మధ్య ప్రాచ్యం (పశ్చిమాసియా) లో ప్రధాన నీటి అఖాతం ‘పర్షియన్ గల్ఫ్’ పేరును గూగుల్ తన మేప్ సర్వీస్ లో తొలగించడం పై న్యాయ చర్యలు తీసుకుంటానని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ను ఇతర గల్ఫ్ దేశాలనుండి ‘పర్షియన్ గల్ఫ్’ సముద్ర జలాలు వేరు చేస్తాయి. ప్రపంచంలోనే భారీ స్ధాయిలో క్రూడాయిల్ నిల్వలు ఈ సముద్ర జలాల్లో ఉన్నట్లు కనుగొన్నప్పటి నుండీ ఈ ప్రాంతానికి ఆర్ధిక, రాజకీయ, వాణిజ్య ప్రాముఖ్యత పెరిగింది. ఈ జలాల్లో ఉన్న హోర్ముజ్ ద్వీప కల్పం ద్వారా ప్రపంచంలోని నలుమూలలకు క్రూడాయిల్ ఎగుమతులు జరుగుతాయి. అలాంటి ప్రాంతాన్ని ఇరాన్ సంస్కృతిని తలపించే ‘పర్షియన్’ పేరును నామ మాత్రం చేసే ప్రయత్నాలను ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తుంది.
‘పర్షియన్ గల్ఫ్’ పేరు చారిత్రకమైనది. అయినప్పటికీ ఇరాన్ తో ఉన్న విభేధాల కారణంగా ఇతర గల్ఫ్ దేశాలు ముఖ్యంగా సౌదీ అరేబియా దీనిని ‘అరేబియా గల్ఫ్’ గా పిలవాలని కోరుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఒమన్, కతార్, కువైట్ దేశాలు సౌదీ అరేబియాకు మద్దతు ఇస్తున్నాయి. ఇరాన్ తో పాటు ఈ దేశాలన్నీ పర్షియన్ అఖాతం తీరంగా కలిగి ఉన్నవే. పర్షియా అఖాతాన్ని అరేబియా అఖాతంగా లేదా కనీసం రెండు పేర్లతోనైనా పిలవాలన్న గల్ఫ్ దేశాల డిమాండ్ ని ఇరాన్ తిరస్కరిస్తోంది. గూగుల్ సంస్ధ వీరి ప్రాంతీయ తగాదాలోకి తలదూరుస్తోంది. తద్వారా అది కేవలం వ్యాపార లక్ష్యాలే కాకుండా రాజకీయ లక్ష్యాలు కూడా కలిగి ఉందన్న అనుమానాలకు తావిస్తోంది.
ఈ నేపధ్యంలో గూగుల్ తన మేప్ సర్వీస్ లో ‘పర్షియన్ గల్ఫ్’ పేరును తొలగించడాన్ని ఇరాన్ సీరియస్ గా పరిగణించింది. ఇదే పద్ధతి కొనసాగిస్తే ‘తీవ్ర నష్టాలు’ ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. “సాధ్యమైనంత త్వరగా గూగుల్ తన తప్పులను సవరించుకోవాలి. లేనట్లయితే గూగుల్ కి వ్యతిరేకంగా అధికారికంగా ఫిర్యాదు చేస్తాము” అని ఇరాన్ విదేశాంగ మంత్రి రామిన్ మెహ్మన్ పరాస్త్ హెచ్చరించినట్లు బి.బి.సి తెలిపింది. “రాజకీయ వివాదాలలో ఆధునిక టెక్నాలజీ తో ఆటలాడుకోవడం ఇరాన్ శత్రువుల కొత్త చర్యలుగా కనిపిస్తోంది. ఈ విషయంలో గూగుల్ plaything గా మారింది. ‘పర్షియన్ గల్ఫ్’ పేరు ని తొలగించడం అంటే ఇరాన్ జాతీయ భావాలతోటీ, వాస్తవాలతోటీ ఆటాడుకోవడమే” అని రామిన్ ని ఉటంకిస్తూ సి.ఎన్.ఎన్ వార్తా సంస్ధ తెలిపింది.
