యుద్ధాలు జన జీవనంలో మిగిల్చే భీభత్సం అంతా ఇంతా కాదు. లక్షల మందిని విగత జీవుల్ని చేసే యుద్ధాలు మరిన్ని లక్షల మందిని అవయవాలు లేని జీవచ్చవాలుగా మారుస్తాయి. ఇంకా అనేక రెట్ల మంది జీవితాల్లో తీరని విషాధాలు మిగిల్చి తరాల తరబడి ప్రభావాన్ని కలుగు జేస్తాయి. యుద్ధాల వల్ల బాగు పడేది పెట్టుబడిదారీ కంపెనీలు, ఆ కంపెనీల దగ్గర కమీషన్లు మెక్కే రాజకీయ నాయకులు, అధికారులే. ప్రజలు మాత్రం ధన, మాన, ప్రాణాలను కోల్పోయి చెట్టుకొకరు, పుట్టకొకరుగా అయిపోతారు. మధ్య ప్రాచ్యంతో పాటు, ఉత్తర ఆఫ్రికా, దక్షిణాసియాల కూడలిలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న ఆఫ్ఘనిస్ధాన్ లో తిష్ట వేసి ప్రపంచ ఆర్ధిక రంగంలో పోటిగా ఎదుగుతున్న చైనా పై కన్నేయడానికీ, ఇరాన్ లాంటి వెన్నెముక గల దేశాలను అదుపులో పెట్టడానికీ, ఇండియా లాంటి అపార వనరులున్న దేశాలలో జొరబడడానికీ ఆఫ్-పాక్ యుద్ధాన్ని అమెరికా, యూరప్ లు ప్రారంభించాయి. దశాబ్దకాలంగా కొనసాగుతున్న ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధం వల్ల మన పొరుగున ఉన్న రెండు దేశాల్లో ప్రజా జీవనం అస్తవ్యస్తం అయింది. పసి పిల్లలనుండి పండు ముసలివాళ్ల వరకూ తల్లిదండ్రులను, కొడుకూ కూతుళ్లనూ, ఇరుగు పౌరుగునూ, బంధువులనూ కోల్పోయి తీవ్ర మానసిక, శారీరక వేదనలను అనుభవిస్తున్నారు. కోట్లాది మంది జీవితాల్లో విధ్వంసాన్ని నింపిన ఆఫ్-పాక్ యుద్ధం ప్రారంభించి కొనసాగిస్తున్న పశ్చిమ దేశాలది ఒక నేరం అయితే, అలాంటి దుర్మార్గమైన దురాక్రమణ యుద్ధానికి సహకారం అందిస్తున్న ఆఫ్-పాక్ పాలకులది మరొక ద్రోహం. దశాబ్దకాలంగా సాగుతున్న ఆఫ్-పాక్ యుద్ధం వల్ల సామాన్య జన జీవనం ఎలా ఛిద్రమయిందో చూపుతున్న ఈ ఫొటోలను ‘ఫారెన్ పాలసీ’ పత్రిక అందించింది.


























