‘టెర్రరిజం పై యుద్ధం చేస్తున్నామని’ చెబుతూ అమెరికా సైనికులు ఆఫ్ఘన్ ప్రజానీకాన్ని చంపేస్తున్నారని ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తీవ్రంగా విమర్శించాడు. అధ్యక్ష భవనం వద్ద గురువారం ప్రసంగిస్తూ హమీద్ కర్జాయ్, అమెరికా సైనికులు ఆఫ్ఘన్ పౌరులను చంపుతున్నారనీ, పౌరుల ఇళ్లపై దాడులు చేస్తున్నారనీ, ఆఫ్ఘన్ జాతీయులను తమ జైళ్ళలో అక్రమంగా నిర్భంధిస్తున్నారనీ అమెరికా తో పాటు దాని మిత్ర దేశాలు కూడా యధేచ్ఛగా దుర్మార్గాలు సాగిస్తున్నారని తీవ్ర స్వరంతో విమర్శించాడు.
2014 తర్వాత కూడా మరో పదేళ్ళ పాటు ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైన్యం కొనసాగడానికి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా తో ఒక ఒప్పందం పై సంతకం చేసిన మరుసటి రోజే హమీద్ కర్జాయ్ అమెరికా పైనా, అమెరికా సైనికుల పైనా విమర్శలకి పూనుకున్నాడు. ఒసామా బిన్ లాడెన్ ను హత్య చేసి మే 2 తో సంవత్సరం పూర్తయిన సందర్భంలోనే ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికులు మరింత కాలం కొనసాగడానికి వీలుగా ‘వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం’ పై కర్జాయ్ సంతకం చేశాడు.
మే 1 అర్ధ రాత్రి దాటాక బారక్ ఒబామా ఆఫ్ఘనిస్ధాన్ సందర్శించాడు. ప్రజా వ్యతిరేక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అర్ధ రాత్రి ముహూర్తాలే సరైనవి కాబోలు. అధ్యక్ష భవనంలో కర్జాయ్ తో కలిసి ఒప్పందంపై సంతకం చేసిన ఒబామా అనంతరం ఆఫ్ఘన్ లోని అమెరికా వైమానిక స్ధావరం బాగ్రం సందర్శించి అక్కడి నుండి హుటా హుటిన అమెరికా చెక్కేశాడు. ఒబామా వెళ్ళిన రెండు గంటలకే కాబూల్ నగరంపై తాలిబాన్ మరో సారి దాడులు చేసింది. తద్వారా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ దురాక్రమణ శక్తుల ఆయువు పట్టుపై దాడులు చేయగల శక్తి తనకు ఉన్నదని మరో సారి చాటుకుంది.
వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరినప్పటికీ అది ఇరు పక్షాలకూ అసంతృప్తి కరంగా ఉన్నట్లు పత్రికలు రాస్తున్నాయి. సంవత్సరం నోటీసులో ఒప్పందం రద్దు చేసుకోగల అవకాశం ఇరువురికీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్ పునర్నిర్మాణానికి, భద్రతా బలగాల శిక్షణకీ నిధులిస్తామని ఒప్పందంలో హామీ ఉన్నప్పటికీ నిర్ధిష్ట మొత్తం సాయం చేస్తామన్న హామీ అమెరికా ఇవ్వలేదు. బహుశా ఈ అంశమే అమెరికా పై తీవ్ర విమర్శలు చేయడానికి కర్జాయ్ ని పురికొల్పి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
బాగ్రం వైమానిక స్ధావరంలో అమెరికా సైనికులను ఉత్సాహపరచడానికి ఒబామా ప్రయత్నించాడు. “అమెరికన్లు గానీ, ఆఫ్ఘన్ ప్రజలు కానీ ఈ యుద్ధం కావాలని అడగలేదు. అయినప్పటికీ ఇరు పక్షాలు ఉమ్మడిగా ప్రయాణం సాగించాయి” అని ఆఫ్ఘన్ యుద్ధం ప్రజల ప్రయోజనాలకి కాదని ఒబామా పరోక్షంగా అంగీకరించాడు. అమెరికా భద్రంగా ఉండడానికి కారణం మీరే నంటూ సైనికుల భుజం తడుతూ “యుద్ధం ఇంకా ముగిసిపోలేదు” అని అసలు సంగతి చెప్పాడు. “గుండెలు బద్దలవుతాయి. నొప్పి తప్పదు. కష్టాలు ముందున్నాయి. కానీ మీరు చేసిన త్యాగాల కారణంగా సుదూరాన వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి” అని ఒబామా అమెరికా సైనికులకు గులాబీ ముళ్ళు గుచ్చాడు.
ఓ వైపు మరింత కాలం అమెరికా సైనికులు ఆఫ్ఘన్ గడ్డపై కొనసాగేలా ఒప్పందపై సంతకం చేసిన కర్జాయ్ తన నోటితోనే అమెరికా సైనికులను తూలనాడడం తన లొంగుబాటును కప్పి పుచ్చుకోవడానికే. ఆయన చేసిన నెత్తుటి సంతకం నేరుగా ఆఫ్ఘన్ ప్రజల మాన ప్రాణాలను అమెరికాకి అప్పజెపుతుంది. ఆయన నోటి నుండి వచ్చే పలుకులు వినడానికి ముల్లులా తోచినా ఆచరణలో ఆఫ్ఘన్ లోని అమెరికా ఉనికిని అంగుళంగా కూడా కదల్చవు.