క్లుప్తంగా… 27.04.2012


ఇరాన్ అణు బాంబు కి సాక్ష్యం లేదు –పెనెట్టా

Leon Panettaఇరాన్ ‘అణు బాంబు’ నిర్మిస్తోందని ఖచ్చితమైన సాక్ష్యం ఏదీ దొరకలేదని అమెరికా రక్షణ కార్యదర్శి లియోన్ పెనెట్టా అన్నాడని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. “ఇరానియన్లు అణుబాంబు తయారీకి నిర్ణయించినట్లు నిర్ధిష్ట సమాచారం ఏదీ నా వద్ద లేదు” అని పెనెట్టా అన్నాడు. చిలీ రక్షణ మంత్రితో సమావేశం అయిన అనంతరం విలేఖరులతో పెనెట్టా మాట్లాడాడు. ఇరాన్ అణు బాంబుకి ప్రయత్నిస్తున్నదంటూ అమెరికా, యూరప్ లు ఒత్తిడి తెచ్చి ఇరాన్ పై నాలుగు విడతలుగా అంతర్జాతీయ ఆంక్షలు విధింపజేశాయి. తాము స్వయంగా లెక్కలేనన్ని సార్లు ఆంక్షలు విధించాయి. ఇరాన్ ఆయిల్ కొనవద్దని భారత దేశంపై కూడా అమెరికా ఒత్తిడి చేస్తోంది. పాకిస్ధాన్ మీదుగా ఇరాన్ నుండి గ్యాస్ పైప్ లైన్ నిర్మాణానికి ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ అమెరికా ఒత్తిడితో దానిని మూలన పెట్టింది. సాక్ష్యాలేవీ లేకుండా ఇరాన్ పై ఆంక్షలు ఎందుకు విధించినట్లు? ఇరాన్ ప్రజలతో పాటు ఇండియా లాంటి దేశాల ప్రజలను సైతం ఎందుకు బలి చేసినట్లు?

2012 Q1 లో తగ్గిన అమెరికా ఆర్ధిక వృద్ధి

మొదటి క్వార్టర్ లో అమెరికా జి.డి.పి వృద్ధి తగ్గిపోయిందని అమెరికా ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ బి.బి.సి తెలిపింది. 2011 చివరిFed reserve క్వార్టర్ లో 0.75 % వృద్ధి ని నమోదు చేసిన అమెరికా ఆర్ధిక వ్యవస్ధ 2012 Q1 లో 0.55 % వృద్ధి మాత్రమే నమోదు చేసింది. ఆర్ధికవేత్తలు అంచనా వేసిన (0.625%) దాని కన్నా ఇది తక్కువని బి.బి.సి తెలిపింది. వినియోగదారులు కొనుగోళ్ళు పెంచినా, వ్యాపారవేత్తలు పెట్టుబడులు బాగా తగ్గించడంతో వృద్ధి శాతం తక్కువగా నమోదయిందని అమెరికా వాణిజ్య విభాగం తెలిపింది. కార్ల కొనుగోలు పెరగడం వల్ల ఈ మాత్రం వృద్ధి నమోదయినట్లు తెలుస్తోంది. అమెరికా జి.డి.పి లో 70 శాతం వినియోగదారుల కొనుగోళ్ల నుండే వస్తుందని ఆ భాగం ఫర్వాలేదనిపించిందని బి.బి.సి తెలిపింది. 2009 చివరి క్వార్టర్ తర్వాత వ్యాపార పెట్టుబడులు ఈ స్ధాయికి పడిపోవడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం లేనప్పుడు వ్యాపారులు తమ పెట్టుబడులను బైటికి తీయడం తగ్గుతుంది.

QE3 (Qunantitative Easing) పేరుతో మరొకసారి అమెరికా ఫెడరల్ రిజర్వ్ కంపెనీలకు బెయిలౌట్ బొనాంజా మజూరు చేయవచ్చని కొద్ది కాలంగా అంచనాలు ఊపందుకుంటున్నాయి. కంపెనీలకు, వ్యాపారులకు మరింత డబ్బు అందుబాటులోకి ఉంచడానికి ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికీ రెండు సార్లు QE విడుదల చేసింది. ఉత్పత్తితో సంబంధం లేకుండా డాలర్లు ముద్రించి మార్కెట్ లోకి పంప్ చేయడం ద్వారా కంపెనీలకి డబ్బు అందుబాటులోకి తెస్తే పెట్టుబడులు పెరిగి ఆర్ధిక వ్యవస్ధ పుంజుకుంటుందన్నది ఫెడరల్ రిజర్వ్ అంచనా. అయితే దాని వల్ల ప్రపంచ వ్యాపితంగా డబ్బు సరఫరా పెరిగి ఇతర దేశాల్లో ద్రవ్యోల్బణం అదుపు తప్పడం ఇప్పటివరకూ ఉన్న అనుభవం. అందువల్లనే QE2 ప్రకటించినప్పుడు యూరప్, చైనా లు అమెరికాను తీవ్రంగా విమర్శించాయి. భారత దేశంలో సైతం దానివల్ల ద్రవ్యోల్బణం పెరిగి ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

బెంగాల్ టీచర్లకు ఫత్వా జారీ చేసిన తృణమూల్ విద్యార్ధి నాయకుడు

పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ పార్టీ అరాచకాలకు అంతులేకుండా పోతోంది. సి.పి.ఎం పార్టీకి టీచర్లేవరూ మద్దతు ఇవ్వడానికి వీల్లేదంటూTrinamool fatwa తృణమూల్ పార్టీ విద్యార్ధి సంఘం నాయకుడు ఫత్వా లాంటిది జారీ చేశాడు. బెంగాల్ టీచర్ల సంఘం “వెస్ట్ బెంగాల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్” కి ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో తృణమూల్ నాయకుడి హెచ్చరిక జారీ అయినట్లు తెలుస్తోంది. “మీరు టీచర్లు కానీ సి.పి.ఎం రాజకీయాలు చేస్తారు. మీతో చివరి వరకూ పోరాడుతాం. ఒక్క అంగుళం కూడా మీకు వదలం” అని శంకు పండా హెచ్చరించాడని ఎన్.డి.టి.వి తెలిపింది. పండా ప్రకటనని బెంగాల్ పౌర ప్రముఖులంతా తీవ్రంగా ఖండించారని ఎన్.డి.టి.వి తెలిపింది. తృణమూల్ పార్టీ నాయకుడు అరబుల్ ఇస్లాం ఇటీవల ఒక కాలేజీ టీచర్ పై నీళ్ళ జగ్గు విసిరి గాయపరిచిన ఘటన మర్చిపోకముందే తాజా ఘటన చోటు చేసుకుంది. ప్రతి కాలేజీ నుండీ ఎన్నుకోబడే టీచర్ల ప్రతినిధులు అసోసియేషన్ కి పోటీ చేస్తున్నవారిని ఎన్నుకుంటారనీ, సి.పి.ఎం మద్దతుదారులను ఎన్నుకోకుండా ఉండడానికే తృణమూల్ విద్యార్ధి నాయకుడు బెదిరింపులకి దిగాడనీ తెలుస్తోంది.

వ్యాఖ్యానించండి