జాతీయం
ఆఫ్ఘన్ సైనిక ఉపసంహరణతో భారత్ అప్రమత్తం కావాలి
ఆఫ్ఘనిస్ధాన్ మత ఛాందస సంస్ధలు భారత్ సరిహద్దుల్లో జమకూడే ప్రమాదం ఉందని భారత సైనికాధికారి ఒకరు హెచ్చరించాడు. కర్ణాకటక లో ఒక కార్యక్రమంలో మాట్లాఆడుతూ ఆయన ఈ హెచ్చరిక చేశాడు. ముఖ్యంగా అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఉపసంహరించుకున్నాక ఈ ప్రమాదం తలెట్టవచ్చని ఆయన తెలిపాడు. జమాత్ ఉద్-దావా నాయకుడు, ముంబయ్ దాడులకు బాధ్యుడుగా అనుమానిస్తున్న హఫీజ్ సయీద్ ఇటీవల చేసిన ప్రకటనను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ప్రస్తుతం ఆఫ్ఘన్ సమస్యతో తాము డీల్ చేస్తున్నామనీ, నాటో బలగాలు వెళ్లిపోయాక తాము కాశ్మీరు పై కేంద్రీకరిస్తామనీ హఫీజ్ ఇటీవల ప్రకటించాడు. దాన్ని బట్టి ఇండియా-పాక్ ల మధ్య ఉన్న ‘వాఘా’ సరిహద్దు కి సమీపంలో మత శక్తులు చేరవచ్చని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్.ఏ.కె బ్రౌన్ అన్నాడు.
అంతర్జాతీయం
లాడెన్ ని పట్టిచ్చే క్లూ మేమిచ్చిందే -ఐ.ఎస్.ఐ
ఒసామా బిన్ లాడేన్ ఆచూకీ తెలియడానికి తగిన సమాచారం ఇచ్చింది తామేనని ఐ.ఎస్.ఐ ప్రతినిధి చెప్పినట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ తెలిపింది. బిన్ లాడెన్ ను అమెరికా హత్య చేసి మే 2 తేదీతో సంవత్సరం అవుతుంది. ఈ సందర్భంగా లాడేన్ పాక్ లో దాక్కునేలా సహకరించిందన్న ఆరోపణలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఐ.ఎస్.ఐ కి తలెత్తింది. తామిచ్చిన సెల్ ఫోన్ నంబరు ఆధారంగానే ఆల్-ఖైదా కొరియర్ సమాచారం అమెరికాకి తెలిసిందని ఐ.ఎస్.ఐ ప్రతినిధి చెప్పాడు. అయితే ఐ.ఎస్.ఐ వాదనను అమెరికా అధికారులు తిరస్కరించారని కూడా వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.
అమెరికా ఎంబసీ రక్షణలో చైనా అసమ్మతివాది
కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ నిర్భంధం నుండి తప్పించుకున్న ప్రముఖ చైనా అసమ్మతి వాది ‘చెన్ గువాంగ్ చెన్’ అమెరికా రక్షణలో ఉన్నట్లు ‘ది హిందూ’ తెలిపింది. బహుశా చైనా రాజధాని బీజింగ్ లోని అమెరికా ఎంబసీలో చెన్ ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అయితే అమెరికా ఎంబసీ ఈ వార్తను అంగీకరించడంగానీ, ఖండించడం గానీ చేయలేదు. న్యాయవాది అయిన చెన్ బలవంతపు అబార్షన్లకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాచుర్యం పొందాడు. అంధుడయిన చెన్ ను సంవత్సరం న్నర నుండీ చైనా ప్రభుత్వం గృహ నిర్భంధంలో ఉంచింది. వివిధ దేశాలలో తమ కంపెనీల వ్యాపార ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి తాను ఉపయోగించే ‘మానవ హక్కుల’ అస్త్రాన్ని చైనాపై కూడా అమెరికా ప్రయోగిస్తుంది. అటువంటి అమెరికా అస్త్రాలలో చెన్ కూడా ఒకరు.