టెర్రరిస్టులకు ఐక్యరాజ్యసమితి మద్దతు? -సిరియా ప్రభుత్వం


Syria infiltrationఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ‘బాన్-కి-మూన్’ సిరియాలో విధ్వంసం సృష్టిస్తున్న టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చేలా ప్రకటనలు జారీ చేయడం పట్ల సిరియా పత్రికలు ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నాయని ‘అసోసియేటెడ్ ప్రెస్’ ని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. సమితి అధిపతి తన విమర్శలను పూర్తిగా సిరియా ప్రభుత్వంపైనే కేంద్రీకరించడం ద్వారా టెరరిస్టుల హింసను ప్రోత్సహిస్తున్నాడని సిరియా పత్రికలు విమర్శలు ఎక్కుపెట్టాయి.

మానవ బాంబులను ప్రయోగిస్తూ వేలమంది ప్రజలను బలి గొంటున్న టెర్రరిస్టు చర్యలను ఖండిస్తూ అంతర్జాతీయ సంస్ధలు గానీ, అమెరికా, యూరప్ లు గానీ ఇంతవరకూ ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు. టెర్రరిస్టులు దాగి ఉన్న పట్టణాలలో “దుష్ట త్రయం” (అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్) రహస్యంగా పంపిన కిరాయి సైనికులు సిరియాలో పెద్ద ఎత్తున విధ్వంస్వాలకు పాల్పడుతున్నారు. పేలుళ్లలో ప్రతి రోజూ పదుల సంఖ్యలో పౌరులు, భద్రతా బలగాలూ చనిపోతున్నారు.

చనిపోతున్నవారీనందరినీ (ప్రభుత్వ సైనికులు, టెర్రరిస్టు దాడుల్లో చనిపోయిన పౌరులు) ప్రభుత్వ బలగాలే చంపుతున్నట్లుగా పశ్చిమ దేశాల పత్రికలు దుర్మార్గపూరితంగా దుష్ప్రచారం సాగిస్తున్నాయి. దుష్ప్రచారం ఆధారంగా సమితి అధిపతి సైతం సిరియా బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని చెబుతూ సిరియా ప్రజలను టెర్రరిస్టులకు ఆహారంగా వదిలి పెట్టాలని పరోక్షంగా సందేశం ఇస్తున్నాడు.

టెర్రరిస్టులకు దుష్ట్ర త్రయ దేశాలు అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేస్తున్నప్పటికీ అదేమీ తెలియనట్లు బాన్-కి-మూన్ నటిస్తున్నాడు. పశ్చిమ దేశాలకు సేవ చేయడమే పరమావధిగా ఎంచుకున్న సమితి అధిపతి సిరియాలో దుష్ట త్రయం ఎత్తుగడలను అమలు చేయడానికే నడుం కట్టాడు. లిబియా లాగా సిరియా కూడా అధ్యక్షుడిని పోగొట్టుకుని పశ్చిమ దేశాల ప్రయోజనాలకు ‘జో హుకుం’ అనే కీలు బొమ్మని ప్రతిష్టించడానికి క్రియా శీలక కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడు.

ఇదిలా ఉండగా సిరియా రాజధాని డమాస్కస్ లో శనివారం  టెర్రరిస్టులు జరిపిన ఆత్మాహుతి దాడిలో పది మంది మరణించారు. సిరియాలో శాంతి ఒప్పందం అమలు పర్యవేక్షించడానికి సమితి ప్రతినిధులు 300 మంది సిరియా వెళ్లవలసి ఉండగా ఇప్పటికీ 20 మంది మాత్రమే వెళ్లగలిగారు. సిరియాలో టెర్రరిస్టు పేలుళ్ళు పెరిగిపోవడం వల్ల పేలుళ్లలో చిక్కుకుంటామేమోనన్న భయంతో శాంతి పరిశీలకులు అక్కడికి వెళ్లలేకపోతున్నారు. వీళ్ళు వెళ్లలేకపోయినా ప్రభుత్వ బలగాలు మాత్రం ప్రజలను టెర్రరిస్టుల దయా దాక్షిణ్యాలకు వదిలిపెట్టాలని చెబుతున్నారు.

