ఇద్దరు భారతీయ జాలర్లను సముద్ర దొంగలుగా భావిస్తూ ఇటాలియన్ నౌక రక్షణ బలగాలు కాల్చి చంపిన కేసులో కేరళ ప్రభుత్వ అవగాహనను సుప్రీం కోర్టు నిలదీసింది. నౌక యజమానులు, జాలర్ల కుటుంబాలు కుదుర్చుకున్న ‘రాజీ’ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించలేదని సుప్రీం కోర్టు బెంచి నిలదీసింది.
“భారత న్యాయ వ్యవస్ధకే ఇది సవాలు లాంటిది. ఇది అనుమతించరానిది. అత్యంత దురదృష్టకరం” అని ఆర్.ఎం.లోధా, హెచ్.ఎల్.గోఖలే లతో కూడిన బెంచి వ్యాఖ్యానించింది. ఒక్క కోటుంబానికి నౌక యజమానులు కోటి రూపాయలు చెల్లించినట్లుగా పత్రికలు, ప్రసార సాధనాలు వెల్లడించాయి.
నౌకను విడుదల చేయడానికి దాని యజమానులు వేసిన పిటిషన్ కి సంబంధించి ఇటలీ ప్రభుత్వ అవగాహన ఏమిటన్నదీ తెలియజేయాలని ఇటలీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు కోరింది. ‘ఎన్రికా లేక్సీ’ యజమాని కంపెనీ అయిన ‘డాల్ఫిన్ ట్యాంకర్స్’, సుప్రీం కోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. నౌకను విడుదల చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళ హైకోర్టు స్టే చేయడానికి వ్యతిరేకంగా ఈ పిటిషన్ దాఖలయింది.
డాల్ఫిన్ ట్యాంకర్స్ పిటిషన్ పై తన నిర్ణయాన్ని మంగళవారం వరకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీం బెంచి తెలిపింది. నౌక సిబ్బందిని గానీ, జాలర్లను చంపిన ఇద్దరి మెరైన్లను గానీ, అవసరం లేకుండా, నిర్భంధం లోకి తీసుకోవడానికి తాను అనుకూలం కాదని బెంచి తెలిపింది. ఆర్టికల్ 21 ప్రకారం భారతీయులే కాకుండా భారత దేశంలో ఉన్న ఎవరికైనా ఉన్న జీవిత హక్కును రాజ్యాంగం గుర్తించిందని బెంచి గుర్తు చేసింది. దేశంలో ఉన్న విదేశీయుల ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉండని తెలిపింది.
నౌక సిబ్బందిపై క్రిమినల్ కేసులు రద్దు చేయాలన్న ఇటలీ ప్రభుత్వ పిటిషన్ విషయంలో అభిప్రాయాలూ చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఏప్రిల్ 23 న సుప్రీం కోర్టు కోరింది. జాలరి కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించడానికి నౌక యజమానులు ముందుకు వస్తే దానిని వ్యతిరేకించడంలో సుప్రీం కోర్టు అవగాహన ఏమిటన్నది పూర్తిగా తెలియరాలేదు.