ప్రజాందోళనలు అణచివేసేందుకు సైన్యాన్ని దించుతాం -ఇటలీ


italy-austerity-protestదేశంలో జరుగుతున్న ప్రజాందోళనలను అణచివేయడానికి సైన్యాన్ని దించక తప్పదని ఇటలీ ప్రధాని ‘మేరియో మోంటి’ ప్రకటించాడు. ప్రభుత్వ ఆర్ధిక విధానాలపై ఇటలీ ప్రజలు కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఆందోళనలు తీవ్రం అయ్యాయి. ఐ.ఎం.ఎఫ్, ఇ.యు ల ఒత్తిడితో యూరోపియన్ దేశాలు పొదుపు విధానాలు అమలు చేస్తుండడంతో అక్కడ నిరుద్యోగం పెరిగిపోయి సామాజిక సమస్యలు తీవ్రం అయ్యాయి. వినాశకర ఆర్ధిక విధానాలు అమలు చేయడం ఆపాలని ప్రజలు కోరుతుండగా వారి మొర ఆలకింకడానికి బదులు ‘సో కాల్డ్’ ప్రజాస్వామిక ప్రభుత్వాలు సైన్యాన్ని తెచ్చి ప్రజలను అణచివేయడానికే మొగ్గు చూపుతున్నాయి.

“ఇటీవలి వారాల్లో ఈక్విటాలియా (పన్నులు వసూలు చేసే సంస్ధ) ఆఫీసులపై అనేక దాడులు జరిగాయి. ఈక్విటాలియా ఆఫీసులపై దాడి చేయడం అంటే ప్రభుత్వం పై దాడితో సమానమని ప్రజలకు గుర్తు చేస్తున్నాను” అని ఇటలీ హోమ్ మంత్రి అన్నా మేరియా కాన్సిల్లేరీ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఇటలీ వ్యాపితంగా ఉన్న అనేక ప్రముఖ స్ధలాల వద్ద అప్రమత్తతా స్ధాయి (అలర్ట్ లెవెల్) ని ఇటలీ ప్రధాని పెంచుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశాడని ప్రెస్ టి.వి తెలిపింది. కొన్ని స్ధలాల వద్ద సైన్యాన్ని దించడానికి ఆలోచిస్తున్నట్లు అన్నా మేరియా తెలిపింది.

“హింసాత్మక దాడులకు టార్గెట్ గా ఉండే అవకాశాలున్న భవనాలను రక్షించడానికి సైన్యాన్ని ఉపయోగించవచ్చు. దాడులు విస్తృతం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. తీవ్ర చర్యలను ఈ పరిస్ధితి డిమాండ్ చేస్తోంది” అని మేరియా ప్రకటించింది. లివోర్నో, టస్కేనీ నగరంలోని ఈక్విటాలియా ఆఫీసులపైన శనివారం రెండు మాలోటోవ్ కాక్ టైల్స్ విసిరారనీ అవి పేలిపోవడంతో భవనం ముందు భాగం దెబ్బతిన్నదనీ ప్రెస్ టి.వి తెలిపింది. రోమ్ లో ఉన్న ఈక్విటాలియా ఆఫీసుకి శుక్రవారం లెటర్ బాంబు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బాంబు పేలలేదు.

ప్రభుత్వ అణు ఇంజనీరింగ్ కంపెనీ ‘అన్సాల్డో న్యూక్లియేర్’ సీనియర్ అధికారిని ఒకరిని ఈ నెలారంభంలో కాలిలో తుపాకితో కాల్చిన సంఘటన జరిగింది. ఇటలీకి  చెందిన తిరుగుబాటు గ్రూపు ఒకటి దీనికి బాధ్యతగా ప్రకటించుకుంది. ఆరు నెలల క్రితం మారియో మొంటి అధికారం చేజిక్కించుకున్నాక హింసాత్మక దాడులు తీవ్రం అయ్యాయి. ఇటలీ ఆర్ధిక విధానాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉన్నదో ఇలాంటి ఘటనలు తెలియజేస్తున్నాయి.

ఈ సంవత్సరం ప్రారంభం నుండీ ఇటలీ మాంద్యం (రిసెషన్) లోకి జారుకుంది. గత సంవత్సరం మూడవ క్వార్టర్ లో 0.2 శాతం క్షీణించిన ఆర్ధిక వృద్ధి నాల్గవ క్వార్టర్ లో 0.7 శాతం క్షీణించింది. దానితో ఇటలీ అధికారికంగా మాంద్యం లో జారుకున్నట్లయింది. యూరో జోన్ లో జి.డి.పి లో పోలిస్తే అప్పు అధికంగా ఉన్న దేశాల్లో గ్రీసు తర్వాత ఇటలీ రెండవది.

One thought on “ప్రజాందోళనలు అణచివేసేందుకు సైన్యాన్ని దించుతాం -ఇటలీ

వ్యాఖ్యానించండి