ఈజిప్టు అధ్యక్ష అభ్యర్ధికి బ్రిటన్ గూఢచార సంస్ధ ‘ఎం.ఐ6’ ప్రచారం


amir moussaఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ‘ఫ్రంట్ రన్నర్’ గా పశ్చిమ దేశాల పత్రికలు ప్రచారం చేస్తున్న ‘ఆమిర్ మౌస్సా’ కు బ్రిటన్ కి చెందిన విదేశీ గూఢచారులు ప్రచారం చేస్తున్నారని ఈజిప్టు పత్రికలు వెల్లడించాయి. ‘ఇస్లామిక్స్ టైమ్స్’ పత్రిక విలేఖరి పరిశోధనాత్మక కధనాన్ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి ఈ సంగతి తెలిపింది. దుష్ట త్రయ దేశాలయిన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలకు ‘ఇష్టుడు’ గా ఆమిర్ మౌస్సా ఇప్పటికే పేరు సంపాదించాడు. అమీర్ మౌస్సా ప్రచారం చుట్టూ అల్లుకున్న రహస్యాన్ని ఈజిప్టు పత్రికలు చేదించాయని ప్రెస్ టి.వి తెలిపింది.

‘ఎం.ఐ 6’ సంస్ధ బ్రిటన్ కి చెందిన విదేశీ గూఢచార సంస్ధ. అమెరికాకి ‘సి.ఐ.ఏ’, పాకిస్ధాన్ కి ‘ఐ.ఎస్.ఐ’, ఇజ్రాయెల్ కి ‘మొస్సాద్’, ఇండియాకి ‘రా’ (రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఎలాంటిదో బ్రిటన్ కి ఎం.ఐ 6 అలాంటిది. హాలీవుడ్ సినిమాల్లో సాహస కృత్యాలు చేసే ‘జేమ్స్ బాండ్ 007’ ఈ సంస్ధ తరపున పని చేసేవాడే. సి.ఐ.ఏ లాగే ఈ సంస్ధ కూడా ప్రపంచంలో మా చెడ్డ పేరు సంపాదించుకుంది. అలాంటి సంస్ధకి చెందిన గూఢచారులు గత మూడు నెలల నుండి ఈజిప్టులో తిష్ట వేసి అమీర్ మౌస్సా ప్రచార బాధ్యలు చూస్తున్నారని ‘ఇస్లామిక్ టైమ్స్’ ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది.

కైరో లో బ్రిటిష్ రాయబారి జేమ్స్ వాట్ ద్వారా అమీర్ మౌస్సా కోసం ఈజిప్టులో పని చేయడానికి గూఢచారులకి శిక్షణ ఇచ్చేందుకు కూడా బ్రిటన్, అమీర్ ల మధ్య ఒప్పందం కుదిరిందని ఇస్లామిక్ టైమ్స్ వెల్లడించింది. టూరిస్టులుగా మూడు నెలల క్రితమే ఈజిప్టులో ప్రవేశించిన బ్రిటిష్ గూఢచారులు ఆమిర్ కోసం అనేక కార్యకలాపాలు నిర్వహించారు. ఈజిప్టు ప్రజల పరిస్ధితులను అధ్యయనం చేసి ఆమిర్ కి నివేదికలు సమర్పించారు. ఈజిప్టు లో ఏయే ప్రాంతాల్లో ఏయే తెగల ప్రజలు నివసిస్తున్నదీ, వారి వర్గ విభజన తెగల విభజన ఎలా ఉన్నదీ రిపోర్టులు తయారు చేశారు. వాటి ద్వారా ప్రచార వ్యూహాలు రూపొందించారని పత్రిక తెలిపింది.

ఆమిర్ ప్రచార ఖర్చులను బ్రిటిష్ గూఢచారులే నేరుగా చూస్తున్నారని పత్రిక తెలిపింది. ఇప్పటికే పెద్ద ఎత్తున అమీర్ మౌస్సా ఎన్నికల్లో ఖర్చు పెట్టాడనీ అదంతా బ్రిటిష్ గూఢచార సంస్ధే చూసుకుందని తెలిపింది.

అమీర్ మౌస్సా ఈజిప్టు నియంత హోస్నీ ముబారక్ పాలనలో విదేశాంగ మంత్రిగా పని చేశాడు ముబారక్ ప్రతినిధిగా 22 అరబ్ దేశాల కూటమి ‘అరబ్ లీగ్’ కి పదేళ్ళ పాటు నాయకత్వం వహించాడు. 1 జూన్ 2001 నుండి 1 జూన్ 2011 వరకూ అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ గా పని చేశాడు. ఆఫ్రికా అరబ్ దేశం లిబియా అధ్యక్షుడు గడ్డాఫీ ని అంతం చేయడంలో అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలకి పూర్తిగా సహకరించాడు. అరబ్ దేశాల ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి బదులు అరబ్ దేశాలను దుష్ట త్రయ దేశాలకు తాకట్టు పెట్టడంలో సాధనంగా ఉపయోగపడ్డాడు. అందుకే ఆమిర్ మౌస్సా ఈజిప్టు అధ్యక్షుడుగా ఉండాలని దుష్ట త్రయం కోరుకుంటోంది. అనుంగు మిత్రుడు ముబారక్ లేని లోటుని మౌస్సా పూడ్చుతాడని అవి నమ్మకం పెట్టుకున్నాయి.

ఈజిప్టు ప్రజలు ఈ కుట్రలను గుర్తెరిగి అమీర్ మౌస్సాని పాతాళంలోకి తొక్కేయాలి. ఆమిర్ మౌస్సా లాంటి వారు ఉండవలసింది అధ్యక్ష స్ధానంలో కాదని తెలియజెప్పాలి.

వ్యాఖ్యానించండి