‘అంబేద్కర్ కార్టూన్’ గొడవ ‘అంబేద్కర్’ కే అవమానం -దళిత సంఘాలు


Ambedkar cartoon 01‘అంబేద్కర్ కార్టూన్’ పై పార్లమెంటులో జరిగిన రగడ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కే తీవ్ర అవమానమనీ, భావ ప్రకటనా స్వేచ్ఛ పైన దాడి అనీ దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ప్రకటించాయి. “నెహ్రూ-అంబేద్కర్ కార్టూన్ గానీ, దానితో ఉన్న పాఠ్యం గానీ దానంతట అదే అభ్యంతరకరం కాదని స్పష్టంగా చెబుతున్నాం. నిజానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వంలో ‘రాజ్యాంగ అసెంబ్లీ’ నిర్వహించిన కష్టమైన పనిని అది సమున్నతంగా అభినందించేదిగా ఉంది” అని వివిధ హక్కుల కార్యకర్తలు, దళిత మేధావులు విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. దళిత ఓటు బ్యాంకు కోసం జరిగిన ప్రయత్నమని నిరసించింది.

“మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ పార్లమెంటులో క్షమాపణ చెప్పి, కార్టూన్ తొలగించడానికి అంగీకరించిన విధానం, పుస్తకాల పంపిణీని రద్దు చేసిన పద్ధతి అత్యంత ఆందోళనకరమైనది” అని పి.యు.సి.ఎల్ (రాజస్ధాన్), సెంటర్ ఫర్ దళిత్ రైట్స్, ద జన్ వాదీ లేఖక్ సంఘ్, భారతీయ జ్ఞాన్ విజ్ఞాన్ సమితి సంస్ధలు విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది.

“నిజానికి, మొదటి సారిగా, ఎన్.సి.ఇ.ఆర్.టి పుస్తకాలలో బాబా అంబేద్కర్ కి ఇలాంటి ప్రాముఖ్యత దక్కిందన్నది నా అభిప్రాయం’ అని సెంటర్ ఫర్ దళిత్ రైట్స్ ఛైర్మన్ పి.ఎల్.మిమ్రోత్ పత్రికలతో అన్నాడని ‘ది హిందూ’ తెలిపింది. “కార్టూన్ తో కలిపి కాప్షన్ ను కూడా కలిపి చూసినట్లయితే కార్టూన్ లో తప్పేమీ లేదని అర్ధం అవుతుంది” అని దళిత కార్యకర్త, ‘డైమండ్ ఇండియా’ పత్రిక ఎడిటర్ భన్వర్ మేఘ్ వంశీ అన్నాడు. ఎన్.సి.ఆర్.టి రాజకీయ శాస్త్ర విభాగం ముఖ్య సలహాదారు సుహాస్ పాల్సికర్ పై జరిగిన దాడిని ‘పిరికి చర్య’ గా ఆయన అభివర్ణించాడు.

రాజ్యాంగ రచన పై 1949 లో ప్రఖ్యాత కార్టూనిస్టు శంకర్ పిళ్లై గీసిన కార్టూన్ పై కొద్ది రోజుల క్రితం పార్లమెంటు లో రభస జరిగిన సంగతి విదితమే. తమిళ నాడుకి చెందిన దళిత ఎం.పి లు గొడవ చేయడంతో కార్టూన్ అవమానకరమేనని అంగీకరిస్తూ కపిల్ సిబాల్ క్షమాపణ చెప్పాడు. పాఠ్య పుస్తకం నుండి అంబేద్కర్-నెహ్రూ కార్టూన్ తొలగిస్తానని చెప్పడమే కాక కార్టూన్ ను పాఠ్య పుస్తకం లోకి రావడంలో క్రిమినల్ ఉద్దేశ్యాలున్నాయేమో విచారిస్తామని ప్రకటించాడు. దానితో పాటు 200 పైగా కార్టూన్లను సమీక్షించి తొలగిస్తామనీ, బాధ్యులను గుర్తిస్తామని ప్రకటించారు. రాజకీయ నాయకులను విమర్శించడం ఫ్యాషనై పోయిందనీ పార్టీలకి అతీతంగా ఈ సందర్భంగా ఎం.పిలంతా ఆక్రోశించారు, అక్కడికి రాజకీయ నాయకులు విమర్శలకు అతీతులయినట్లు.

“ఈ మొత్తం వైఖరి అంతా ఫాసిస్టు ధోరణులకి సంబంధించినవే. కనీసం అకడమిక్ కమిటీకి రిఫర్ చేయకుండా మంత్రి కార్టూన్ లను తొలగించేందుకు ఆదేశించాడు” అని రాజస్ధాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజీవ్ గుప్తా నిరసించాడు. మొత్తం ఎపిసోడ్ అంతా భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడి అనీ, అంబేడ్కర్ పైనే దాడి అని ఆయన విమర్శించాడు.

ఎన్.సి.ఆర్.టి పుస్తకాల్లో 32 కార్టూన్లు ఉంటే 16 కార్టూన్లు నెహ్రూ పైనేనని ఆయన ఎత్తి చూపాడు. గతంలో కూడా పాఠ్య పుస్తకాలను తొలగించారనీ, పుస్తకాలలో కొన్ని భాగాలను తొలగించారనీ, కేసులు దాఖలు చేశారనీ అన్నీ ప్రజాభిప్రాయాలని కించపరుస్తున్నాయన్న సాకు చూపారనీ ప్రకటన పేర్కొనది. “విద్య కర్తవ్యం అంతా విద్యార్ధుల మనసులకు ఉపదేశాలు ఇవ్వడమో, ఒకే ఒక ఐడియాలజీ బోధించడమో కాదు. అన్నీ రకాల దృక్పధాలపట్ల నిస్పక్షపాతంగా మనసులను తెరిచి ఉంచడమే విద్య యొక్క   ప్రమాణ ఉద్దేశ్యం” అని ప్రకటన పేర్కొంది.

2 thoughts on “‘అంబేద్కర్ కార్టూన్’ గొడవ ‘అంబేద్కర్’ కే అవమానం -దళిత సంఘాలు

  1. కార్టూన్ పై జరిగిన రగడ ‘అంబేద్కర్ పైనే దాడి’ అంటూ దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు చేసిన ప్రకటన ప్రశంసనీయం. అంబేద్కర్ ని అయినా, నెహ్రూ ని అయినా, మరే నాయకుణ్ణి అయినా విమర్శలకు అతీతులుగా చిత్రీకరించే ప్రయత్నాలు సంకుచిత, మూఢత్వ దృష్టి నుంచి పుట్టినవి తప్ప మరొకటి కాదు!

వ్యాఖ్యానించండి