సిరియాలో దుష్ట్ర త్రయం ప్రవేశ పెట్టిన కిరాయి తిరుగుబాటు సైనికులు శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ దాన్ని ఉల్లంఘిస్తూ ప్రజల నివాసాలపైనా, ప్రభుత్వ బలగాలపైనా హంతక దాడులకు పాల్పడుతున్నారు. సమితి అధిపతి బాధంతా పశ్చిమ దేశాల కిరాయి సైనికుల టెర్రరిస్టు దాడులను సిరియా ప్రభుత్వం సమర్ధవంతంగా తిప్పి కొడుతున్నందువల్లనే అన్నట్లుగా కనిపిస్తోంది. టెర్రరిస్టు దాడులకి వ్యతిరేకంగా, సిరియా అధ్యక్షుడికి మద్దతుగా సిరియా ప్రజలు చేస్తున్న ప్రదర్శనలను సమితి ఏ మాత్రం పరిగణించడం లేదు. అమెరికా, యూరప్ ల కంపెనీల ప్రయోజనాలే సమితికి ప్రధానంగా కనిపిస్తోంది.

సమితి మాజీ అధిపతి కోఫీ అన్నన్ మధ్యవర్తిత్వంలో కొద్ది రోజుల క్రితం ఒక శాంతి ఒప్పందం కుదిరింది. శాంతి ఒప్పందం కుదిరిందన్న మాటే గానీ దానిని చెడగొట్టడానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు సర్వ ప్రయత్నాలూ చేశాయి. ఒప్పందం అమలు మొదలు కాకముందే సిరియా ప్రభుత్వం ఉల్లంఘించిందని కాకి గోల మొదలు పెట్టాయి. ప్రపంచ వ్యాపితంగా విస్తరించిన తమ కార్పొరేట్ పత్రికల ద్వారా అబద్ధాల పర్వం కొనసాగించాయి. నిజానికి సిరియాలో శాంతి స్ధాపన దుష్ట త్రయానికి అస్సలు ఇష్టం లేదు. సిరియాలో శాంతి నెలకొనడం అంటే సిరియాలో తమ కీలు బొమ్మని నిలపాలన్న వాటి లక్ష్యానికి నీళ్ళు వదులుకున్నట్లే. మధ్య ప్రాచ్యంలో పశ్చిమ దేశాల కంపెనీల ప్రయోజనాలకు ఆటంకంగా ఉన్న సిరియా పాలకుడిని చంపాలన్న వారి హంతక కుట్రలకు ఓటమి ఎదురయినట్లే.

వరుసగా తలెత్తుతున్న ఆర్ధిక సంక్షోభాల నుండీ, ఋణ సంక్షోభాల నుండీ బయటపడడానికి ప్రపంచం మొత్తాన్ని తమ మార్కెట్ గా మార్చుకోవడానికి అమెరికా, యూరప్ ల ప్రభుత్వాలు, వారి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. తమ మార్కెట్ ఆధిపత్యానికి లొంగ కుండా ఉన్న లిబియా పాలకుడు గడ్డాఫీని కిరాయి సైనికులతో బూటకపు తిరుగుబాటు సృష్టించి గడ్డాఫీని హత్య చేశాయి. అమెరికా విమానాలు గురిచూసి వేసిన బాంబుదాడుల్లో గడ్డాఫీ హత్యకు గురయ్యాడు. గడ్దాఫీ చనిపోయాక లిబియా కుక్కలు చింపిన విస్తరిగా మారింది. అమెరికా ప్రపంచ వ్యాపిత యుద్ధం ప్రకటించిన ఆల్-ఖైదా తోనే కలిసి లిబియా లో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని పెట్టినా అడిగినవాడు లేడు. లిబియా ప్రజలకి చెందాల్సిన ఆయిల్ వనరులను అప్పనంగా అమెరికా, యూరప్ లు దోచేస్తున్నా ఐక్యరాజ్య సమితికి పట్టదు.

