ఛత్తీస్ ఘడ్ కలెక్టర్ విడుదలకు ప్రభుత్వము, మావోయిస్టుల ఒప్పందం


Maoists_kidnapమావోయిస్టు గెరిల్లాల చేత కిడ్నాప్ కి గురయిన ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర జిల్లా కలెక్టర్ అలెక్స్ మీనన్ విడుదలకోసం మావోయిస్టు ప్రతినిధులకూ, ప్రభుత్వ ప్రతినిధులకు ఒప్పందం కుదిరినట్లు ‘ది హిందూ’ తెలిపింది. అయితే ఒప్పందానికి మావోయిస్టు పార్టీ ఆమోద ముద్ర వేయాల్సి ఉండని తెలుస్తోంది. శనివారం ఒప్పందాన్ని మావోయిస్టులకు సమర్పించనున్నారు. “ఇప్పటికీ చర్చలు పూర్తయ్యాయి. కానీ అంతిమ ఒప్పందాన్ని మావోయిస్టులు ఆమోదించాల్సి ఉంది” అని మావోయిస్టుల తరపున చర్చల్లో పాల్గొంటున్న బి.డి.శర్మ తెలిపాడు. ఒప్పందం వివరాలు తెలపడానికి బి.డి.శర్మ నిరాకరించాడని ‘ది హిందూ’ తెలిపింది.

బి.డి.శర్మ, ప్రొఫెసర్ హర గోపాల్ లు మావోయిస్టు గెరిల్లాల తరుపున చర్చల్లో పాల్గొంటున్నారు. సుక్మా జిల్లా లోని లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్ళి మావోయిస్టు పార్టీ నాయకులతో ఒప్పందం గురించి చర్చిస్తారని తెలుస్తోంది. సుక్మా జిల్లా కలెక్టర్ అలెక్స్ పి. మీనన్ ను మావోయిస్టులు ఏప్రిల్ 21 తేదీన కిడ్నాప్ చేశారు. లోతట్టు గ్రామీణ ప్రాంతంలో రైతులతో సమావేశమై మాట్లాడుతుండగా ఆయన కిడ్నాప్ కి గురయ్యాడు. ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ గార్డులు మావోయిస్టులపై కాల్పులు జరపడంతో వారు గార్డులిద్దరినీ చంపేశారు. ఒక మావోయిస్టు కూడా పోలీసు కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది.

మావోయిస్టులు తమ తరపున మధ్యవర్తులుగా బి.డి.శర్మతో పాటు సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ నూ, ఒక సి.పి.ఐ పార్టీ నాయకుడినీ ఎంచుకున్నప్పటికీ వారిద్దరూ అందుకు నిరాకరించారు. మావోయిస్టుల డిమాండ్లలో కొన్నింటికి తమ మద్దతు ఉండని చెబుతూనే వాటి కోసం అమాయకుడయిన జిల్లా కలెక్టర్ ను కిడ్నాప్ చేయడాన్ని వారు వ్యతిరేకించారు. కలెక్టర్ జీవితాన్ని ‘బార్గెయినింగ్ చిప్’ గా ఎంచుకోవడాన్ని అంగీకరించలేనని బూషణ్ చెప్పినట్లుగా ‘ది హిందూ’ తెలిపింది.

ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పారా మిలట్రీ  ఆపరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. జైలులో ఉన్న 8 మంది మావోయిస్టు నాయకులను విడుదల చేయాలనీ, జైలో ఉంచిన అమాయక గిరిజనులను విడుదల చేయాలని కూడా మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మావోయిస్టు పార్టీతో సంబంధం లేని గిరిజనులపై తప్పుడు కేసులు మోపి జైలులో పెట్టారని మావోయిస్టులు ఆరోపించారు.

మావోయిస్టులు విడుదల చేయాలని కోరుతున్న వారిలో ప్రముఖ వ్యక్తి కర్తామ్ జోగా అని ది హిందూ తెలిపింది. సల్వా జుడుమ్ పేరుతో రాష్ట్ర పోలీసులు, అధికారులు మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారని జోగా సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయగా కోర్టు సల్వా జుడుమ్ ను రద్దు చేయాలని తీర్పు చెప్పింది. దానితో జోగాను మావోయిస్టులకు మద్దతు ఇచ్చాడని వేరే కేసు మోపి ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం సెప్టెంబరు 2010 లో అరెస్టు చేసింది. కొన్ని గంటల వ్యవధిలో 76 మంది సి.ఆర్.పి.ఎఫ్ బలగాలను మావోయిస్టులు చంపిన కేసులో పాల్గొన్నాడని జోగా పై కేసు పెట్టింది. అయితే జోగా కేసు ఫైలులో పేర్కొన్న పది మంది సాక్షుల్లో కనీసం ఇద్దరు తామసలు సాక్షులే కాదనీ పోలీసులు తమతో సంబంధం లేకుండానే సాక్ష్యాలు సృష్టించారనీ ఆరోపించినట్లుగా తమ పరిశోధనలో తేలిందని ‘ది హిందూ’ తెలిపింది.

