(మిత్రుడు కొండలరావు గారు మావో ఆలోచనా విధానం గురించి అడిగిన ప్రశ్నకు సంక్షిప్త వివరణ కోసం ఈ పోస్టు రాస్తున్నాను -విశేఖర్)
నూతన ‘ప్రజాస్వామిక విప్లవం – మావో ధాట్’ వివరణకి ఇవి అవసరం అని భావిస్తూ ఇవి రాస్తున్నాను.
–
ఇప్పుడు ప్రపంచంలో రెండు ప్రధాన వ్యవస్ధలు ఉన్నాయి. ఒకటి సంపూర్ణ పెట్టుబడిదారీ వ్యవస్ధలు, రెండు అర్ధ భూస్వామ్య అర్ధ వలస వ్యవస్ధలు.
సాధారణంగా బయటి దేశాల జోక్యం లేకుంటే భూస్వామ్య వ్యవస్ధలను కూల్చివేయాల్సిన కర్తవ్యం పెట్టుబడిదారీ వర్గంపై ఉంటుంది. ఇతర వర్గాలను కలుపుకుని తన నాయకత్వంలో పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధి నిరోధక భూస్వామ్య వర్గాన్ని ఆధిపత్యం నుండి కూలదోసి వ్యవస్ధ పగ్గాలను చేజిక్కించుకుంటాయి. దీనిని ‘ప్రజాస్వామిక విప్లవం’ అంటారు. ఇలాంటి విప్లవాలు ఫ్రాన్సు, బ్రిటన్, అమెరికా, రష్యా, జర్మనీ లాంటి దేశాలలో జరిగాయి. అందువల్లనే అవి పక్కా పెట్టుబడిదారీ దేశాలుగా పరిపక్వం చెందాయి.
మూడో ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామిక విప్లవాలకు వలస దురాక్రమణ దేశాలు అడ్డు పడ్డాయి. బ్రిటన్, ఫ్రాన్సు, హాలండ్, పోర్చుగల్ లాంటి దేశాలు వ్యాపారం కోసం వచ్చి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను ఆక్రమించి వలసలుగా చేసుకున్నాయి. వీరిలా రావడం వల్ల మూడో ప్రపంచ దేశాల్లో పెట్టుబడిదారీ వర్గం స్వతంత్ర వర్గంగా అభివృద్ధి కాలేదు. దానికి కారణం వలస శక్తులే. వీరిని మనం సామ్రాజ్యవాదవర్గం అంటున్నాం. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ వర్గం ఇతర పెట్టుబడిదారుల్ని ఎదగనివ్వదు. తనకు పోటీ రాకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎదగనివ్వకుండా అణచివేస్తుంది. లేదా తనకు అనుచరులుగా, జూనియర్ పార్టనర్లుగా చేసుకుంటుంది. తన ప్రయోజనాలకి లోంగి ఉండేలా చేసుకుంటుంది. మూడో ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారీ వర్గాన్ని వలస వాదులు (సామ్రాజ్యవాదులు) ఇలాగే అణచివేశారు. లేదా తమకు లొంగి ఉండేలా చేసుకున్నారు. భారత దేశ పెట్టుబడిదారీ వర్గం కూడా ఇలాగే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో ఎదిగారు తప్ప స్వతంత్రంగా ఎదగలేదు.
స్వతంత్ర పెట్టుబడిదారీ వర్గం అంటే ఏమిటి? పెట్టుబడిదారులు సర్వ స్వతంత్రులయితే తమ దేశ వనరులని ఇతర దేశాల పెట్టుబడిదారీ వర్గం దోచుకోవడానికి అనుమతించరు. వారికి నేషనలిస్టు సెంటిమెంట్స్ ఉంటాయి. జాతీయత వారిలో ఉట్టిపడుతుంది. జాతీయ భావనలతో సామ్రాజ్యవాద పెట్టుబడి తమ దేశంలోకి రాకుండా అడ్డుకుంటారు. మా దేశంలోకి రావడానికి మీరెవరని ప్రశ్నిస్తారు. వారిని దేశం నుండి పారద్రోలడానికి నడుం కడతారు. దురాక్రమణలకి వ్యతిరేకంగా సాయుధ యుద్ధానికి దిగుతారు. సామ్రాజ్యవాదులను లేదా వలస వాదులను దేశం నుండి తరిమి కొట్టేదాక నిద్రపోరు. వారలా చేయకపోతే వారి వారి దేశాల్లో వారే స్వతంత్రంగా తమ కార్మికవర్గాన్ని దోపిడీచేసే స్వేచ్ఛ వారికి ఉండదు.
