‘అంటరానితనం’ ఎటూ పోలేదు -వీడియోలు


‘అంటరానితనం చట్టరీత్యా నేరం’ అంటోంది భారత రాజ్యాంగం. ‘అస్పృశ్యత’ ని నిషేధించామంటున్నాయి దళిత చట్టాలు. దళితుల అభ్యున్నతికి ఎన్నో చట్టాలు చేశామంటున్నాయి రాజకీయ పార్టీలు. ప్రపంచంలో ఘనమైన ప్రజాస్వామిక దేశం భారతదేశమని విద్యాధికులు కీర్తిస్తున్నారు. భారత దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని మన్మోహన్, అహ్లూవాలియా, చిదంబరం ల కూటమి గర్వంగా చాటుతోంది. కులాల పునాదులు బలహీనపడ్డాయి అంటున్నారు కమ్యూనిస్టు కార్యకర్తలు.

ఇవేవీ భారత దేశ దళితులను ‘అంటరానితనం’ నుండి విముక్తి చేయలేదని ఈ వీడియోలు చెబుతున్నాయి.  దేవాలయాల్లో ప్రవేశం లేదు. స్కూళ్లలో అందరు పిల్లలతో కలిసి కూర్చుని తినే యోగ్యతలేదు. ఉపాధి పధకంలో అగ్రకుల కూలీలతో కలిసి పనిచెయ్యనివ్వరు. క్రికెట్ టీం లలో చేరి ఆడనివ్వరు. కుళాయి నీరు పట్టుకున్నాక కుళాయిల్ని కడుగుతారు. ఊరిలోనే మూడు బార్బర్ షాపులున్నా దళిత పురుషుడికి గడ్డం గీయరు. పని చేసి పెడితే దూరం నుండే రొట్టెని వళ్లోకి విసురుతారు. కుండలో నీరు తీసుకుని తాగితే చేయి నరుకుతారు. అగ్రకుల యువతిని పెళ్లాడితే కడుపులో పిండంతో సహా చంపేస్తారు. ఊళ్ళో నడిస్తే చెప్పులిప్పి నడవాలి. చలివేంద్రంలో దూరం నుండి నీళ్లు తాగి గ్లాసులు కడిగివ్వాలి. మురికి కాల్వలని శుభ్రపరిచే ఉద్యోగాలు పూర్తిగా దళితులకే వందశాతం రిజర్వ్ చేసి పెడతారు.  అంటరానితనం పై తిరగబడినందుకు పోలీసులే కాల్చిచంపుతారు. అస్పృశ్యత సంచరించని స్మశానాలు కూడా అస్పృశ్యతని పాటిస్తాయి.

అయినా ‘అస్పృశ్యత నిషేధం’ అని ప్రభుత్వాలు ఘనంగా చాటుతాయి.

వీడియో వాలంటీర్స్ అన్న పేరుతో వెలసిన సంస్ధ ఈ ఘోర కృత్యాల్ని ప్రత్యక్షంగా వీడియోల్లో రికార్డు చేసింది. భారత దేశంలోని గ్రామీణ వ్యవస్ధని ఆదర్శవంతమైన సామాజిక నిర్మాణానికి ఒక నమూనాగా భావించడం ఒట్టి అబద్ధమేననీ, ఈ ఆదర్శీకరణ హిందువుల అభూత కల్పనేననీ దశాబ్దాల క్రితం చెప్పిన అంబేద్కర్ పలుకు ఇప్పటికీ నగ్న సత్యాలుగా కొనసాగుతున్నాయని ఈ వీడియోలు రుజువు చేస్తున్నాయి.  ప్రాచీన హిందూమత గ్రంథాలూ, ధర్మ శాస్త్రాలూ శాసించిన అమానుష వర్య వ్యవస్థ ఆధునిక భారతదేశంలోని గ్రామాల్లో నేటికీ యధాతథంగా కొనసాగుతోందని రుజువు చేస్తున్నాయి. కులాల సరిహద్దుల్ని దాటాలని ప్రయత్నించినప్పుడల్లా చేయూత బదులు హింస అణచివేతలే జవాబుగా ఎదురవుతున్నాయని తెలియజెస్తున్నాయి.

“భారతదేశంలోని పల్లెసీమలు అగ్రవర్ణాలకు స్వర్గధామాలు కావొచ్చునేమో గానీ దళితులకు మాత్రం అవి నరకకూపాలు” అన్న డాక్టర్‌ అంబేడ్కర్‌ ప్రకటన నేటికీ పొల్లు పోలేదని చెప్పడానికి ఇక మేధో విశ్లేషణలు అవసరం లేకపోవచ్చు.

బడిలో మధ్యాహ్న బోజనాన్ని పక్క పక్కనే కూర్చుని తిననివ్వని ఉదంతం ఇది:

ఊళ్ళో మూడు క్షవరం కొట్లు. అయినా దళితుడి వెంట్రుక ఇక్కడ తెగదు.

ఇల్లంతా ఊడ్చిపెడితే, దూరం నుండి విసిరే రొట్టే గతి.

