పోలీసుల సహాయం తీసుకుని తివారీ కి రక్త పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ కోర్టు తమ రిజిస్ట్రార్ కి ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ గవర్నర్, యు.పి, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా కూడా పని చేసిన ఎన్.డి.తివారీ తనకు తండ్రి అంటూ రోహిత్ శేఖర్ అనే 32 యేళ్ళ యువకుడు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే.
డి.ఎన్.ఏ పరీక్షల ద్వారా రోహిత్ ఆరోపణలను నిర్ధారించడానికి కోర్టు ప్రయత్నిస్తున్నప్పటికీ రక్త నమూనా ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చాడు. వివిధ కుంటి సాకులు చెబుతూ తప్పించుకున్నాడు. బుధవారం కోర్టు తీర్పుతో తివారీ ఇక తప్పించుకోలేని పరిస్ధితి ఏర్పడింది.
“ఈ కోర్టు పరిధిలోకి డిఫెండెంట్ నెంబర్ 1 (తివారీ) అందుబాటులో లేనట్లయితే జాయింట్ రిజిస్ట్రార్ పోలీసుల సహాయం తీసుకునేందుకు యోగ్యత ఉంది. డి.ఎన్.ఏ పరీక్ష కోసం రక్త నమూనా తీసుకోవడానికి వీలుగా ఆయనని కోర్టులో హాజరు పరచడానికి రిజిస్ట్రార్ పోలీసుల సాయం కోరవచ్చు” అని జస్టిస్ రేవా ఖేత్రపాల్ ఆదేశించాడు.
హియరింగ్ కి తివారీ హాజరు కావడానికి మరో వాయిదా ఇవ్వాలని తివారీ లాయర్ కోరగా కోర్టు ఆగ్రహించింది. సుప్రీం కోర్టు లో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున వాయిదా ఇవ్వాలని లాయర్ కోరాడు. సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్ లో ఉన్నా కేసు ప్రొసీడింగ్స్ కి అది అడ్డు కాదని ఇప్పటికే స్పష్టం చేసినట్లు జడ్జి తెలిపాడు.
రక్త నమూనా సేకరించే తేదీని మే 21 నా జాయింట్ రిజిస్ట్రార్ నిర్ణయిస్తాడని కోర్టు తెలిపింది. హైద్రాబాద్ లోని ‘సెంటర్ ఫర్ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్స్’ నుండి డి.ఎన్.ఏ శాంపిల్ కిట్ అందాక వారం లోపు రక్త నమూనా సేకరించే పని మొదలవుతుందని స్పష్టం చేసింది. తివారీ వయసు దృష్టిలో పెట్టుకుని రక్త నమూనా సేకరణ అత్యంత త్వరగా సేకరించవలసిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. లేనట్లయితే ఫిర్యాదుదారుకి పూడ్చలేని నష్టం వాటిల్లవచ్చని అభిప్రాయపడింది.
రక్త నమూనా ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా రోహిత్ శేఖర్ కి తానే తండ్రినని తివారీ పరోక్షంగా అంగీకరించినట్లయింది. నాలువేళ్ళ నుండి నానుతున్నప్పటికీ తివారీ ఏ అధికార వ్యవస్ధకీ లొంగకుండా విచారణని సాగదీశాడు. కోర్టు విచారణలో ఉన్న అనేక లొసుగులని ఆయన బాగా వినియోగించుకోగలిగాడు. తండ్రీ కొడుకుల సంబంధాన్ని నిర్ధారించడానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అవకాశం కల్పించినప్పటికీ, దాని కంటే చట్టానికి లొంగని ఒక పలుకుబడి కలిగిన ధనిక తండ్రి అభిజాత్యమే శక్తివంతమైనదని తివారీ నాలుగేళ్లుగా నిరూపిస్తూ వచ్చాడు. తండ్రిని తిరిగివ్వాలని కోర్టు మెట్లెక్కిన ఒక నిస్సహాయ పుత్రుడి కోరికను చట్టం ఇప్పటికైనా నెరవేరుస్తుందో లేదో వేచి చూడవలసిందే.