఇది. సరదాగా మొదలు పెట్టి పీకల్దాకా అలవాటులో కూరుకు పోయి ఇల్లూ వళ్ళూ గుల్ల చేసుకుంటున్నవారు కోట్లమంది ఉన్నారు. స్వేచ్ఛగా తాగి తందనాలాడడం ఒక ‘కల్చర్’ గా సమర్ధించుకునేవారు బోలెడు మంది నిత్యం తారసపడుతుంటారు.
యూనివర్సిటీ విద్య పూర్తి చేశాక తాగుడు ఆలావాటు లేకుండా బయటపడ్డవారిని చూసి చాలామంది ఆశ్చర్య పోతుంటారు. తాగుడు అలవాటు పట్ల సమాజంలో ఉన్న ఆమోదమే ఆ ఆశ్చర్యానికి కారణమని చెప్పనవసరం లేదు. అలాంటిది విచ్చలవిడిగా దొంగ డబ్బు ని సమకూర్చి పెడుతున్న ఐ.పి.ఎల్ క్రికెట్ టీం సభ్యుడికి ఇంతవరకూ తాగుడు అలవాటు కాకపోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఇలాంటి విలువలతో కూడిన వ్యక్తిగత నిబద్ధతలే యువతకి ఆదర్శం కావాలి.