అవును, నేను వేశ్య కూతుర్నే -నసీమా (వీడియో)


తల్లిదండ్రుల నిరాదరణకి గురై ఓ వేశ్య చేతికి చిక్కిన నసీమా కధ ఇది. వేశ్యా జీవితం బారిన పడకుండా తనను కాపాడిన అమ్మమ్మ కాని అమ్మమ్మ లాంటి వారి జీవితాలలో కొత్త మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న నసీమా అద్భుత మహిళ అనడంలో సందేహం లేదు. విదేశీ నిధుల కోసం ‘ప్రగతి శీల ఫోజులు’ కొట్టే ఎన్.జి.ఒ సంస్ధలపై నమ్మకం లేక తానే ‘పార్స్చం’ అనే సంస్ధను స్ధాపించి ఆశావహ దృక్పధంతో ముందుకు సాగుతోంది నసీమా.

తల్లిదండ్రులు విడాకులు తీసుకుని తన గురించి పట్టించుకోకపోవడంతో నసిమా అనాధగా మారింది. పదివేల మంది వేశ్యలు నివసించే చతుర్భుజ్ స్ధాన్ వేశ్యావాటికి చేరింది. అయితే ఆమెను చేరదీసిన మహిళ మరో వేశ్యని సృష్టించడానికి పూనుకోలేదు. తాను ఒళ్ళు అమ్ముకుని సంపాదించినదానితో నసీనాను స్కూల్ లో చేర్పించింది. పోలీసులు రెయిడ్ చేసినప్పుడల్లా నసీమాను టాయిలెట్ లాంటి చోట్ల దాచి కాపాడుకుంది. అలా చదువుకుని పెరిగి పెద్దదయిన నసీమా ఇప్పుడు వేశ్యావాటిక లోని మహిళల జీవితాల్లో నిజమైన మార్పు కోసం కృషి చేస్తోంది. సంస్ధ చేకూర్చిన పరిమిత బలంతోనే నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుండి తెస్తున్న అమ్మాయిలను తిరిగి సొంత చోటికి పంపించడానికి ప్రయత్నిస్తోంది. బంగ్లాదేశ్ నుండి పెళ్ళి పేరుతో సొంత బావ చేత మోసగించబడిన ఒక బాలిక గాధను కూడా వీడియోలో చూడవచ్చు.

చదువులో ఉన్నన్నాళ్లూ తాను నివసించిన చోటు చెప్పడానికి భయపడిన నసీమా, PARSCHAM స్ధాపించాక ‘అవును నేను వేశ్య కూతురినే’ అని నిర్భయంగా చెప్పగలుగుతోంది. ప్రభుత్వాలు చిత్త శుద్ధితో కృషి చేస్తే వేశ్యావృత్తి నుండి మహిళలను బయటపడేయడం పెద్ద కష్టమేమీ కాదని నసీమా కృషి చూపుతోంది. అయితే, ప్రభుత్వాలకు లేనిదే ‘చిత్త శుద్ధి’ కనుక మరింత మంది నసీమాలు తయారు కావడం తప్ప ఈ మహిళలకు మరో మార్గం లేదు.

వ్యాఖ్యానించండి