ఇరాన్ నుండి కొనుగోలు చేస్తున్న క్రూడాయిల్ మొత్తాన్ని టర్కీ అధికం చేసింది. ఇరాన్ తయారు చేయని అణు బాంబు ప్రపంచ శాంతికి ప్రమాదం అని చెబుతూ ఆదేశానికి వ్యతిరేకంగా వాణిజ్య ఆంక్షలు విధిస్తూ చట్టం చేసి తమ చట్టాన్ని అమలు చేయాలని ప్రపంచ దేశాలపై ఒత్తిడి చేస్తున్న అమెరికాకి టర్కీ ఈ విధంగా సమాధానం చెప్పింది.
ఫిబ్రవరి తో పోలిస్తే మార్చి నెలలో ఇరాన్ నుండి టర్కీ దిగుమతి చేసుకున్న క్రూడాయిల్ దాదాపు మూడు రెట్లు పెరిగిందని ప్రెస్ టి.వి తెలిపింది. మార్చి నెలలో రోజుకి 2,70,000 బ్యారెళ్ళ ఇరాన్ క్రూడాయిల్ ని టర్కీ దిగుమతి చేస్తుకుంది. ఫిబ్రవరి నెలలో ఇది రోజుకి 1,00,000 బ్యారెళ్లు (401,349 టన్నులు) మాత్రమే.
టర్కిష్ స్టాటిస్టికల్ ఇన్స్టిటూట్ వెబ్ సైట్ అందించిన గణాంకాలను ప్రెస్ టి.వి ఉటంకించింది. గత సంవత్సరం జులై తర్వాత ఈ మార్చిలో అత్యధిక క్రూడాయిల్ ను ఇరాన్ నుండి టర్కీ దిగుమతి చేసుకుందని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది. గత సంవత్సరం మార్చి నెలతో పోల్చుకున్నప్పటికీ ఇరాన్ ఆయిల్ దిగుమతులను 90 శాతం మేరకు టర్కీ అధికం చేసింది.
2012 లో మొదటి మూడు నెలల్లో టర్కీ దిగుమతి చేసుకున్న మొత్తం క్రూడాయిల్ లో సగానికి పైగా ఇరాన్ నుండి దిగుమతి చేసుకున్నదే. ఈ మూడు నెలల్లో టర్కీ రోజుకి 3,50,000 బ్యారెళ్ళ క్రూడ్ దిగుమతి చేసుకోగా అందులో 1,93,000 బ్యారెళ్లు ఇరాన్ నుండి దిగుమతి చేసుకుంది. ఇరాన్ పై విధించిన ఆంక్షల నుండి టర్కీకి మినహాయింపు ఇవ్వాలని టర్కీ కోరుతోంది.
10 యూరోప్ దేశాలను ఇరాన్ పై విధించిన ఆంక్షల నుండి మినహాయిస్తున్నట్లు మార్చి 20 న అమెరికా ప్రకటించింది. ఈ దేశాలలో టర్కీ లేదు. టర్కీ తో పాటు ఇండియా, దక్షిణ కొరియా లాంటి మిత్ర దేశాలను ఆంక్షల నుండి మినహాయించడానికి అమెరికా అంగీకరించలేదు. ఆంక్షలు అమలు చేయాలని ఒత్తిడి చేయడానికి అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ ఆది, సోమ వారాల్లో చైనా, ఇండియాలు పర్యటించి వెళ్లింది.
ఇరాన్ ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవడం అంటే పశ్చిమాసియా లో నివశిస్తున్న అరవై లక్షల భారతీయుల భద్రతకు ప్రమాదమని, చూడాలనీ నసుగుతున్న ఇండియా టర్కీ ని ఉదాహరణగా తీసుకోవలసి ఉంది. ఇరాన్ క్రూడ్ దిగుమతులు తగ్గించుకోవడం సాధ్యం కాదని ఇండియా పైకి చెబుతున్నప్పటికీ వాస్తవంలో క్రమంగా తగ్గించుకుంటోంది. అమెరికాకి కోపం రాకుండా ఉండడానికి తంటాలు పడుతోంది. అందుకోసం తన వాణిజ్య ప్రయోజనాలతో పాటు ప్రజల ప్రయోజనాలనూ ఫణంగా పెడుతోంది.
టర్కీలో ఉన్న పాలక వర్గంవాళ్ళు అమెరికా చెప్పు చేతలలో పని చేసే తోలు బొమ్మలు కదా. టర్కీ ఇరాన్ నుంచి చమురు కొనుగోలు పెంచిందంటే అది నాకు నమ్మశక్యంగా లేదు. సెక్యులరిజం పేరుతో అమెరికా సామ్రాజ్యవాదులతో సహకరించే దేశం అది.
అందుకే ఇది వార్తయింది. ఆయిల్ అవసరం అలాంటిదని అర్ధం చేసుకోవాల్నేమో. ఐనా ఆంక్షల్ని ఒప్పుకోం అనకుండా మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది టర్కీ.
ముస్తాఫా కెమాల్ అటాతుర్క్ కాలం నుంచి టర్కీ అమెరికా సామ్రాజ్యవాదుల కింద తోలు బొమ్మలా ఉండే దేశమే. అందుకే టర్కీ అమెరికా ఆంక్షలకి విరుద్ధంగా పని చేస్తుందా అనే సందేహం వచ్చింది.