మే నెలారంభంలో గూగుల్ తన మేప్ సర్వీస్ నుండి ‘పర్షియన్ గల్ఫ్’ పేరు తొలగించిందని ఇరాన్ వార్తా సంస్ధ ఇర్నా ప్రకటించినప్పటి నుండి వివాదం ప్రారంభం అయింది. గూగుల్ చర్యను ఇరాన్ ప్రభుత్వమూ, ప్రతిపక్షాలూ ముక్త కంఠంతో ఖండించాయి. అనేక వేలమంది ఇరానియన్ బ్లాగర్లు అనేక ఆన్ లైన్ ఫోరం లలో దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారనీ బి.బి.సి తెలియజేసింది. ఫేస్ బుక్ లో తొమ్మిది పేజీలు ఈ కారణం కోసమే ఇరానియన్లు నడుపుతున్నట్లు తెలుస్తోంది.
గూగుల్ ఈ ఆరోపణలు తిరస్కరిస్తోంది. తాము మొదటి నుండీ ఈ ప్రాంతాన్ని పేరుతో పిలవలేదని అంటోంది. ప్రపంచంలో ప్రతీ ప్రాంతాన్ని తాము పేరు పెట్టి పిలవలేదని గూగుల్ ప్రతినిధి చెప్పినట్లుగా బి.బి.సి తెలిపింది. అయితే అలా పేరు పెట్టి పిలవని మరొక ప్రాంతాన్నేమీ ఆ ప్రతినిధి చెప్పలేకపోయాడని కూడా ఆ సంస్ధ తెలిపింది. అయితే గూగుల్ ఎర్త్ సంస్ధ ఈ ప్రాంతాన్ని ‘పర్షియన్ గల్ఫ్’, ‘అరేబియన్ గల్ఫ్’ రెండు పేర్లతోనూ చూపడం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఈ వివాదం విమానయాన సంస్ధలకు కూడా పాకింది. విమానాల్లో ఉండే మానిటర్లపైన ‘పర్షియన్ గల్ఫ్’ ప్రాంతాన్ని ‘అరేబియన్ గల్ఫ్’ ప్రాంతంగా చూపే విమానాలను ఇరాన్ గగన తలంలోకి ప్రవేశించకుండా నిషేదిస్తామని 2010 లో ఇరాన్ ప్రభుత్వం హెచ్చరించింది. అదే సంవత్సరం జరగవలసిన ‘ఇస్లామిక్ సాలిడారిటీ గేమ్స్’ కూడా ఈ కారణంతో రద్దయ్యాయి. ఆటల నిర్వాహకులు మెడల్స్ పైన ఈ రెండు పేర్లలో దేనిని వినియోగించుకోవాలన్నదానిపై ఒక అంగీకారానికి రాలేకపోవడంతో మొత్తం ఆటలనే రద్దు చేసుకున్నారు.
ప్రపంచ అట్లాస్ ఎడిషన్ లో ‘పర్షియన్ గల్ఫ్’, ‘అరేబియన్ గల్ఫ్’ రెండు పేర్లనూ చూపడానికి ‘నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ’ 2004 లో నిర్ణయించాక
ఇరాన్ దానికి వ్యతిరేకంగా ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ ప్రచారంలో ఇరానియన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాని ఫలితంగా గూగుల్ సెర్చ్ సర్వీస్ లో ‘అరేబియన్ గల్ఫ్’ పేరుతో వెతికినట్లయితే అలాంటిది లేదని తెలిపే ఒక పేజీ ప్రత్యక్షం అవుతుంది.
