రెండు ఉత్తర భారత రాష్ట్రాలలో జరిగిన ఘాతుకం ఇది. భర్త చనిపోయిన మహిళను అరవై వేల రూపాయలకి అమ్మడమే కాక ఆమెని కాపాడడానికి వెళ్ళిన సోదరుడినీ తన్ని తరిమేశారు. అనంతరం ఆమెని కాపాడడానికి వెళ్ళిన పోలీసు బృందాన్ని కూడా కొట్టి తరిమారు. ఇపుడు మరో పోలీసు బృందాన్ని పంపుతున్నామని మధ్య ప్రదేశ్ లోని జిల్లా ఎస్.పి చెప్పాడు.
మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళను ముగ్గురు వ్యక్తులు రాజస్ధాన్ లోని ఓ గ్రామస్ధునికి అమ్మేశారు. అమ్మిన ముఠాలో ఒక స్త్రీ కూడా ఉంది. బాధితురాలి పేరు సీమా పరిహార్. మొరేనాలోని కేశవ్ కాలనీ నివాసి. రాజస్ధాన్ లో కైలా దేవీ గుడికి తీసుకెళ్తానని చెప్పి విజయ్ సింగ్ రావత్ ఆమెని రాజస్ధాన్ తీసుకెళ్ళాడు. అక్కడ కరూలి జిల్లాలోని కసేదా గ్రామ మహిళ కల్లీ మీనాకు ఆమెను రు. 60,000 కి అమ్మేశాడని పోలీసులు తెలిపారు.
సీమ ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి ఆమె సోదరుడు సంతోష్ వెతుక్కుంటూ వెళ్ళి రావత్ ని కలిశాడు. అతని తో పాటు మున్ని కుశ్వహ, పిట్టులు కూడా ఈ ముఠాలో ఉన్నారని ఎన్.డి.టి.వి తెలిపింది. ఈ ముగ్గురినీ సంతోష్ కలిశాడనీ, రాజస్ధాన్ లోని కసేదాలో మీనాతో కలిసి ఉంటోందని సంతోష్ కి వారు నచ్చ జెప్పారనీ తెలిపింది. సీమ ని కలిశాక సంతోష్ కి పూర్తి విషయం అర్ధం అయింది. ఆందోళన చెందిన సంతోష్ తన సోదరిని తనతో తీసుకెళ్లడానికి ప్రయత్నించగా మీనా సంబంధీకులు ఇతర గ్రామస్ధులు అతన్ని చావ బాదారు.
గ్రామస్ధులు కొట్టడంతో సోదరి లేకుండానే సంతోష్ తిరిగి వచ్చాడు. అనంతరం తమ జిల్లా మొరేనా ఎస్.పి సంజయ్ కుమార్ కి ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఎస్.పి సీనాను వెనక్కి తేవడానికి పోలీసు బృందాన్ని పంపగా వారిని కూడా రాజస్ధాన్ గ్రామస్ధులు కొట్టి పంపారు. మరో పోలీసు బృందాన్ని రాజస్ధాన్ కి పంపుతున్నామని ఎస్.పి పత్రికలకు తెలిపాడు. సీమను రు. 60,000 కి అమ్మేశారని ఎస్.పి ధృవ పరిచాడని ఎన్.డి.టి.వి తెలిపింది. సీమను అమ్మేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.
దక్షిణ భారతం లోని రాష్ట్రాలతో పోలిస్తే, ఉత్తర భారతం లోని హిందీ ప్రాంతాలు సాంస్కృతికంగా ఎదగలేదని విశ్లేషణల్లో చదువుతుంటాం. ఇలాంటి ఘటనలు జరిగినపుడు అది నిజమనిపిస్తుంది. ఒకే భాష మాట్లాడడం వల్లనేమో అంతర్రాష్ట్ర స్ధాయిలో మహిళల అక్రమ రవాణా వార్తలు అనేకం పత్రికలకు ఎక్కుతున్నాయి. ఈ పరిస్ధితిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ చర్యలు తీసుకోవడం లేదు. కనీసం ఆందోళన చెందుతున్న పరిస్ధితి కనిపించడం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో సైతం ఆకాశంలో సగం అంటూ ‘అంతర్జాతీయ మహిళా దినం’ రోజు న ఉపన్యాసాలు గుప్పించడమే తప్ప మహిళల రక్షణ కోసం ఆచరణాత్మకంగా నిర్ధిష్ట చర్యలు తీసుకుంటున్న దాఖలాలు తక్కువే. వ్యవస్ధ మార్పుతో ముడిపడి ఉన్న ఈ సమస్య ప్రభుత్వ చట్టాలతో మారుతుందని ఆశించడం కూడా వ్యర్ధమే.
meeru cheppindhi nijame sir. system thto patu… mana alochana vaikhari lonu marpu ravali. bhahusa idhi kuda westren culture effect kavachhu. anni human values tho patu…adavallanu kuda vasthuvu ga chuse sankuchith vaikhari varidhi. ika adavallanu devathalu antune…ammukene dhusthithi manadhi. okka hindhi rastrale kadhu…. mana rastram lo kuda….adavallatho bahirangamga asabhya dancelu cheyinachadam, balavanthamga vyabhicharam cheyinchadam lanti ghatanalu THARAsilluthai. manam sanghikamga inka chala edhagalsi undhi.
