ఫ్రాన్సు అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మితవాద పార్టీ ‘యు.ఎం.పి’ అభ్యర్ధి, అధ్యక్షుడు అయిన నికోలస్ సర్కోజీ ఓటమి చెందాడు. ఆయనపై ‘సోషలిస్టు’ పార్టీ అభ్యర్ధి ఫ్రాంకోయిస్ హాలండే స్వల్ప మెజారిటీతో గెలుపొందాడు. 95 శాతం ఓట్ల లెక్కింపు పూర్తికాగా వాటిలో హాలండేకి 51.6 శాతం ఓట్లు, సర్కోజీ కి 48.4 శాతం ఓట్లూ పోలయ్యాయి. కేవలం 3.2 శాతం ఓట్ల తేడాతో హాలండే గెలుపొందాడు. నికోలస్ సర్కోజీ విచక్షణా రహితంగా అమలు చేసిన ‘పొదుపు ఆర్ధిక విధానాలు’ ఆయన ఓటమికి ప్రధాన కారణం. ధనికవర్గాలతో తనకు ఉన్న సాన్నిహిత్యం, ధన సంపాదన పట్ల తనకు ఉన్న వ్యామోహాన్నీ సర్కోజీ ఎన్నడూ దాచుకోలేదు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తో కలిసి ఆయన ఫ్రాన్సు లో ప్రజావ్యతిరేక పొదుపు విధానాలను అమలు చేయడమే కాకుండా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలన్నింటిలోనూ వాటిని అమలు చేసేలా ఒత్తిడి చేశాడు. యూరోపియన్ ప్రజల జీవితాలను సమస్యల సుడిగుండాలలోకి తోసి వేశాడు.
లెఫ్టిస్టు పార్టీ గెలిచిందని పత్రికలు రాస్తున్నాయి. కానీ ఫ్రాన్సు సోషలిస్టు పార్టీ లెఫ్టిస్టు పార్టీ కాదు. ధనిక వర్గాలకు వ్యతిరేకంగా, ప్రజలకు అనుకూలంగా మాట్లాడినంత మాత్రాన రాజకీయ పార్టీలు లెఫ్టిస్టు పార్టీలు కాజాలవు. రాజ్య వ్యవస్ధ మొత్తం ధనికవర్గాల చేతుల్లో కొనసాగుతుండగా, దేశంలోని ఉత్పత్తి సాధనాలయిన భూములు, పరిశ్రమలపై ధనికవర్గాల పెత్తనం కొనసాగుతుండగా అలాంటి వ్యవస్ధలో జరిగే పార్లమెంటరీ ఎన్నికలు ప్రజాస్వామికం కాజాలవు. ఒక దోపిడీ వర్గ ప్రతినిధి స్ధానంలో మరొక దోపిడీ వర్గ ప్రతినిధిని ఎన్నుకునే స్వేచ్ఛ మాత్రమే కలుగ జేసే పార్లమెంటరీ ఎన్నికలు ప్రజలను అధికారంలోకి చేర్చలేవు. ధనికవర్గాలను గానీ వారి ప్రతినిధులను గానీ అధికార స్ధానాల్లో కూర్చోబెట్టినంతనే ప్రజల జీవన స్ధితిగతులు మారవని శతాబ్దాలనుండి అనేక దేశాల్లో జరుగుతున్న ఎన్నికలు నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి. అలాంటి ఎన్నికలపై విశ్వాసం వ్యక్తం చేసే పార్టీలు ఎన్ని ‘సోషలిస్టు’ కబుర్లూ, సిద్ధాంతాలు చెప్పినా అవి ‘సోషలిస్టు’ పార్టీలు కాజాలవు. కానుక హాలండే నాయకత్వం వహిస్తున్న ఫ్రాన్సు ‘సోషలిస్టు’ పార్టీ నిజమైన సోషలిస్టు పార్టీ కాదు. 19 వ శతాబ్దంలోనే ఫ్రాన్సు సోషలిస్టు పార్టీ ‘పారిస్ కమ్యూన్’ కి మద్దతు ఉపసంహరించుకుంది. కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ రూపొందించి, వి.ఐ.లెనిన్, స్టాలిన్, మావో జెడాంగ్ లు అభివృద్ధి చేసిన కమ్యూనిస్టు సిద్ధాంతంలో ‘పారిస్ కమ్యూన్’ కి సమున్నతమైన స్ధానం ఉంది. అలాంటి ‘పారిస్ కమ్యూన్’ కి మద్దతు ఇవ్వని సోషలిస్టు పార్టీలు ప్రజల ప్రయోజనాలను నెరవేర్చడం సాధ్యం కాదు.