తప్పుడు కేసులు మోపి అరెస్టు చేసిన వందల మంది గిరిజనులను విడుదల చేయాలని మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ‘సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్’ సంస్ధ ఇటీవల తయారు చేసిన నివేదిక 648 మంది కోసం నిర్మించిన జగ్దల్ పూర్ సెంట్రల్ జైలులో 1758 ని కుక్కారనీ వారిలో 13 మంది పిల్లలున్నారని తెలియజేసింది. 1178 అండర్ ట్రయల్ ఖైదీల్లో 605 పెద్దలు, 7 గురు పిల్లలపైన ఛత్తీస్ ఘడ్ స్పెషల్ పబ్లిక్ సెక్యూటిటీ యాక్ట్ (2005) కింద కేసులు పెట్టారని నివేదిక తెలిపింది. మావోయిస్టులకు సహాయం చేస్తున్నట్లు అనుమానం వచ్చినవారిపై నిర్భంధం మోపడానికి ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది.

“మేము కలెక్టర్ ను ఎందుకు కిడ్నాప్ చేశాము?” అన్న పేరుతో మావోయిస్టులు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణ బస్టర్ ప్రాంతీయ కమిటీ సభ్యుడు గణేష్ యీకే ఇందులో కొందరు ప్రముఖ మేధావులు, కొన్ని మీడియా సెక్షన్లు కలెక్టర్ ను మానవతా దృక్పధంతో బేషరుతుగా విడుదల చేయాలని తమపై ఒత్తిడి తెచ్చారని పేర్కొంటూ వాటికి తమ సమాధానం ఇచ్చాడు. కలెక్టర్ ఆస్తమా రోగి అనీ, చారిత్రకంగా అణచివేతకు గురయిన దళిత కులాలకు చెందినవాడని, జిల్లాలో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ పేరు పొందాడనీ చెప్పారనీ వారు ప్రస్తావించారు. మీనన్ రాష్ట్రంలో, సుక్మా జిల్లాలో సీనియర్ అధికారి అని యీకే గుర్తు చేశాడు. జిల్లా పోలీసులు వరుసగా అనేక బూటకపు ఎన్ కౌంటర్లకు, కస్టడీ మరణాలకూ పాల్పడ్డారనీ గుర్తు చేశాడు. తార్మెట్ల, మోర్పల్లి, తిమాపురం గ్రామంలో పోలీసులు 300 గిరిజనుల ఇళ్ళు తగలబెట్టారనీ గుర్తు చేశాడు. “ఈ అమానవీయ, రాజ్యాంగ వ్యతిరేక చర్యలను కలెక్టర్ మీనా ఎందుకు ఆపలేకపోయాడు?” అని యీకే తన ప్రకటనలో ప్రశ్నించాడు.

“దరిద్రం నేపధ్యగా ఉండి, దళితుడూ యువకుడూ ఐన ఈ కలెక్టర్ ఎవరి తరపున పని చేస్తున్నాడు?” అని యీకే ప్రశ్నించాడు. ఒక బహుళజాతి సంస్ధ ఛత్తీస్ ఘడ్ లోని ఖనిజ వనరులను కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తుండగా అటువంటి ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్న పాలనా యంత్రాంగాన్ని కలెక్టర్ నడుపుతున్నాడని యీకే ఎత్తి చూపాడు. ఈ ఆరోపణలను రాష్ట్ర పాలనా యంత్రాంగం తిరస్కరించినప్పటికీ వాస్తవం అందుకు భిన్నంగా ఉంది. ఛత్తీస్ ఘడ్ లోని బాక్సైట్ గనులను జిందాల్ కంపెనీకి అప్పజెప్పడం కోసం అడవిలో నివశిస్తున్న గిరిజనులను అడవినుండి వెళ్లగొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ఎత్తుగడులు అమలు చేసినట్లు పత్రికలు అనేకసార్లు కధనాలు రాశాయి. సల్వా జుడుమ్ పేరుతో గిరిజన గ్రామాలపై హంతక దాడులు చేసి గిరిజనులు తమ గ్రామాలు విడిచి పునరావాస శిబిరాలకు తరలి వెళ్ళేలా పధకాలు అమలు చేసిందని పత్రికలు వెల్లడించాయి.

సల్వా జుడుమ్ హంతక చర్యలతో సుప్రీం కోర్టు హతాశురాలై సల్వా జుడుమ్  రాజ్యాంగ విరుద్ధమనీ, వెంటనే రద్దు చేయాలని ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. సదరు ఆదేశాలు రద్దు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ సుప్రీం కోర్టు ససేమిరా అనడం బట్టి సల్వా జూడుం హంతక స్వభావం ఎలాంటిదో ఎన్ని అరాచకాలకు పాల్పడిందో అర్ధం చేసుకోవచ్చు. మావోయిస్టులకి వ్యతిరేకంగా పోరాడడానికి గిరిజనులకి నిర్ణయించిన అర్హతా ప్రమాణాలు విద్యా ప్రమాణాలతో సహా రాజ్యాంగానికి వ్యతిరేకం అని, గిరిజనులకు మావోయిస్టు వ్యతిరేక శిక్షణ ఇవ్వడం అన్నీ రాజ్యాంగ వ్యతిరేకం అనీ సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది. “మీరు ఎస్.పి.ఓ (స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు) లతో ఆడుకుంటున్నారు. వారు రాజ్యానికి వ్యతిరేకంగా మారితే ఏం జరుగుతుందో తెలుసా? ఈ దేశాన్ని దేవుడే రక్షించాలి” అని సుప్రీం బెంచి వ్యాఖ్యానించింది.

వ్యాఖ్యానించండి