అమెరికా మిలట్రీ కూడా గతంలో ఈ ప్రాంతాన్ని ‘అరేబియా గల్ఫ్’ గా చూపింది. ‘నేషనల్ ఇరానియన్ అమెరికన్ కౌన్సిల్’ దానిపై ఫిర్యాదు కూడా చేసింది. “అరేబియన్ గల్ఫ్ అన్న ప్రచారం ‘పాన్-అరబిజం’ ప్రాపగాండాగా మొదలయింది. తర్వాత సద్ధామ్ హుస్సేన్ స్ధానికంగా ఉన్న జాతి విరోధాలను తనకు అనుకూలంగా వాడుకోవడానికి పిపి ప్రచారాన్ని వాడుకున్నాడు” అని సదరు కౌన్సిల్ తన ఫిర్యాదులో పేర్కొందని సి.ఎన్.ఎన్ తెలిపింది. అమెరికా నేవీ ఫేస్ బుక్ పేజీ పైన ఇరానియన్లు పెద్ద ఎత్తున దాడి చేశాక అమెరికా నేవీ స్పందించింది. తన మిలట్రీ కోసం మాత్రమే ‘అరేబియన్ గల్ఫ్’ గా చూపుతున్నామనీ, నాటికల్ చార్ట్స్ లో గానీ, ప్రచురణలలో గానీ ‘ చారిత్రక పర్షియన్ గల్ఫ్’ అనే వాడుతున్నామనీ వివరణ ఇచ్చుకుంది.
‘పర్షియన్ గల్ఫ్’ అని కాకుండా ‘ది గల్ఫ్’ అని చూపినందుకు 2006 లో లండన్ కి చెందిన ‘ది ఎకనమిస్ట్’ పత్రికను ఇరాన్ నిషేధించిందనీ, పారిస్ లోని లోవ్రే మ్యూజియం కి చెందిన గైడ్లు కూడా అలాగే సంబోధించినందుకు గాను ఇరాన్ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిందనీ ‘గార్డియన్’ పత్రిక తెలిపింది.
ప్రపంచంలోని వివిధ భౌగోళిక ప్రాంతాలకు ఉన్న పేర్లతో స్ధానిక ప్రజలకు భావోద్వేగాలతో కూడిన అనుబంధాలు ఉండడం సహజమైన విషయం. ఈ భావోద్వేగాలతో ఆడుకోవడం, తన రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలకు వాటిని వినియోగించుకోవడం అమెరికాకి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి పనికిమాలిన ఎత్తుగడలకు అమెరికా గూగుల్ ని వినియోగించుకుంటోందన్న అనుమానాలు క్రమేణా బలపడుతున్నాయి.
ఇంకా నయం. భవిష్యత్ లో మన కాశ్మీర్నో..అరుణాచల్ ప్రదేశ్ నో…కూడా గూగుల్ అలాగే చూపే ప్రమాదం ఉందనిపిస్తోంది.
అమెరికా కంపెనీల ప్రయోజనాల కంటే భారత కంపెనీల ప్రయోజనాల్నే ప్రధానంగా ఎంచి అమెరికా కంపెనీల విచ్చలవిడి దోపిడీకి భారత ప్రభుత్వం మోకాలడ్డితే గనక మీరన్న పరిణామం ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే మన పాలకులకి అంత ధైర్యం లేదు. అమెరికా కంపెనీల ఎంట్రీకి అడ్డుపడ్డందుకు గడ్డాఫీ కి ఏం గతి పట్టిందో చూశాం. ఆ కారణం వల్లనే సిరియా, ఇరాన్ లపైన అమెరికా, యూరప్ లు యుద్ధానికి కాలు దువ్వుతున్నాయి. సిరియాలో కిరాయి తిరుగుబాటుని స్పాన్సర్ చేస్తూ, ఇరాన్ పైన దాడికి అమెరికా, యూరప్, ఇజ్రాయెల్ లు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మన వాళ్ళు కూడా లిబియా, సిరియా, ఇరాన్ పాలకుల్లాగా సొంత ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే ఒక్క కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేం ఖర్మ, మొత్తం ఇండియాయే పూర్తిగా మన (పాలకుల) కి కాకుండా పోతుంది. ఇప్పుడు ప్రశాంతంగా జరిగే దోపిడి అప్పుడు వయొలెంట్ గా జరుగుద్ది.