ఫ్రాన్సు ఎన్నికల్లో ‘నికోలస్ సర్కోజీ’ ఓటమికి కారణాలను గత ఆర్టికల్ లో వివరించడం జరిగింది. సర్కోజీ ధనిక వర్గాలకి ఎంత మిత్రుడయినా, డబ్బు పట్ల ఆయనకి ఎంత వ్యామోహం ఉన్నా ఆయన ఓటమికి దోహదం ఉండవచ్చు గానీ, అవే ప్రధానం కాజాలవు. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దరిమిలా అమెరికా, యూరప్ ప్రభుత్వాలు బడా కంపెనీలకి ట్రిలియన్ల కొద్దీ డాలర్లు అప్పులు తెచ్చి ఆదుకున్నాయి. వాటిని కంపెనీలనుండి వసూలు చేయాల్సి ఉండగా ‘పొదుపు విధానాలు’ అమలు చేసి ప్రజల నుండి వసూలు చేయడానికి పూనుకున్నాయి. ఆ విధానాల వల్ల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది గమనించే హాలండే ‘పొదుపు విధానాలను’ రద్దు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. విజయం సాధించాక ఇచ్చిన ప్రసంగంలో కూడా ఆయన అదే చెప్పాడు. “అన్నీ రాజధానుల్లో (యూరోప్ దేశాల రాజధానులు) ప్రజలు మాకు కృతజ్ఞతలు చెబుతున్నారు. మా వైపు చూస్తున్నారు. పొదుపు విధానాల్ని ముగించమని కోరుతున్నారు” అని ఆయన పారిస్ లోని ప్రఖ్యాత ‘డి లా బాస్టిల్లే’ వద్ద మాట్లాడుతూ అన్నాడు.
పొదుపు విధానాలు అనుసరించి ఓటమికి గురయినవారిలో సర్కోజీ మొదటివాడు కాదు. స్పెయిన్ లో గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో అక్కడి ‘సోషలిస్టు’ పార్టీ ఇలాగే పొదుపు విధానాలు అమలు చేసి ఓడిపోయింది. జర్మనీ లో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పాలక కూటమి ఓడిపోయింది. ఇటలీ జరగనున్న స్ధానిక ఎన్నికల్లో పాలక కూటమికి ఇదే పరిస్ధితి ఎదురవుతుందని అందరూ భావిస్తున్నారు. పోర్చుగల్ ఎన్నికల్లో కూడా సో కాల్డ్ ‘సోషలిస్టు’ పార్టీ ఓడిపోయింది. పొదుపు ఆర్ధిక విధానాలు యూరప్ ప్రజలని ఎంతగా బాధిస్తున్నాయో ఈ ఎన్నికలన్నీ విస్పష్టంగా చెబుతున్నాయి.
అయితే ఫ్రాన్సు నూతన అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు ‘పొదుపు ఆర్ధిక విచానాలని’ నిజంగానే రద్దు చేస్తాడా? చస్తే చెయ్యడు. ఫ్రాన్సు ప్రజల ఓట్ల కోసమే హాలండే హామీలు తప్ప అవి నెరవేర్చేవి కాదు. ముఖ్యంగా పొదుపు ఆర్ధిక విధానాల విషయంలో ఆయన హామీ మోసపూరితమే. వచ్చే నెలలో జరిగే పార్లమెంటు ఎన్నికల వరకూ హాలండే హామీలు కొనసాగుతాయి. పార్లమెంటు ఎన్నికలు ముగిశాక ఆయన అసలు రూపం బయటపడుతుంది. కొత్త పేర్లతో సర్కోజీ విధానాలని హాలండే అమలు చేయడం ఖాయం. పొదుపు విధానాలని రద్దు చేయడం అంటే కంపెనీల ప్రయోజనాలని తల్లకిందులు చేయడమే. కంపెనీలకి ఇచ్చిన బెయిలౌట్లని తిరిగి చెల్లించమని కోరడమే. హాలండే సోషలిస్టు పార్టీవీ అటువంటి విధానాలు కావు. 1981 నుండి 1995 వరకూ అధికారంలో ఉన్న సోషలిస్టు పార్టీ కంపెనీల కోసమే పని చేసింది తప్ప ప్రజల కోసం పని చేయలేదు.