కాని మూడో ప్రపంచ దేశాల్లోని పెట్టుబడిదారీ వర్గం స్వతంత్రంగా ఎదగడానికి వలస సామ్రాజ్యవాదం అడ్డుపడింది. వారి స్వతంత్ర ఆకాంక్షలను అణచివేసి తమకు లొంగి ఉండేలా చేసుకున్నారు. ఫలితంగా పేద దేశాల పెట్టుబడిదారీ వర్గం వలస సామ్రాజ్యవాదులకు లొంగిపోయారు. తద్వారా తమ దేశ ప్రజల స్వతంత్ర ఆకాంక్షలకు ద్రోహం చేశారు. దేశ వనరులను సామ్రాజ్యవాదులు కొల్లగొడుతుంటే వారికి సహకరిస్తూ దోపిడీ సొత్తు లో జూనియర్ భాగం పంచుకున్నారు.
తమ తమ దేశాల్లో భూస్వామ్య వర్గాన్ని కూలదోసిన పెట్టుబడిదారులు (ప్రధానంగా పశ్చిమ దేశాల్లో) మూడో ప్రపంచ దేశాల్లో భూస్వామ్య వర్గాన్ని కూలదోసే పని పెట్టుకోలేదు. అది వారికి అనవసరం. తమ దేశాల్లొ తమ ఆధిపత్యానికి, పెట్టుబడిదారీ వర్గం అభివృద్ధికీ భూస్వామ్య వర్గం అడ్డుపడింది గనక దాన్ని కూలదోయవలసిన అవసరం వారికి తలెత్తింది. కాని మూడో ప్రపంచ దేశాల్లో వారికా అవసరం లేదు. అప్పటికే ఆ దేశాలని వలసలుగా చేసుకున్నందున అక్కడి ఆధిపత్య వర్గాలన్నీ వారి ఆధీనంలోనే ఉన్నాయి. కనుక మూడో ప్రపంచ (మూ.ప్ర) దేశాల్లో భూస్వామ్య వర్గాన్ని వారు కొనసాగింపజేసారు. కాని భూస్వామ్య వర్గానిది పూర్తి ఆధిపత్యం కాదు కనక అది అర్ధ భూస్వామ్య వ్యవస్ధ అయింది వలసగా ఉంది గనక వలస వ్యవస్ధ అయింది. ఆ విధంగా ‘సో కాల్డ్’ స్వతంత్రం వచ్చేవరకూ అవి వలస-అర్ధ భూస్వామ్య దేశాలుగా కొనసాగాయి.
అర్ధ భూస్వామ్య వ్యవస్ధ అంటే భూ సంబంధాలన్నీ భూస్వామ్య వ్యవస్ధ రీతిలోనే కొనసాగడం. భూమిలో అధిక భాగం కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం కావడం. భూమి కేంద్రంగా ఉన్న శ్రామికవర్గం (రైతులు, కూలీలు) చేతిలో భూమి లేకపోవడం. భూమిపై వారు శ్రమలో అధికభాగం భూస్వాముల పరం కావడం. వలస వ్యవస్ధ అంటె దేశ వనరుల సంపద అంతా విదేశాలకు తరలి వెళ్లడం దేశంలోని ఏ వర్గానికి స్వతంత్రత లేకపోవడం. వలస శక్తుల దయాదాక్షిణ్యాలపైనే దేశీయ వర్గాలన్నీ ఆధారపడడం.
(ఇంకా వుంది)