కేంద్ర ప్రభుత్వంలో అధికారం నెరుపుతున్న కాంగ్రెస్ పార్టీ ‘సచిన్ టెండూల్కర్’ ను రాజ్య సభ సభ్యత్వానికి ప్రతిపాదించిందని ‘ఐ.బి.ఎన్ లైవ్’ పత్రిక తెలిపింది. సచిన్ ఇంకా ఏ సంగతీ చెప్పలేదని తెలుస్తోంది. సచిన్ నుండి స్పందన కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్య సభ సభ్యత్వం స్వీకరించడానికి సచిన్ అంగీకరించకపోవచ్చని కూడా పత్రికలు రాస్తున్నాయి. సంచిన్ వైపు నుండి అధికారికంగా ఏ సమాచారమూ లేదు.
సచిన్ టెండూల్కర్ ని రాష్ట్ర ప్రతి కోటాలో రాజ్య సభకి నామినేట్ చేసే విషయమై ప్రధాని మన్మోహన్ సింగ్ హోమ్ మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు ‘ఐ.బి.ఎన్ లైవ్’ తెలియజేసింది. సచిన్ టెండూల్కర్ ని కలిసి మాట్లాడాలని సోనియా కోరడంతో ఆయన తన భార్య అంజలి తో కలిసి సోనియా గాంధీని కలిశాడని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. సమావేశంలో సచిన్ దంపతులతో పాటు ఐ.పి.ఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా ఉన్నాడని ఆ పత్రిక తెలిపింది. సచిన్, అంజలి దంపతులు అరగంటపాటు సోనియా నివాసంలో గడిపినట్లు తెలుస్తోంది.
సచిన్ అంతర్జాతీయ క్రికెట్ లో టెస్టులు, వన్ డే లల్లో మొత్తం వంద సెంచరీలు పూర్తి చేసిన సందర్భంగా అభినందనలు తెలపడానికే సోనియా ఆయనని కలవాలని భావించిందని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చెబుతోంది. అయితే సమావేశం అసలు ఎజెండా ‘రాజ్య సభ సభ్యత్వానికి సచిన్ ని ప్రతిపాదించడమే’ అని ఐ.బి.ఎన్ లైవ్ తెలిపింది.
కాంగ్రెస్ ఆఫర్ ని అంగీకరిస్తే సచిన్ క్రీడా జీవితానికి ఏదో ఒక రూపంలో మచ్చ వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శల జడిలో ఇరుక్కుపోయి మనసు కష్ట పెట్టుకోవాల్సిన పరిస్ధితులు అనివార్యంగా ఎదుకోవలసి వస్తుంది. వీటన్నిటినీ రాజకీయ జీవితంలో భాగంగా ఎంచుతూ తేలికగా పక్కకు నెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లయితే సచిన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టినా పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు.
దేశము, ప్రజలు, దేశాభివృద్ధి మాత్రమే రాజకీయాల లక్ష్యంగా ఉన్నట్లయితే సచిన్ లాంటివారు రాజకీయాల్లోకి వచ్చినా ఇబ్బందులు ఉండకపోవచ్చు. వాస్తవ పరిస్ధితి అందుకు పూర్తిగా భిన్నం కనుక రాజ్య సభ సభ్యత్వాన్ని నిరాకరించడమే మంచిదేమో. ఆఫ్ కోర్స్, అది పూర్తిగా సచిన్ టెండూల్కర్ ఛాయిస్ మాత్రమే.