గత యేడేళ్ళలో అమెరికా మానవ రహిత విమానాలు మూడువేల మంది అమాయక పాకిస్ధాన్ పౌరులను చంపేశాయని మానవ హక్కుల కార్యకర్త ఒకరు తెలిపాడు. మొత్తం దాదాపు మూడువేల మంది అమెరికా డ్రోన్ దాడుల్లో చనిపోగా వారిలో 2,800 మంది అమాయక పౌరులేనని పాకిస్ధాన్ మానవ హక్కుల కార్యకర్త షాజాద్ అక్బర్ ని ఉటంకిస్తూ ప్రెస్ టి.వి తెలిపింది. 170 మంది మాత్రమే అమెరికా దురాక్రమణపై పోరాడుతున్న “మిలిటెంట్లు” అని ఆయన తెలిపాడు.
“ఫౌండేషన్ ఫర్ ఫండమెంటల్ రైట్స్” అనే మానవ హక్కుల సంస్ధ డైరెక్టర్ షాజాద్ అక్బర్ ని ప్రెస్ టి.వి శనివారం ఇంటర్వ్యూ చేసింది. 2,800 మందిని కేవలం మిలిటెంట్లు అన్న అనుమానంతోనే అమెరికా చంపేసిందని అక్బర్ తెలిపాడు. చనిపోయినవారి ఐడెంటిటీని అమెరికా వెల్లడించలేదని ఆయన తెలిపాడు. గత జనవరిలో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా మొదటిసారిగా డ్రోన్ దాడులను ధృవపరిచాడు.
తమ డ్రోన్ దాడుల్లో అధిక భాగం ఫటా (ఎఫ్.ఎ.టి.ఎ -ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ ట్రైబల్ ఏరియాస్) లోనే జరుగుతున్నాయని ఒబామా ప్రకటించాడు. పాకిస్ధాన్ భూభాగంపై అమెరికా డ్రోన్ లు జరుపుతున్న హంతక దాడులను పాకిస్ధాన్ ప్రభుత్వం అధికారికంగా అనుమతించలేదు. అయినప్పటికీ అమెరికా డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. ఆ దాడుల్లో వందల మంది పాక్ పౌరులు చనిపోతూనే ఉన్నారు. అమెరికా డ్రోన్ దాడులకు తమ అనుమతి లేదని పాక్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వారి అనుమతి లేనిదే డ్రోన్ దాడులు జరగవన్నది జగమెరిగిన సత్యం. పైకి ఎన్ని చెప్పినప్పటికీ పాక్ ప్రభుత్వం అమెరికా డ్రోన్ దాడులకు రహస్య ఆమోదం తెలిపిందని పత్రికలు అనేకసార్లు పరిశోధనాత్మక కధనాలు ప్రచురించాయి.
“డ్రోన్ దాడులు చట్ట విరుద్ధమనీ, ప్రతికూల ప్రభావం కలిగిస్తాయనీ కనుక ఆమోదనీయం కాదనీ మేము స్పష్టంగా చెబుతున్నాము” అని జనవరి 31 తేదీన పాకిస్ధాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ బాసిత్ ప్రకటించాడు. తమ అభిప్రాయం మొదడినుండీ స్పష్టంగానే ఉందని ఆయన చెప్పాడు. పైకి వ్యతిరేకిస్తూ అంతర్గతంగా ఆమోదించడమే పాక్ అభిప్రాయంలో ఉన్న అసలు స్పష్టత.
పాకిస్ధాన్ గిరిజన రాష్ట్రాల్లో 2010 లో 101 డ్రోన్ దాడులు జరగగా, 2011 లో 64 దాడులు జరిగాయని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలియజేసింది. డ్రోన్ దాడులను అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ ప్రారంభించినప్పటికీ ఒబామా పాలనలో అవి తీవ్రం అయ్యాయి. పాకిస్ధాన్ తాలిబాన్, ఆల్-ఖైదా మిలిటెంట్లను తాము టార్గెట్ చేస్తున్నామని అమెరికా చెప్పినప్పటికీ దాడుల్లో బలవుతున్నది ప్రధానంగా అమాయక పౌరులే. ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లలోనే కాక అమెరికా సోమాలియా, యెమెన్ దేశాలలో కూడా డ్రోన్ దాడులు నిర్వహిస్తూ అమాయక పౌరులను అనేకమందిని చంపుతోంది. తద్వారా ఆఫ్-పాక్ దేశాలలో లెక్కకు మిక్కిలిగా యుద్ధ నేరాలకు పాల్పడుతూ, యుద్ధం లేని ప్రాంతాల్లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది.