క్లుప్తంగా… 10.05.2012


  • జీన్స్, టీ షర్ట్ అసభ్య దుస్తులు, వేసుకోవద్దు -పంజాబ్ ప్రభుత్వం
  • పాకిస్ధాన్ మైనారిటీలను కాపాడండి -విదేశాంగ మంత్రి
  • ఇజ్రాయెల్ అణచివేతపై ‘గాంధీ మార్గం’లో తిరుగుబాటు చేస్తున్న పాలస్టీనియన్లు

 

జాతీయం

జీన్స్, టీ షర్ట్ అసభ్య దుస్తులు, వేసుకోవద్దు -పంజాబ్ ప్రభుత్వం

haryana_fashion_diktatజీన్స్, టీ షర్ట్ లు అసభ్య దుస్తులనీ వాటిని వేసుకొని ఆఫీసుకి రావద్దని హర్యానా ‘స్త్రీ, శిశు సంక్షేమ శాఖ’ వివాదాస్పద ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల్ని వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నా అందుకు నిరాకరిస్తోంది. స్త్రీలు చీర లేదా సల్వార్-కమీజ్ లు వేసుకుని రావాలని ప్రభుత్వ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. మగ ఉద్యోగులు ఫ్యాంటు షర్టు మాత్రమే ధరించాలని కోరుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను మహిళలు, విద్యార్ధినులు విమర్శిస్తున్నారు. అసభ్యంగా దుస్తులు ధరించ దలిస్తే ఏ దుస్తులనయినా ధరించవచ్చునని దుస్తుల సభ్యత, అసభ్యత ల గురించి కూడా చర్చ జరగవలసి ఉందనీ పంజాబ్ యూనివర్సిటీ విద్యార్ధినులు ప్రభుత్వ ఆదేశాలకు అభ్యంతరం తెలిపారని ‘ది హిందూ’ తెలిపింది. జీన్స్ ఫ్యాంటు ని అసభ్యంగా పేర్కొనడాన్ని పలువురు ఖండించారు. కమీజ్ పొడవు ఎంత ఉండాలో కూడా చెప్పాల్సి ఉంటుందనీ ఎందుకంటే దానిపైనే కమీజ్ అసభ్యమా కాదా అన్నది ఆధారపడి ఉందని కొందరు వ్యాఖ్యానించారు. సీనియర్ అధికారులు తమ మైండ్ ని ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేశారని మగ ఉద్యోగులు కూడా విమర్శిస్తున్నారు.  ఉద్యోగులు విధులకు క్యాజువల్ దుస్తులు ధరించి రావడం పెరగడంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి రేణు ఫూలియా ఈ ఆదేశాలు ఇవ్వవలసి వచ్చిందని హర్యానా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్ధించుకుంది. ఇతర ప్రభుత్వ శాఖలు వేటిలోనూ దుస్తుల ధారణ పై నిబంధనలేవీ లేకపోవడం గమనార్హం. ఇతర రాష్ట్రాల్లో కూడా అలాంటి నిబంధనలు ఏవీ లేవు. సభ్యత, అసభ్యత ల గురించి పాఠాలు చెప్పే అధికారులు పెరగడం చూస్తే, సమాజ గమనాన్ని ప్రజాస్వామిక పద్ధతుల్లో నిర్దేశించాల్సిన విద్యాధికుల ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్ధం అవుతోంది.

పాకిస్ధాన్ మైనారిటీలను కాపాడండి -విదేశాంగ మంత్రి

Sindh minotiy kidnapపాకిస్ధాన్ లో మైనార్టీ మతస్ధులయిన హిందువుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ లోక్ సభలో మాట్లాడుతూ కోరాడు. ప్రతిపక్ష బి.జె.పి లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన మైనార్టీ మతస్ధుల హక్కులను కాపాడేందుకు పాక్ ప్రభుత్వంపై రాజ్యాంగపరమైన బాధ్యత ఉన్నదనీ, దానిని ఆ ప్రభుత్వం నిర్వర్తించాలని కోరాడు. పాక్ అధ్యక్షుడు, ప్రధాని లు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నారని అంగీకరిస్తూనే మంత్రి ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను ప్రస్తావించాడు. సింధ్ రాష్ట్రంలో మూడు వేరు వేరు సంఘటనల్లో ముగ్గురు హిందూ యువతులను కిడ్నాప్ చేసి ముస్లింలు బలవంతపు వివాహం చేసుకున్నారు. అనంతరం మతమార్పిడికి పాల్పడ్డారు. అదే రాష్ట్రంలో ముగ్గురు హిందూ డాక్టర్లు హత్యకు గురయ్యారు. ఈ రెండు ఘటనలపైనా పాక్ అధ్యక్షుడు, ప్రధాని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని కృష్ణ తెలిపాడు. పాక్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని ‘సిమ్లా ఒప్పందం’ నిర్దేశించిందని అంగీకరిస్తూ పాక్ తన రాజ్యాంగ ధర్మాన్ని నిర్వర్తించాల్సి ఉందని కృష్ట అన్నాడు.