మధ్య ప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ ల రాజకీయ, ఆర్ధిక ఆధిపత్యానికి ఆటంకంగా ఉన్నవారిలో సిరియా కూడా ఒకటి. ఆ ప్రాంతంలో ఇరాక్, సిరియా, లిబియాలు మాత్రమే ముస్లిం మతోన్మాదాన్ని సమర్ధవంతంగా అణచివేసి సెక్యులర్ రాజ్యాలను స్ధాపించుకున్నాయి. అరబ్ సెక్యులర్ ప్రజా ఉద్యమ పార్టీ అయిన బాత్ పార్టీ నాయకుడు, ఇరాక్ ప్రజల జీవన ప్రమాణాలను అత్యున్నత స్ధాయిలో నిలిపిన సద్ధామ్ హుస్సేన్ ని పశ్చిమ రాజ్యాలు కుట్ర చేసి చంపివేశాయి. సద్ధామ్, గడ్డాఫీ ల తర్వాత ఈ ప్రాంతంలో మిగిలిని ఉన్న సెక్యులర్ రాజ్యం సిరియా ఒక్కటే. ఆ దేశంలో కూడా ముస్లిం మతోన్మాదులని పీఠం ఎక్కించి మధ్య ప్రాచ్యంలోని అరబ్ దేశాలన్నింటినీ తమ పాదాక్రాంతం చేసుకోవాలని అమెరికా, యూరప్ లు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగమే సిరియా లో కిరాయి మూకల టెర్రరిస్టు చర్యలు. వాటికి ఐక్యరాజ్య సమితి అధిపతి బాన్ కి మూన్ బహిరంగంగా మద్దతు తెలపడం ప్రపంచ ప్రజల దౌర్భాగ్యం తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా సిరియా ప్రజల ప్రయోజనాలకి సమితి అధ్యక్షుడి ప్రకటనలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా సాయుధ కిరాయి బలగాలు సిరియాలో చొరబడడానికి చేసిన ప్రయత్నాలను సిరియా భద్రతా బలగాలు తిప్పి కొట్టాయని ఏ.పి తెలిపింది. మధ్యధరా సముద్రం ద్వారా సాయుధ గ్రూపులు సిరియాలోకి చొరబడడానికి ప్రయత్నించాయనీ, ఆ ప్రయత్నాన్ని సిరియా బలగాలు నివారించాయనీ సిరియా వార్తా సంస్ధ ‘సనా’ ను ఉటంకిస్తూ ఏ.పి తెలిపింది. సముద్రం ద్వారా కిరాయి బలగాలు, టెర్రరిస్టులు చొరబడడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. సిరియా నేవీ వెంటపడడంతో కిరాయి బలగాలు వస్తున్న పడవలు పారిపోయాయని, ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో సిరియా సైనికుడొకరు చనిపోయాడని పత్రికలు తెలిపాయి.

పొరుగున ఉన్న లెబనాన్, టర్కీ సరిహద్దుల ద్వారా అనేకసార్లు కిరాయి బలగాలను ప్రవేశపెట్టారు. జనవరిలో 100 మంది ఫ్రెంచి బలగాలను సిరియా అరెస్టు చేసిందని కూడా వార్తలు వచ్చాయి. టర్కీ ప్రభుత్వం కూడా కిరాయి బలగాలకు తమ భూభాగంపై శిక్షణ ఇస్తున్నదని అనేక వార్తా సంస్ధలు వెల్లడించాయి. సముద్ర మార్గంలో చొరబడడం ఇదే మొదటిదారి.

లెబనాన్ పోర్టు ద్వారా ఆయుధాలు సిర్యాలో చొప్పించడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నామని లెబనాన్ మిలట్రీ చెప్పినట్లు ఏ.పి తెలిపింది. ఈ ఆయుధాలు సిరియా కిరాయి తిరుగుబాటుదారులకేనని లెబనాన్ అనుమానిస్తోంది. శుక్రవారం కూడా నౌక ద్వారా సరఫరా అవుతున్న ఆయుధాలను లేబనాన్ అధికారులు సీజ్ చేశారు. లిబియా నుండి ఈజిప్టు మీదుగా సిరియాకి ఈ ఆయుధాలు సరఫరా చేయడానికి ఉద్దేశించారని లెబనాన్ పత్రికలు తెలిపాయి.

వ్యాఖ్యానించండి