బ్రహ్మ కాళ్ళనుండి పుట్టిన వారంటే గుళ్లో దేవుడికి అసహ్యం.

కుండలో గ్లాసు ముంచి నీళ్లు తాగితే వాడ్ని నరికితే తప్ప మైల పోదు.

పంపు తిప్పితే అదే పంపు నీళ్లతో కడిగి శుభ్రం చేసి మైల వదిలించాలి.

మతం మారినా సరే, కులం కంపు వెంటే వస్తుంది. కడుపులో పిండంతో సహా కత్తికో కండగా చీల్చివేస్తుంది.

మరో కులపోడి ఇంటిముందు నడవాలంటే చెప్పులిప్పి నడవాలి.

నీళ్లు వాడుకోవాలంటే దూరంగా నిలబడి తీసుకోవాలి. వాడిన పాత్ర కడిగి ఇవ్వాలి.

మురికి ఉద్యోగాలు వంద శాతం దళితులకే రిజర్వ్‌డ్. ప్రతిభా వాదులిక్కడ పోటీకి రారు. మురికి పనికి రక్షణ కవచాలుండవు. చచ్చినా దిక్కుండదు.

అంటరానితనం భరించలేమన్నా రాజ్యం ఆగ్రహించి కాల్చి చంపుతుంది.

దళితుల చావులు అంటరానివి. ఆత్మలకి సైతం అస్పృశ్యతని అంటగట్టిన గొప్ప నీతి శాస్త్రాలు ఖర్మ భూమి సొంతం.

ఆర్టికల్ 17 ని నిజమైన అర్ధంలో అమలు చేయాలని ‘వీడియో వాలంటీర్స్‘ సంస్ధ, షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ కి పిటిషన్ పెడుతోంది. అరవైదేళ్లుగా ‘అంటరానితనం’ రాక్షసత్వాన్ని అంగుళం కూడా కదపని ఈ కమిషన్, దాని ప్రభుత్వం పిటిషన్ కి స్పందిస్తాయా? ప్రజలే తమ భవిష్యత్తుని తాము రూపుదిద్దుకోవడానికి నడుం బిగించి భారత దేశ ఫ్యూడల్ పునాదుల్ని కూకటి వేళ్లతో పెళ్లగించే కార్యాచరణకి పూనుకోవాల్సిందే.

6 thoughts on “‘అంటరానితనం’ ఎటూ పోలేదు -వీడియోలు

  1. ‘శ్మశానవాటి’ పద్యాల్లో ‘ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు’ అన్నాడు జాషువా! కానీ దాన్ని కూడా అబద్ధం చేసేలా… వల్లకాట్లో కూడా అంటరానితనం వెంటపడుతోందంటే ఎంత ఘోరం, ఎంత దారుణం! దళితుల జీవితంలోని ప్రతి అడుగులో, ప్రతి దశలో అంటరానితనం ఇంత అమానుషంగా అమలవుతోందంటే.. కులం పునాదులు ఇంకా చెక్కు చెదరకుండానే ఉన్నాయని అర్థమవుతోంది.

  2. విశేఖర్ గారు. అంబేద్కర్ అణగారిన వర్గాలను మార్క్సిజానికి దూరం చేశాడు కదా. దీనిపైన మీ అభిప్రాయమేమిటి అలా అని ఆయన కృషిని నిరాకరించినట్టు కాదు. అలాగే ఇప్పుడున్న అణగారిన కుల సంఘాలు నాయకులు వాళ్ళ స్వప్రయోజనం కోసం వాడుకున్నట్లు తోస్తుంది, నిజంగా వాళ్ళ అభ్యున్నతికి కాకుండా.

    (ఇందులో టైపింగ్ తప్పుల్ని సవరించాను -విశేఖర్)

  3. రామ్మోహన్ గారు, నేను మార్క్సిజాన్ని ఆమోదించడాన్ని బట్టే అంబేద్కర్ పై అభిప్రాయం ఏమిటో వ్యక్తం చేశాను.

    మార్క్సిజం కి వ్యతిరేకంగా రాయడం ద్వారా దళితులు శాశ్వత విముక్తి సాధించే మార్గాన్ని ఆయన, తనవైపునుండి, మూసినట్లయింది. ఇతర కులాల ప్రజలను వారి నాయకులు కులం పేరుతో ఉపయోగించుకున్నట్లే, దళిత నాయకులు కూడా ఉపయోగించుకుంటున్నారు.

  4. బస్సులు తిరగని & ఎడ్ల బండ్లు మాత్రమే తిరిగే ఒక మారుమూల గిరిజన గూడలో పుట్టిన మా నాన్న గారు కూడా బ్యాంక్ ఆఫీసర్ అయ్యి, తెల్ల చొక్కా వేసుకున్న తరువాత కమ్యూనిజంని తీవ్రంగా వ్యతిరేకించారు. కుల వైరుధ్యం కంటే వర్గ వైరుధ్యం పవర్‌ఫుల్.

వ్యాఖ్యానించండి