స్పెయిన్ ఆయిల్ కంపెనీని జాతీయ చేసిన అర్జెంటీనా


Argentina's President Cristina Fernandez de Kirchner

“ఇప్పటి నుండి మన ఆయిల్ రెస్పోల్ కంపెనీ అమ్ముకునే కమోడిటీ గా ఉనికిని ముగించుకుని దేశ అభివృద్ధి కోసం మౌలిక సరుకుగా ఉపయోగపడుతుంది”      -అర్జెంటీనా పాలక పార్టీ పార్లమెంటు సభ్యుడు ఆగస్టిన్ రొస్సీ

అర్జెంటీనాలో అతి పెద్ద ఆయిల్ కంపెనీ వై.పి.ఎఫ్ ను ప్రభుత్వం జాతీయ చేసింది. వాణిజ్య ఆంక్షలు విధిస్తామన్న యూరోపియన్ యూనియన్ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ, అర్జెంటీనా పార్లమెంటు అత్యధిక మెజారిటీతో వై.పి.ఎఫ్ జాతీయ కరణను ఆమోదించింది. వై.పి.ఎఫ్ లో స్పెయిన్ బహుళజాతి కంపెనీ రెస్పోల్ కి గల 57 శాతం వాటాను అర్జెంటీనా ప్రభుత్వం రద్దు చేసేసింది. దేశ వనరులు ప్రభుత్వాల ఆధీనంలో ఉంటేనే దేశాభివృద్ధి జరుగుతుంది తప్ప విదేశీ కంపెనీల వ్యాపారాలకి అప్పజెపితే దేశ ప్రజలకి మిగిలేది చిప్పేనని చాటి చెప్పింది. పశ్చిమ దేశాల కంపెనీల కమీషన్లు భోంచేసి వాటి ముందు సాగిలపడే ప్రభుత్వాలది ద్రోహ బుద్ధే తప్ప దేశాభివృద్ధి కాదని తేల్చి చెప్పింది.

గురువారం జరిగిన ఓటింగ్ లో వై.పి.ఎఫ్ జాతీయకరణను అర్జెంటీనా పార్లమెంటు ‘ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్’ 207-32 ఓట్లతో ఆమోదించిందని రాయిటర్స్ నివేదించింది. పార్లమెంటు చర్యను అర్జెంటీనా దేశ ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతించారు. గత వారం సెనేట్ ఆమోదం పొందిన జాతీయకరణ బిల్లు చట్టం గా రూపొదిద్దుకోవడానికి అధ్యక్షుడి సంతకమే మిగిలి ఉంది. వై.పి.ఎఫ్ జాతీయకరణ అర్జెంటీనా అధ్యక్షురాలు ‘క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్శనర్ కి రాజకీయ విజయంగా పలువురు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ లోని ఇరు సభల్లోనూ 2/3 మెజారిటీ సాధించడం గొప్ప విజయంగా కీర్తిస్తున్నారు. అధ్యక్షురాలి నిర్ణయానికి మద్దతుగా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ లో వేల మంది ప్రజానీకం ర్యాలీలో పాల్గొన్నారని ప్రెస్ టి.వి తెలిపింది.

1990 కి ముందు వై.పి.ఎఫ్ ప్రభుత్వ కంపెనీయే. 1990 ల ప్రారంభంలో దానిని ప్రవేటీకరించారు. 1999 లో స్పెయిన్ కి చెందిన బహుళ జాతి ఆయిల్ కంపెనీ వై.పి.ఎఫ్ లో మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది. అయితే ఆయిల్ కంపెనీలో వచ్చిన లాభాలను రెస్పోల్ దేశం బయటికి తరలించడంతో జాతీయం చేస్తామని అర్జెంటీనా ప్రభుత్వం హెచ్చరిస్తూ వచ్చింది. ఆయిల్ వనరుల అభివృద్ధికి లాభాలను కేటాయించడానికి బదులు సొంత ప్రయోజనాలకి ఉపయోగించడం ఆపాలని కోరింది. అర్జెంటీనా ఆరోపణలను ఓ వైపు తిరస్కరిస్తూనే మరోవైపు తన దోపిడిని రెస్పోల్ కొనసాగించింది. దానితో అర్జెంటీనా ప్రభుత్వం తన హెచ్చరికను అమలులో పెట్టింది.

అర్జెంటీనా చర్యతో యూరోపియన్ యూనియన్ ఆగ్రహం చెందింది. ప్రతీకారం తీర్చుకుంటానని హెచ్చరించింది. ఆ దేశంపై వాణిజ్య ఆంక్షలు విధిస్తామని బెదిరించింది. ఈ బెదిరింపులను అర్జెంటీనా లెక్క చేయలేదు. అయితే పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రికలు వై.పి.ఎఫ్ జాతీయకరణపై విషం కక్కుతున్నాయి. బి.బి.సి, రాయిటర్స్, టెలిగ్రాఫ్ లాంటి మీడియా కంపెనీలన్నీ అర్జెంటీనా ప్రభుత్వ చర్యపై విష ప్రచారం లంకించుకున్నాయి. అర్జెంటీనా ప్రజల ప్రయోజనాల కంటే పశ్చిమ బహుళజాతి కంపెనీల లాభాలే తమకు ముఖ్యమని నిస్సిగ్గుగా చాటుతున్నాయి. తప్పుడు కధనాలు ప్రచురిస్తూ కంపెనీలు కురిపించిన కాసుల్ని అక్షరాలుగా మలుచుకుని సంతృప్తి చెందుతున్నాయి.