అంతర్జాతీయం

ఇజ్రాయెల్ అణచివేతపై ‘గాంధీ మార్గం’లో తిరుగుబాటు చేస్తున్న పాలస్టీనియన్లు

isr_hunger_strikeఇజ్రాయెల్ ప్రభుత్వం అనుసరిస్తున్న జాత్యహంకార దమనీతిని ఎదుర్కోవడానికి పాలస్తీనియన్ ఖైదీలు ‘అమరణ నిరాహార దీక్ష’ ను పోరాట మార్గంగా ఎంచుకోవడం ఇటీవల కాలంలో పెరుగుతోంది. పాలస్తీనా ప్రజలను చిత్తం వచ్చిన రీతిలో అరెస్టు చేసి జైళ్లలో కుక్కడానికి ‘అడ్మినిస్ట్రేటివ్ డిటెన్షన్’ ఖైదు పద్ధతిని ఇజ్రాయెల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అనుసరిస్తుంది. ఈ చట్టం ప్రకారం కేవలం అనుమానం వచ్చినంతనే పాలస్తీనా పౌరులను ఎవరినైనా అరెస్టు చేసి ఆరోపణలు, విచారణ లేకుండా ఆరు నెలల పాటు ఖైదు చేయవచ్చు. అనేక మందిపై దీనిని పదే పదే ప్రయోగిస్తూ సంవత్సరాల తరబడి విచారణ లేకుండా ఇజ్రాయెల్ జైళ్ళలో కుక్కుతోంది. ఐక్యరాజ్య సమితి అనేకసార్లు ఈ పద్ధతి చట్ట విరుద్ధమని ప్రకటించినప్పటికీ అమెరికా అండతో ఇజ్రాయెల్ తన చర్యలను కొనసాగించగలుగుతోంది. ఇజ్రాయెల్ దురాక్రమణను పాలస్తీనా ప్రజలు వ్యతిరేకించకుండా టెర్రరైజ్ చేయడమే ఇజ్రాయెల్ దుర్మార్గ చట్టాల ముఖ్య లక్ష్యం. 45 యేళ్ళ పాలస్తీనా దురాక్రమణ, ఐదేళ్ల గాజా అష్ట దిగ్బంధనం పాలస్తీనియన్ల పోరాట పటిమని పెంచుతోందేగానీ తగ్గించలేకపోతోంది. ఏ నేరం లేకుండా అరెస్టు అయిన ఖాదేన్ అద్నాన్ ఆమరణ నిరాహార దీక్షకు దిగడంతో అంతర్జాతీయంగా నిరసనలు వెల్లువెత్తాయి. దానితో ఆయనను ఇజ్రాయెల్ వదిలిపెట్టక తప్పలేదు. ఆ తర్వాత ఖైదీల మార్పిడి ఒప్పందంతో విడుదలయిన ప్రముఖ నాయకురాలు హనా షలాబీ ని కొద్ది రోజుల్లోనే తిరిగి అరెస్టు చేసిన ఇజ్రాయెల్ ఇలాగే, కొన్ని షరతులతో, అక్రమ నిర్భంధం నుండి విడుదల చేసింది. ఇపుడు ఇజ్రాయెల్ అక్రమ నిర్బంధంలో ఉన్న వారిలో 1500 కి పైగా ‘ఆమరణ నిరాహార దీక్ష’ పాటిస్తున్నారు. అత్యంత క్రూరమయిన హింసాత్మక నిర్భంధ పద్ధతులకు పాల్పడే ఇజ్రాయెల్ రాజ్యం కొత్త పరిస్ధితిని ఎలా ఎదుర్కొంటుందో చూడవలసి ఉంది.

3 thoughts on “క్లుప్తంగా… 10.05.2012

  1. జీన్స్, టి-షర్ట్స్ వేసుకునే ఆడవాళ్ళు ఎంత మంది ఉన్నారు? పెద్ద పెద్ద నగరాలలో కూడా ఆడవాళ్ళు చున్నీలతో ముఖాలు కప్పుకుని స్కూటర్‌ల మీద వెళ్తూ వర్ట్యుయల్‌గా బురఖాలు వేసుకునేవాళ్ళలాగ కనిపిస్తున్నారు.

  2. అనిత గారు, మీ వ్యాఖ్య పూర్తి చేయడానికి మొహపాటం పడ్డట్టున్నారు. కృష్ణ సంబోధన గురించేనా మీరంటున్నది?

    పెద్దలను గౌరవపూర్వకంగా సంబోధించే నియమాలు వార్తలలో పాటించరు. ఆ వ్యక్తులతో నేరుగా సంబోధిస్తున్నపుడు మీరన్న గౌరవం పాటించవలసి ఉంటుంది. అలా కాక ఒక వార్తలో భాగంగా చెబుతున్నపుడు గారు లాంటివి వాడరు. దాని వల్ల ఒకే వార్తలో అనేకసార్లు గారు, శ్రీ, శ్రీమతి, కుమారి లాంటివి వాడవలసి వస్తుంది. సమయాన్నీ, స్ధలాన్ని, శ్రమనీ అవి తినేస్తాయి. అలా వాడవలసిన సందర్భాలు కొన్ని ఉంటాయి గాని వార్తలలో ఆ సందర్భాలు తక్కువ.

    మాట్లాడుకునే సందర్భాల్లో కూడా మనం మూడో వ్యక్తి గురించి మాట్లాడేటపుడు గారు లాంటివి పెద్దగా వాడము. సమీప వ్యక్తుల గురించి మాట్లాడుకునేటపుడు గౌరవపూర్వక శబ్దాలు వాడతాము గానీ ప్రముఖ వ్యక్తుల గురించీ, దూరపు వ్యక్తుల గురించీ అలా సంబోధించడం ఉండదు. దానర్ధం గౌరవం లేదని కాదు. సంభాషణా సౌలభ్యానికీ, రాతలో సులువుకీ అలా చేస్తాము.

వ్యాఖ్యానించండి