రాజకీయ సంస్కరణల కోసం లక్ష మంది మలేసియన్ల ప్రదర్శన


rally for Malaysia reformsమలేసియా రాజధాని కౌలాలంపూర్ లో రాజకీయ సంస్కరణలను డిమాండ్ చేస్తూ ప్రదర్శన నిర్వహించినవారిపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రసాయనాలు కలిపిన నీళ్ళు ప్రదర్శకులను చెదర గొట్టారు. ఎన్నికల విధానాన్ని పూర్తిగా సంస్కరించాలనీ, పాలక పక్షం పట్ల పక్షపాతం వహిస్తున్న ఎన్నికల కమిషన్ ను సంస్కరించాలనీ, విదేశాల్లో ఉన్న మలేసియన్లకు కూడా ఓటు హక్కు కల్పించాలనీ ప్రదర్శకులు డిమాండ్ చేశారు. ప్రదర్శనలో లక్ష మంది పాల్గొన్నారని మలేసియా పత్రిక ‘ది సన్’ తెలుపగా 80,000 పైగా పాల్గొన్నారని ఇతర పత్రికలు రాశాయి. 25,000 మంది ఉంటారని పోలీసులు  చెప్పినట్లు ‘ది హిందూ’ తెలిపింది.

గత దశాబ్దంలో ఇంత పెద్ద ప్రదర్శన జరగలేదని పత్రికలు వ్యాఖ్యానించాయి. ఎన్నికల సంస్కరణల కోసం గత సంవత్సరం జులై లో 20,000 మందితో ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శన తర్వాత మలేసియా అధ్యక్షుడు నజీబ్ రజాక్ ఎన్నికలకు సంబంధించి కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటికీ అవి నామ మాత్రమేనని ప్రదర్శకులు విమర్శించారు. బ్రిటన్ వలస పాలన నుండి 1957 లో స్వాతంత్ర్యం పొందిన మలేసియాలో పాలక కూటమి నేషనల్ ఫ్రంట్ అప్పటి నుండీ నిరవధికంగా అధికారంలో కొనసాగుతోంది. వచ్చే జూన్ లో ప్రభుత్వం రద్దు చేసి అధ్యక్షుడు ఎన్నికలకు పిలుపివ్వవచ్చని ఊహాగానాలు వ్యాపించిన నేపధ్యంలో శనివారం ప్రదర్శన జరిగింది.

ఎన్నికల కమిషన్ పాలక కూటమి పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని ప్రదర్శకులు ఆరోపించారు. ఓటర్ల జాబితా అంతా తప్పుల తడక అనీ, తప్పుడు ఓటర్లతో అధికారం లో కొనసాగడానికి పాలక కూటమి ప్రయత్నిస్తున్నదనీ ఆరోపించారు. పసుపు చొక్కాలు ధరించిన ప్రదర్శకులు కౌలాలంపూర్ లోని చారిత్రాత్మక ‘మెర్డెకా స్క్వేర్’ వద్ద ప్రదర్శన నిర్వహించారు. స్క్వేర్ లో ప్రవేశించడానికి ప్రదర్శకులకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. ప్రదర్శన ముగిసే సమయంలో కార్యకర్తలు స్క్వేర్ లోకి చొచ్చుకు పోవడానికి ప్రయత్నించారు. దానితో పోలీసులు టియర్ ప్రయోగించారు. రసాయనాలు కలిపిన నీటిని జల్లారు. 20 మందికి పైగా అరెస్టు చేశారని బి.బి.సి తెలిపింది.

ప్రతిపక్షాల మద్దతు ఉన్న ‘బెర్సిహ్’ అనే సంస్ధ ప్రదర్శనకు నాయకత్వం వహించింది. సంస్ధ నాయకురాలు అంబిగా నాయకత్వంలోనే గత సంవత్సరం ప్రదర్శన జరిగింది. అప్పటి ప్రదర్శనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 1600 మందికి పైగా అరెస్టు చేసారు. టియర్ గ్యాస్, లాఠీచార్జీ, వాటర్ కెనాన్ లు ప్రయోగించారు. అప్పటి నుండీ అంబిగా పేరు మలేసియాలో పాపులర్ అయింది.

ఎన్నికల కోసం ప్రచారం చేసుకునే కాలాన్ని పెంచాలని కూడా ప్రదర్శకులు కోరుతున్నారు. ఎన్నికలను పరిశీలించడానికి అంతర్జాతీయ పరిశీలకులను అనుమతించాలని కోరుతున్నారు. విదేశాల్లో ఉంటున్న మలేసియన్లకు ఓటు హక్కు కల్పించాలనీ, ప్రభుత్వ అదుపులో ఉన్న మీడియా రాజకీయ పార్టీలన్నింటికీ అందుబాటులో ఉండాలనీ డిమాండ్ చేస్తున్నారు. ర్యాలీకి మద్దతుగా ఇతర ఆసియా దేశాలలోనూ, ఆస్ట్రేలియా, యూరప్, అమెరికా లలోనూ ప్రదర్శనలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

2 thoughts on “రాజకీయ సంస్కరణల కోసం లక్ష మంది మలేసియన్ల ప్రదర్శన

వ్యాఖ్యానించండి