చందుగారూ, మన ఆలోచనల్లోనూ మార్పు రావాలన్నదే నా ఉద్దేశ్యం కూడా. అయితే వ్యవస్ధను నడిపే స్ధానంలో ప్రభుత్వాలు ఉంటాయి. అధికారంలో ఉన్న వర్గాలే వ్యవస్ధ నడవడిని శాసించే స్ధానంలో ఉన్నపుడు ఈ పరిస్ధితి మార్చడానికి వాళ్ళెందుకు పూనుకోరన్న ప్రశ్న తలెత్తుతుంది. అరవైయేదేళ్ల స్వతంత్రంలో వీరికి మహిళల పరిస్ధితి మార్చేందుకు తీరిక లేదంటే నమ్మలేం. స్టేటస్ కో వల్ల వీరికి ఏ లాభం లేకుండా దాన్నెందుకు కొనసాగిస్తారు? మీరన్నట్లు ఆడవారిని మనుషుల్లా కాక వస్తువులా చూసే దృక్పధం ఈ పరిస్ధితికి కారణం. అదే వ్యాపార దృక్పధం.
పశ్చిమ దేశాలపై నెపం నెట్టడం కూడా భావ్యం కాదేమో. పశ్చిమ దేశాలు మన దేశానికి రాక మునుపు కూడా భారత స్త్రీల పరిస్ధితి ఇలాగే తగలడింది. భారత దేశంలో భూస్వామ్య వ్యవస్ధ ఇంకా బలంగా ఉన్నందున, భూస్వామ్య వర్గం కూడా అధికారంలో ఉన్నందున మహిళల పరిస్ధితి మౌలికంగా మారడం లేదు. భూస్వామ్య వ్యవస్ధను అన్ని రంగాల్లో కూల్చవలసిన భారత పెట్టుబడిదారీ వర్గం దానితో మిలాఖతయిన ఫలితంగా భూస్వామ్య వ్యవస్ధ వినాశనం నిరవధికంగా వాయిదా పడింది. భారత పెట్టుబడిదారీ వర్గం పూర్తిగా అభివృద్ధి చెందకుండా విదేశీ పెట్టుబడిదారులు వారి నెత్తిపై కూర్చోవడం కూడా భారత దేశంలో భూస్వామ్య మూలాలు సురక్షితంగా ఉండడానికి కారణం.
శేఖర్ గారు… మరి మహిళల పరిస్థితి మారాలంటే ఈ వ్యవస్థ కూలిపోవటం తప్ప మరో మార్గం లేదా సార్..?
చందు గారూ, వ్యవస్ధ కూలిపోవడం అంటే మీ ఉద్దేశ్యం ఏమిటో నాకు తెలియదు. బహుశా భూస్వామ్య వ్యవస్ధ కూలిపోవడం అని మీ ఉద్దేశ్యం కావచ్చు.
భారత దేశంలో భూస్వాములు ఒక్కరే ఆధిపత్యంలో లేరు. పైన చెప్పినట్లు భూస్వాములు, పెట్టుబడిదారులు ఉమ్మడిగా ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వీరు విదేశీ సామ్రాజ్యవాద ఆధిపత్యానికి లొంగి ఉన్నారు. ఆధిపత్యం అంటే, దేశంలోని ఉత్పత్తి సాధనాలన్నీ (భూములు, పరిశ్రమలు) వారి చేతుల్లోనే ఉన్నాయి. ఏ వ్యవస్ధలోనైనా ఉత్పత్తి సాధనాలు ఆధీనంలో పెట్టుకున్నవారే అధికారం చెలాయిస్తారు. భూస్వామ్య వర్గం, పెట్టుబడిదారీ వర్గం, విదేశీ సామ్రాజ్యవాద వర్గం భారత దేశాన్ని నడిపిస్తున్నారు. ఉత్పత్తి సాధనాలను వీరి నుండి స్వాధీనం చేసుకుని సమాజానికి అప్పజెప్పాల్సిన కర్తవ్యం భారత కార్మికవర్గంపై ఉంది. ఆ పని రష్యా, చైనాల్లో పూర్తయినా పెట్టుబడిదారీ వర్గం మళ్లీ తలెత్తి ఉత్పత్తి సాధనాలని లాగేసుకున్నారు. భారత దేశం లాంటి అనేక దేశాల్లో అలాంటి కార్మిక వర్గ విప్లవాలు అభివృద్ధి చెందలేదు. అయితే సమాజాలు ముందుకే వెళ్తాయి. ఒక్కో ఆధిపత్యాన్ని ఓడిస్తూ విజయం సాధిస్తాయి. ఆయా వర్గాల బలా బలాలను బట్టి సమాజాల మార్పు ఎంత దూరంలో ఉండేదీ తేలుతుంది. భారత దేశం లో అలాంటి కృషి ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నట్లు కనిపిస్తోంది.