జాతీయం
పార్లమెంటుకి 60 సంవత్సరాలు
భారత పార్లమెంటు సమావేశమై ఆదివారం (మే 13) తో 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశం జరిపింది. రాజ్య సభ లో ప్రధాని మన్మోహన్, లోక్ సభలో ఆర్ధిక మంత్రి ప్రణబ్ చర్చ ప్రారభించారు. పార్లమెంటులో పదే పదే అవాంఛనీయ సంఘటనలు జరగడం పట్ల ప్రధాని ఆందోళన వెలిబుచ్చాడు. “సమావేశాలకు ప్రతిరోజూ ఆటంకాలు ఎదురు కోవడం, వాయిదాలు పడడం, కేకలు వేయడం వల్ల బైటి వారికి ఈ సంస్ధ సామర్ధ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ వ్యవహారాలపై నమ్మకం సడలుతోంది. ప్రత్యేకంగా గత రెండు సంవత్సరాలుగా ఎం.పి ల ప్రవర్తన ప్రజల్లో నిస్పృహ, విభ్రాంతి కలగ జేసింది” అని ప్రధాని రాజ్య సభలో అన్నాడు. అనేక సందర్భాల్లో లోక్ సభ ‘షాక్ అబ్జార్బర్’ గా పని చేసిందని ప్రణబ్ ముఖర్జీ కొనియాడాడు. కొద్ది మంది ప్రవర్తన ఆందోళనక్రమని వ్యాఖ్యానించాడు. పార్లమెంటులో ఎం.పి ల ప్రవర్తన వారెలాంటి వారో తెలియజేస్తే ప్రధాని నాయకత్వంలో అమలు చేస్తున్న ఆర్ధిక విధానాలు మాత్రం ఆయన భారత ప్రజల ప్రయోజనాలు పట్టించుకోడాని తెలియజేస్తున్నాయి. ఈ సంగతి ఆయా రాష్ట్రాల్లోని గిరిజన ప్రజానీకం తమ భూములు కాపాడుకోవడానికి ఉద్యమించడం ద్వారా చెబుతూనే ఉన్నా ప్రధాని గ్రహించడానికి బదులు వారిపై నక్సలైట్ ముద్ర వేసి దేశ భద్రతకే ప్రమాదంగా అభివర్ణిస్తున్నాడు. అడవుల్లో నివసించే అమాయక గిరిజనం దేశ భద్రతకి ప్రమాదమా?
ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో ఇకనుండి యూజర్ ఛార్జీలు
న్యూ ఢిల్లీలోని ‘అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ధ’లో యూజర్ ఛార్జీలు వసూలు చేయడానికి నిర్ణయించారు. సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకించడంతో ఐదేళ్ళ క్రితం తీసుకున్న యూజర్ ఛార్జీల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న సంస్ధ తిరిగి దొడ్డి దారిని నిర్ణయం తీసుకుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి నుండి ఫీజులు వసూలు చేయబోమని చెప్పినప్పటికీ అందుకు తగిన విధానాలనేమీ ప్రకటించలేదు. పేదలకు వైద్యం అందించే విషయంలో అనిర్ధిష్టంగా పొడి మాటలు చెప్పి ఊరుకుంది. ప్రతి సంవత్సరం 40 లక్షల మంది రోగులు దేశం నలుమూలలనుండీ ఈ ప్రతిష్టాత్మక ఆసుపత్రిని సందర్శిస్తుంటారు. వీరిలో పేదలే అధికులు. ఛార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయాన్ని గతంలో ‘హాస్పిటల్ ఎఫైర్స్ కమిటీ’ (హెచ్.ఎ.సి) కి నివేదించినప్పటికీ దానితో సంబంధం లేకుండా ఏకపక్షంగా జనరల్ బాడీ ఈ నిర్ణయం తీసుకుందని ‘ది హిందూ’ తెలిపింది. ఆసుపత్రికి ఆర్ధిక వనరుల కోసం రోగుల డబ్బు తప్ప మరో మార్గం లేదని జి.బి నిర్ణయించిందని తెలుస్తోంది. పేదలని రుజువు చేసుకునేందుకు భారత పేదలకు అనేక ఆటంకాలు ఇప్పటికే ఉండగా వైద్యం పొందేందుకు కూడా పేదరికం అర్హతగా పెట్టడం ద్వారా వైద్యం పొందడం కంటే సరిటిఫికెట్ల కోసం రోగులు పరుగులు పెట్టే పరిస్ధితిని ప్రభుత్వం కల్పించింది.
అంతర్జాతీయం
ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా శాంతి ప్రయత్నాలకు మరో విఘాతం
‘మంచి తాలిబాన్’ తో సంధి చేసుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గత అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆఫ్ఘన్ పీస్ కౌన్సిల్ లోని ప్రముఖ సభ్యుడొకరిని మిలిటెంట్లు కాల్చి చంపారు. ఈ హత్యతో తమకు సంబంధం లేదని తాలిబాన్ ప్రకటించింది. హత్యకు గురయిన ‘మౌల్వీ అర్సలా రహమాని’ పూర్వాశ్రమంలో తాలిబాన్ నాయకుడే. అనంతరం ఆయన కర్జాయ్ పక్షం చేరాడు. కాబూల్ లో సైలెన్సర్ తుపాకితో వచ్చిన వ్యక్తి ఆయనని కాల్చి చంపాడు. తాలిబాన్ తో చర్చలకు ప్రయత్నిస్తున్న వారిలో రహమాని ప్రముఖుడని ఎ.పి తెలిపింది. పీస్ కౌన్సిల్ తో నేరుగా చర్చించడానికి తాలిబాన్ నిరాకరించింది. అమెరికా తొత్తు కర్జాయ్ నియమించిన పీస్ కౌన్సిల్ తో చర్చించేది లేదని చర్చలకు నిరాకరించింది.
యూరప్ వ్యాపితంగా ‘ఆకుపై’ ప్రదర్శనలు
పెట్టుబడిదారీ కంపెనీలకు బిలియన్ల కొద్దీ బెయిలౌట్లు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఆదివారం యూరప్ వ్యాపితంగా ప్రదర్శనలు జరిగాయి. యూరప్ లో ముఖ్య ఫైనాన్స్ కేంద్రం అయిన లండన్ లో వందల మంది ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘డే ఆఫ్ గ్లోబల్ యాక్షన్’ జరుపుతున్నట్లు ఆందోళనకారులు తెలిపారు. యూరప్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న వినాశకర పొదుపు విధానాలను ఆందోళనకారులు నిరసించారు. ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్’ ముందు గుడారాలు వేసి నిరసన తెలిపారు. పోలీసులు వారిని తొలగించడానికి ప్రయత్నించడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇతర యూరప్ నగరాలైన లిస్బన్, ఫ్రాంక్ ఫర్ట్, ఏథెన్స్, బార్సీలోనా, మాడ్రిడ్ లలో కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయని పలు వార్తా సంస్ధలు తెలిపాయి.
Imposing user charges by A.I.I.M.S. is worst decision taken by Govt.of India.