ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావించి కాల్చి చంపిన కేసులో నౌకతో పాటు సిబ్బంది కూడా భారత దేశం నుండి వెళ్లిపోవడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. 3 కోట్ల రూపాయల బాండు సపర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణ నిమిత్తం మళ్ళీ అవసరం అయితే మళ్ళీ భారతీయ కోర్టులకు హాజరు కావలసి ఉంటుందని కోర్టు ఇటలీ నౌక సిబ్బందికి షరతు విధించింది. కోర్టు సమన్లు జారీ చేసిన ఐదు నెలలలోపు సిబ్బంది కోర్టులకు హాజరు కావాలన్న షరతుకు ఇటలీ సిబ్బంది అంగీకరించడంతో స్వదేశం వెళ్లిపోవడానికి వీలుగా నౌకను, సిబ్బందిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నౌకలో ఉన్న ఆరుగురు సిబ్బంది తో పాటు నలుగురు మెరైన్లు స్వదేశం వెళ్లడానికి సుప్రీం అనుమతి ఇచ్చింది. భారతీయ న్యాయ వ్యవస్ధ కోరినపుడు అందుబాటులో మెరైన్లు, సిబ్బంది అందుబాటులో ఉంటారని ఇటలీ ప్రభుత్వంతో పాటు నౌక యజమాని కూడా హామీ ఇచ్చారు. కేరళ హై కోర్టు వద్ద 3 కోట్ల రూపాయల సూరిటీ ఇవ్వాలని నౌక యజమానిని కోర్టు ఆదేశించింది. సమన్లు అందుకున్న ఐదు నెలల లోపు సిబ్బంది భారతీయ కోర్టులకు హాజరు కావాలనీ, నౌక కూడా సమన్లు అందుకున్న 7 నెలల లోపు భారతీయ అధికారులకు అందుబాటులో ఉండాలనీ కోర్టు షరతు విధించింది.
అయితే జాలర్లపై కాల్పులు జరిపిన ఇద్దరు మెరైన్ల పైన విచారణ జరిపేందుకు కేరళ హై కోర్టుకు హక్కు ఉంటుందనీ, తన తీర్పు ఆ హక్కుకు భంగం కాదని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది. మెరైన్లపై నమోదు చేసిన కేసులను రద్దు చేయాలన్న ఇటలీ ప్రభుత్వ అభ్యర్ధనపై అభిప్రాయాలూ చెప్పాలని సుప్రీం కోర్టు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను గతంలో కోరింది. భారత దేశం యు.ఎన్ ఛార్టర్ సంతకం దారు కనుక, నేరం అంతర్జాతీయ జలాల్లో జరిగినందున ఆర్టికల్ 32 ప్రకారం కేరళ ప్రభుత్వానికి తమ మెరైన్లను విచారించే అధికారం లేదని ఇటలీ ప్రభుత్వం వాదిస్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం మాత్రమే నేర విచారణ జరగాలని వాదిస్తోంది.
నౌకను విడుదల చేయాలని ట్రయల్ కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ దానిపై కేరళ హై కోర్టు స్టే విధించింది. హై కోర్టు స్టే పై నౌక యజమాని సుప్రీం కోర్టుకి అప్పీలు చేశాడు. చనిపోయిన జాలర్ల కుటుంబాలకు డబ్బు చెల్లించి నౌక యజమాని రాజీపడడం చట్ట వ్యతిరేకమని సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించింది. నౌక విడుదల చేయడం పైనా, కేసులు రద్దు చేయడం పైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అభిప్రాయం ఏమిటన్నదీ తెలియరాలేదు.