సాయుధ బలగాల్లో మహిళల ప్రవేశానికి ‘రక్షణ మంత్రిత్వ శాఖ’ అడ్డుపడుతోందని పార్లమెంటరీ కమిటీ దుయ్యబట్టింది. మగ అధికారుల సంఖ్యలో లోపాన్ని పూడ్చడానికి వీలుగా ‘టైమ్ గ్యాప్’ ఏర్పాటు గా మాత్రమే మహిళా అధికారుల సేవలను పరిగణించడం పట్ల అభ్యంతరం తెలిపింది. త్రివిధ దళాల సేవలకు మహిళలను అనర్హులుగా చూస్తున్నారని ఎత్తిచూపింది.
మహిళలకోసం శాశ్వత కమిషన్ కు అనుమతి ఇవ్వకుండా సాగదీయడం ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ ‘వివక్ష’ పాటిస్తున్నదని కూడా పార్లమెంటరీ ప్యానెల్ అభిప్రాయపడింది. సాయుధ దళాల్లో మరింతమంది మహిళలను చేర్చుకోవడానికి అందిన వివిధ సిఫారసుల పట్ల ‘గుడ్డితనం’ తో వ్యవహరిస్తున్నదని ఆరోపించింది.
‘సాయుధ దళాల్లో మహిళలు’ పేరుతో శుక్రవారం పార్లమెంటులో ఒక నివేదికను ప్రవేశపెట్టారు. మహిళా సాధికారత పై ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ నివేదికను తయారు చేసింది. “సాయుధ దళాల్లో మహిళల ప్రవేశం విషయానికి వచ్చేసరికి ‘నెగిటివిజం’ ప్రదర్శించడాన్ని అర్ధం చేసుకోలేకపోతున్నాం. సాయుధ దళాల్లోని వివిధ విభాగాల్లోకి మరింతమంది మహిళలను తీసుకోవాలన్న సిఫారసును పునరుల్లేఖిస్తున్నాం” అని నివేదిక పేర్కొంది.
శాశ్వత ప్రాతిపదికన మహిళల నియామకానికి చర్యలు తీసుకోవాలన్న సిఫారసు గురించి మాట్లాడుతూ నివేదిక “కొన్ని ప్రత్యేక విభాగాలలో మాత్రమే మహిళల నియమకాన్ని పరిగణిస్తామన్న పాత నిర్ణయానికి కట్టుబడి ఉండడం ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ సిఫారసు పట్ల ‘గుడ్డితనం’ ప్రదర్శిస్తోంది” అని పేర్కొంది.
మిలిటరీ పోలీస్, ఆర్మీ పోస్టల్ సర్వీస్, జనరల్ సర్వీస్ లాంటి వివిధ విభాగాల్లో మరింత మంది మహిళా అధికారులను తీసుకునే అవకాశాలను పరిశీలించాలని కమిటీ సూచించినప్పటికీ రక్షణ మంత్రిత్వ శాఖ ఆ సూచన పట్ల దారుణమైన విముఖత చూపిందని తెలియజేసింది. మహీళా అధికారులకు ప్రవేశం కల్పించే ప్రతి చిన్న అవకాశాన్నీ పరిశీలించాల్సి ఉండగా పాత వివక్షా పద్ధతులనే అంటిపెట్టుకుని ఉన్నదని వివరించింది.
మహిళా అభ్యున్నతి అన్న అంశానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా మగ అధికారులు అందుబాటులో లేనప్పుడే మహిళల అధికారులను చేర్చుకునే పరిస్ధితి నెలకొని ఉండడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని కమిటీ వ్యక్తం చేసింది.
శాశ్వత ప్రాతిపదికన మహిళా అధికారులను నియమించడం లేదని గత నవంబరులో భారత ఆర్మీ రక్షణ మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. మహిళా ధికారుల నియామకం ప్రస్తుతం న్యాయ, విద్యా విభాగాల వరకే పరిమితమని తెలిపింది.
మూడేళ్ళ క్రితంతో పోలిస్తే సాయుధ బలగాల్లో మహిళా అధికారుల నియమాకం తగ్గిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లలో 2008 లో వరుసగా 1072, 957 మంది మహిళా అధికారులు ఉండగా 2011 నాటికి 1055, 936 కి పడిపోయింది. అయితే ఇండియన్ నేవీలో మాత్రం ఈ సంఘ 173 నుండి 232 కి పెరిగిందని తెలుస్తోందని.
“మహిళా సాధికారత” అంటూ ప్రభుత్వాలు చెప్పేవన్నీ ఉత్తుత్తి కబుర్లేనని పార్లమెంటరీ ప్యానెల్ నివేదిక ద్వారా స్పష్టం అవుతోంది. సమాజంలోని అనేక వివక్షతలను తొలగించడంలో ప్రభుత్వాలకు ఉన్న చిత్త శుద్ధి లేమి మహీళా వివక్ష ను తొలగించే విషయంలో కూడా కొనసాగుతోంది. చరిత్రలో అనేక యుద్ధాల్లో మహిళలు తమ సత్తా చాటుకున్నప్పటికీ