మాంద్యం (recession) లో స్పెయిన్


spain.unemploymentడబుల్ డీప్ రిసెషన్ జాబితాలో స్పెయిన్ కూడా చేరింది. 2012 మొదటి క్వార్టర్ లో స్పెయిన్ జి.డి.పి క్షీణించింది. 2011 చివరి క్వార్టర్ లో కూడా స్పెయిన్ జి.డి.పి తగ్గుదల నమోదు చేయడంతో స్పెయిన్ కూడా మాంద్యం లో ఉన్నట్లయింది. రెండు క్వార్టర్లు వరుసగా ప్రతికూల వృద్ధి నమోదు చేసినట్లయితే అలాంటి ఆర్ధిక వ్యవస్ధ గల దేశం మాంద్యం ఎదుర్కొంటున్నట్లుగా పరిగణిస్తారు.

2008 నాటి సుదీర్ఘ మాంద్యం నుండి కోలుకోక మునుపే రెండవ సారి రిసెషన్ లోకి వెళ్లడంతో స్పెయిన్ కూడా ‘డబుల్ డీప్ రిసెషన్’ దేశాల జాబితాలో చేరింది. ఇంగ్లాండు కూడా మాంద్యం ఎదుర్కొంటున్నట్లు ఆ దేశ జి.డి.పి గణాంకాల ద్వారా వెల్లడయింది.

ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో స్పెయిన్ జి.డి.పి 0.4 శాతం క్షీణించింది. అంతకు ముందరి క్వార్టర్ (2011 Q4) లో స్పెయిన్ జి.డి.పి 0.3 శాతం క్షీణించింది. ఋణ సంక్షోభం వల్ల ఇప్పటికే అత్యధిక వడ్డీ రేట్లు పలుకుతున్న స్పెయిన్ ఋణ బాండ్లు మాంద్యం ధృవ పడడంతో మరింత వడ్డీ పలుకుతున్నాయి.

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధపై నమ్మకం కోల్పోయే కొద్ది ఆ దేశ ఋణ బాండ్ల కొనుగోలుదార్లు అధిక వడ్డీని డిమాండు చేస్తారు. దానివల్ల సెకండరీ మార్కెట్ లో బాండ్లకు అధిక వడ్డీ పలుకుతుంది. అప్పటికే వేలం వేసిన బాండ్లపై ప్రభుత్వం అధిక వడ్డీ చెల్లించనవసరం లేనప్పటికీ భయవిష్యత్తులో మరింత అప్పు కోసం ప్రయత్నించినపుడు వడ్డీ పెరిగిపోతుంది. అప్పు ప్రియం అవుతుంది.

ఋణ సంక్షోబాన్ని తెచ్చింది పెట్టుబడిదారీ కంపెనీలే అయినప్పటికీ దాని భారం మాత్రం కార్మికులు ఉద్యోగులపైనే ప్రభుత్వాలు మోపుతున్నాయి. పొదుపు విధానాలలో భాగంగా స్పెయిన్ 11 బిలియన్ డాలర్లు ఖర్చు తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది. దానార్ధం ప్రజలకు చేలించవలసిన మొత్తంలో కోత విధిస్తున్నట్లు చెప్పడమే. యూరో జోన్ లో స్పెయిన్ నాలుగవ పెద్ద ఆర్ధిక వ్యవస్ధ. గ్రీసు, ఐర్లాండు, పోర్చుగల్ దేశాలవలే ఇ.యు, ఐ.ఏం.ఎఫ్ ల నుండి ఋణ బెయిలౌట్ పొందాలన్నా భారీ మొత్తంలో ఆ దేశం పొందవలసి ఉంటుంది.

పొదుపు విధానాలలో భాగంగా స్పెయిన్ ప్రభుత్వం అనేక ఉద్యోగాలను రద్దు చేసింది. వేతనాలు భారీగా తగ్గించింది. ప్రభుత్వ కంపెనీలు మూసివేసింది. స్కూల్, కాలేజీ ఫీజులు పెంచివేసింది. మార్చిలో స్పెయిన్ నిరుద్యోగం 24.4 శాతం కి చేరుకుంది. ఇవన్నీ చేస్తూ కూడా బడా ద్రవ్య, మాన్యుఫాక్చరింగ్ కంపెనీల సి.ఇ.ఓ ల వేతనాలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. మిలియన్ల డాలర్ల కొద్దీ బోనస్ లు కొనసాగుతున్నాయి. యాజమాన్య వర్గాల విలాస జీవనం కొనసాగుతోంది. ప్రజలు మాత్రం దరిద్రులుగా, నిరుద్యోగులుగా, బికారులుగా మారిపోతున్నారు.

వ్యాఖ్యానించండి