క్లుప్తంగా… 12.05.2012


  • మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి
  • అమెరికా సైనికులకు ‘ఇస్లాం’ వ్యతిరేక పాఠాలు
  • వియత్నాం యుద్ధ ఫోటోగ్రాఫర్ ‘హార్స్ట్ ఫాస్’ మరణం

జాతీయం

మార్చిలో 3.5 % క్షీణించిన పారిశ్రామిక ఉత్పత్తి

industryభారత దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచి (ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ -ఐ.ఐ.పి) మరో సారి నిరాశ కలిగించింది. మార్చి 2012 నెలలో పెరగకపోగా తగ్గిపోయింది. -3.5 శాతం వృద్ధి నమోదు చేసింది. అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న కరెంట్ ఖాతా లోటు, రూపాయి విలువ క్షీణత లాంటి సమస్యలతో సతమతమవుతున్న ఆర్ధిక వ్యవస్ధ ఈ వార్తతో మరింత డీలా పడినట్లయింది. ఐదు నెలల తర్వాత ఐ.ఐ.పి క్షీణించడం ఇది మొదటిసారి. గత సంవత్సరం మార్చిలో 9.4 శాతం ఐ.ఐ.పి వృద్ధితో పోలిస్తే ఇది ఘోరం. ఫిబ్రవరిలో 4.1 శాతం వృద్ధి చెందినా దానిని ఎకానమీ కొనసాగించలేకపోయింది. దేశంలోకి పెట్టుబడులు బాగా తగ్గిపోవడమే క్షీణతకి కారణమని తెలుస్తోంది. ఐ.ఐ.పి లో 75 శాతం వాటా ఉన్న పెట్టుబడి సరుకుల ఉత్పత్తి ఏకంగా 21.3 శాతం పడిపోయింది. గత సం. మార్చి లో ఇది +14.5 శాతం. దేశీయ పెట్టుబడులు తగ్గిపోవడం ఐ.ఐ.పి క్షీణతకి కారణంగా ప్రణబ్ ముఖర్జీ తెలిపాడు. అమెరికా, యూరప్ సంక్షోభాలు ప్రభావం కలుగజేస్తున్నాయని కూడా ఆయన అన్నాడు.

అంతర్జాతీయం

అమెరికా సైనికులకు ‘ఇస్లాం’ వ్యతిరేక పాఠాలు

US islamophobia‘మక్కా, ‘మదీనా’ లాంటి ముస్లిం పవిత్ర స్ధలాలను ‘హీరోషిమా’, ‘నాగసాకి’ ల్లాగా అణు బాంబులతో కూల్చివేయాల్సిన అవసరం ఉన్నదంటూ అమెరికా స్టాఫ్ కాలేజీ విద్యార్ధులకు పాఠాలు బోధిస్తున్న సంగతి వెల్లడయింది. 2004 నుండి ఈ కోర్సుని ఇక్కడ బోధిస్తున్నారని వైర్డ్ వెబ్ సైట్ తెలిపింది. జీహాద్ ని తిప్పికొట్టడానికి ఇది ప్రభావశీలమైన దాడి నమూనా గా బోధనలో చెబుతున్నారు. “సౌదీ అరేబియా ను ఆకలి చావులతో భయపెట్టి, మక్కా మదీనాలను నాశనం చేసి, ఇస్లాం మతాన్ని కల్ట్ స్ధాయికి దిగజార్చే” పరిస్ధితికి అమెరికా చేరుకోవాలని వర్జీనియా మిలట్రీ టీచర్ లెఫ్టినెంట్ కల్నల్ మెచ్యూ డూలే బోధించినట్లు ‘ది హిందూ’ వెల్లడించింది. ఈ బోధనలతో క్లాసులో విద్యార్ధులు ఆగ్రహం చెంది కాలేజీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దానితో డూలేను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ డూలే ఇప్పటికీ నార్ఫ్లోక్ కాలేజీ లో బోధనలు కొనసాగిస్తున్నాడని ‘ది హిందూ’ తెలిపింది. అమెరికాలో ‘ఇస్లామోఫోబియా’ అధికార స్ధాయిలోనే కొనసాగుతున్న సంగతి ఈ వార్త వెల్లడి చేసింది.

వియత్నాం యుద్ధ ఫోటోగ్రాఫర్ ‘హార్స్ట్ ఫాస్’ మరణం

horst-faasప్రఖ్యాత వార్తా సంస్ధ ‘అసోసియేటెడ్ ప్రెస్’ ఫోటోగ్రాఫర్ ‘హార్స్ట్ ఫాస్’ మరణించాడు. రెండు పులిట్జర్ బహుమతి గెలుచుకున్న ఫాస్ మొదటి పులిట్జర్ ను వియత్నాం యుద్ధ ఫోటోలకు  గెలుచుకున్నాడు. వియత్నాంపై అమెరికా సాగించిన దురాక్రమణ యుద్ధాన్ని ఈయన ధైర్య సాహసాలతో కవర్ చేశాడని ప్రశంసలు అందుకున్నాడు. ఆ యుద్ధంలోనే ఫాస్ తీవ్రంగా గాయపడి కాలు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత కూడా ఏ.పి లో ఆయన ఫోటో విభాగానికి చీఫ్ గా సేవలందించాడు. 1962 నుండి దశాబ్దం పాటు ఫాస్ వియత్నాం యుద్ధంలో పని చేశాడు. వియత్నాం యుద్ధంలో ప్రజలు సైనికుల బాధలు, భావోద్వేగాలు రికార్డు చేయడమే తన మిషన్ గా ఉందని బహుమతి స్వీకరిస్తూ ఫాస్ అన్నాడని టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. మరణించేనాటికి ఫాస్ కి 79 సంవత్సరాలు. పులిట్జర్ గెలుచుకున్న ఫోటో కింద చూడవచ్చు.

faas_women

3 thoughts on “క్లుప్తంగా… 12.05.2012

  1. యుద్ధం నేపథ్యంలో బతుకు భయం వారి కళ్ళల్లో ఎంతగా కనిపిస్తోందో…! ఇలాంటి ఫొటోలను సాహసోపేతంగా రికార్డు చేసిన ఫాస్ అదే యుద్ధ బీభత్సంలో గాయపడి కాలు పోగొట్టుకోవటం, అయినా అదే వృత్తిని కొనసాగించటం చెప్పుకోదగ్గ విషయం!

  2. అదీ జర్నలిజం అంటే….అదీ వ్రుత్తి పట్ల గౌరవం అంటే…ప్రజల కష్టాన్ని…బాధల్ని….ప్రపంచానికి….నిష్పక్షపాతంగా చూపేదే నిజమైన జర్నలిజం. ఇవాళ్టి జర్నలిస్టులు ఫాస్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏ సేల్యుట్ టు ఫాస్

  3. ఇస్లాంని విమర్శించే ముందు బైబిల్ యొక్క real face ఎలా ఉంటుందో తెలుసుకుంటే మంచిది. యొహోవా తనని విశ్వసించనివాళ్ళపై దాడులు చెయ్యించి వాళ్ళ పెంపుడు గాడిదలని కూడా ఎలా కొల్లగొట్టించాడో తదితర విషయాలు బైబిల్‌లోనే కథలుగా వ్రాసి ఉన్నాయి. క్రైస్తవులు ముస్లింలని విమర్శిస్తే అది గురివింద గింజ సామెతలాగే ఉంటుంది.

వ్యాఖ్యానించండి