పశ్చిమ దేశాల కంపెనీలకి దేశ వనరులను అప్పజెప్పడం తప్ప మరో మార్గం లేదని బోధిస్తున్న భారత పాలకులకి అర్జెంటీనా చర్య కను విప్పు కావాలి. డంకేల్ ఒప్పందాన్ని ఆమోదించడం తప్ప గతి లేదని చెప్పి వీళ్ళు గాట్ ఒప్పందాన్ని భారత దేశ ప్రజలపై రుద్దారు. విదేశీ ప్రవేటు బహుళజాతి కంపెనీలకి గేట్లు బార్లా తెరిచి దేశ ఆర్ధిక వ్యవస్ధని విదేశీ కంపెనీల దయా దాక్షిణ్యాలకి వదిలేశారు. దేశీయ ఆర్ధిక విధానాలను అవలంబిస్తూ దేశ వనరులను ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకుని పురోగమిస్తున్న వెనిజులా, బొలీవియా, అర్జెంటీనా, క్యూబా లాంటి దేశాల ఉదాహరణలని గుడ్డిగా తిరస్కరించారు.

ఫలితంగా అమెరికా, యూరప్ ల ఆర్ధిక వ్యవస్ధలు తుమ్మితే మనవాళ్లు ముక్కులు కారుస్తున్నారు. అక్కడ మేఘాలు కమ్ముకోవడంతోనే ఇక్కడ గొడుగులు తెరుస్తున్నారు. ఎస్&పి లాంటి సాధారణ వాణిజ్య రేటింగ్ కంపెనీలు రేటింగ్ తగ్గిస్తే వణికిపోతున్నారు. విదేశీ కంపెనీల మెప్పు కోసం దేశ కార్మిక చట్టాలను నామ మాత్రం చేసేశారు. అపార మానవ వనరులను ఉపయోగించి సంపద్వంతమైన భారత దేశ వనరులను దేశాభివృద్ధికి వినియోగించడం మాని విదేశీ కంపెనీల పెట్టుబడుల కోసం మోరలు చాస్తున్నారు.  దేశ మూలవాసులైన గిరిజన ప్రజలను వారి ఊళ్ళ నుండి వెళ్లగొట్టి అపార ఖనిజ వనరులను విదేశీ కంపెనీలకు అప్పజెప్పడానికి ఉవ్విళ్లూరుతున్నారు. విదేశీ కంపెనీలు విధిలిచే కమిషన్ డబ్బుల కోసం భారత దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు.

3 thoughts on “స్పెయిన్ ఆయిల్ కంపెనీని జాతీయ చేసిన అర్జెంటీనా

  1. వెన్నెముక అంటే ఇలా ఉండాలి. “ఇప్పటి నుండి మన ఆయిల్ రెస్పోల్ కంపెనీ అమ్ముకునే కమోడిటీ గా ఉనికిని ముగించుకుని దేశ అభివృద్ధి కోసం మౌలిక సరుకుగా ఉపయోగపడుతుంది” లాభం కోసం అమ్ముకునే సరుకుకు, దేశాభివృద్ధికోసం ఉపయోగించబడే మౌలిక సరుకుకు మధ్య తేడా ఎలా ఉంటుందో తేల్చి చెప్పిన పై ప్రకటనను ఈ మధ్యకాలంలో ఇంత శక్తివంతంగా మనం ప్రపంచంలో ఎక్కడైనా విన్నామా?

    సామ్రాజ్యవాదులు ఏది చెప్పినా చొంగ కార్చుకుంటూ తలూపటం, సమర్థించడం అలవాటైపోయిన జాతి మనది. దేశ సంపదను ఎలా కాపాడుకోవాలో చాటి చెబుతున్న అర్జెంటీనా సాహస చర్యను ఆమోదించడానికి, ఎత్తిపట్టడానికి కూడా వెన్నెముక కావాలి మనకు. లేనిదల్లా అదే ఇప్పుడు.

    ఇంతకూ.. ఇంత సాహసోపేత చర్యకు కారణభూతురాలైన అర్జెంటీనా ధీరవనితను సామ్రాజ్యవాదులు ప్రాణాలతో వదిలిపెడతారా? లాటిన్ అమెరికాలో ఎంతమంది నేతలను, దేశాధ్యక్షులను ఈ ముష్కరులు చంపించలేదు?

    ఈ దేశ ప్రజలకు సహజ వాయు ఉత్పత్తి విషయంలో రిలయన్స్ చేస్తున్న నమ్మక ద్రోహాన్నే ఎదిరించడం సాధ్యం కాలేదు మన పాలకులకు. ఇక విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా మాట్లాడడం కూడానా?

    ఈ మనకాలం వీరనారికి ధీరాభివందనాలు.

  2. మీరు చెప్పింది అక్షరల నిజం రాజు గారు….మన దెశానికి ఇప్పుడు కావాల్సింది వెన్నెముక ఉన్న నాఅయకులు. ఈ దేశంలో లోపించింది అదే…మన నేతల్లోనూ, జనం లోనూ దేశాభిమనాన్ని తట్టిలేపె నాయకుడు రావాలి.

వ్యాఖ్యానించండి