క్లుప్తంగా… 26.04.2012


అంతర్జాతీయం

హెచ్.ఎస్.బి.సి బ్యాంకు యు.కె శాఖల్లో 2,200 ఉద్యోగాలు రద్దు

HSBCఇంగ్లాండులో హెచ్.ఎస్.బి.సి బ్యాంకు మరో 2,200 ఉద్యోగాలు రద్దు చేసింది. వాస్తవంగా రద్దు చేసినవి 3,100 ఉద్యోగాలు కాగా, కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు పోను నికరంగా 2,217 ఉద్యోగాలు రద్దు చేసినట్లయింది. ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాలు రద్దు చేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. హెచ్.ఎస్.బి.సి గత సంవత్సరం 7,000 ఉద్యోగాలు రద్దు చేసింది. 2013 లోపు ప్రపంచ వ్యాపితంగా 30,000 ఉద్యోగాలు రద్దు చేస్తానని బ్యాంకు గత యేడు ప్రకటించింది. ఉద్యోగాలు రద్దు చేసి $3.5 బిలియన్లు పొదుపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం బ్యాంకు 13.8 బిలియన్ పౌండ్లు ($22.34) లాభం సంపాదించినా $3.5 బిలియన్ల పొదుపు కోసం ఉద్యోగాల రద్దు కొనసాగిస్తోంది. హెచ్.ఎస్.బి.సి బ్యాంకు సి.ఇ.ఓ స్టూవర్ట్ గల్లీవర్ 8 మిలియన్ పౌండ్ల వేతనం ఇంటికి తీసుకెళ్తూ పొదుపు పేరుతో వేలమంది సిబ్బందిని ఇంటికి పంపడం పెట్టుబడిదారుల ‘పొదుపు హిపోక్రసీ’ ని తేటతెల్లం చేస్తోంది. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దరిమిలా బడా కంపెనీల సి.ఇ.ఓలకు చెల్లించే భారీ వేతనాలనూ, బోనస్ లనూ తగ్గించేలా చర్యలు తీసుకుంటామని జి20 వేదికలపై అమెరికా, యూరప్ లు ప్రతిజ్ఞలు చేసినప్పటికీ అవేవీ అమలుకు నోచుకోలేదు.

జాతీయం

మోడీకి వీసా ఇచ్చేది లేదు –అమెరికా

Narendra Modiగుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కి ఇచ్చిన వీసాని రద్దు చేసిన అమెరికా తన విధానంలో మార్పేమీ లేదని ప్రకటించింది. అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి విక్టోరియా నూలంద్ ఈ మేరకు గత రాత్రి ప్రకటించింది. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు జో వాల్ష్ ఇటీవల మోడీకి వీసాను పునరుద్ధరించాలని కోరుతూ లేఖ రాశాడు. ఆయన కోరికను ప్రభుత్వం తిరస్కరించిందని నూలంద్ తెలిపింది. 2005 లో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర పర్యటనకు మోడీ తలపెట్టగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి ఇచ్చిన వీసా రద్దు చేసినట్లు తెలిపింది. ఫ్లోరిడా రాష్ట్ర చట్టాల ప్రకారం “విదేశీ ప్రభుత్వాధికారులు మత స్వేచ్ఛ ఉల్లంఘనకు బాధ్యులయితే వారికి వీసాలు ఇవ్వడానికి వీల్లేదు. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మోడీకి వీసా నిరాకరించడాన్ని నిరసించింది. అయితే కాంగ్రెస్ నిరసనలో బలం లేదనీ, వాస్తవానికి గుజరాత్ మతకల్లోలం దృష్ట్యా బి.జె.పి పార్టీ సైతం మోడీని మెల్లగా పక్కకు తప్పిస్తుందని అప్పటి అమెరికా రాయబారి డేవిడ్ మల్ ఫోర్డ్ అమెరికాకి రాసిన కేబుల్ లో రాసినట్లు వికీలీక్స్ ద్వారా వెల్లడయింది.

సచిన్, రేఖ లకు రాజ్య సభ సీటు ఖరారు?

Anu Agaసచిన్ టెండూల్కర్ తో పాటు సినీ నటి రేఖ, మహిళా వ్యాపారి అను ఆగా, లు రాజ్య సభ్యులుగా నామినేట్ కావడం దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. వీరి ముగ్గురిని రాజ్య సభ సభ్యులుగా రాష్ట్రపతి ఆమోదించినట్లు ఎన్.డి.టి.వి తెలిపింది. ఆమోదించడానికి సదరు వ్యక్తుల అనుమతి తీసుకుంటారు గనక సచిన్ ఆమోదం తోనే ఇది జరిగినట్లు అర్ధం చేసుకోవచ్చు. సచిన్ సభ్యత్వానికి బి.జె.పి నాయకులు అంగీకారం తెలుపుతూ మాట్లాడారు. ఆటతో పాటు సభకు కూడా సమయం వెచ్చించాల్సి ఉంటుందని లెఫ్ట్ పార్టీల నాయకులు వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం రాజ్య సభ 250 మంది సభ్యులతో ఉంటుంది. అందులో 12 మందిని రాష్ట్రపతి నానినేట్ చేస్తారు. సాహిత్యం, కళలు, సామాజిక సేవ లాంటి రంగాలలో నిష్ణాతులైనవారిని రాష్ట్రపతి నామినేట్ చేయవలసి ఉంటుంది.

8 thoughts on “క్లుప్తంగా… 26.04.2012

  1. కొత్త ఉద్యోగాలు ఇవ్వడంలో ఒక ట్విస్టు ఉంటుంది. ఉన్న సీనియర్ ఉద్యోగులని తొలగిస్తే అధికవేతనాల బాధ తప్పుతుంది. కొత్త ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగ సైన్యం నుండి తక్కువ వేతనాలకి రేడీగా ఉంటారు. వేతనాల భారం తగ్గించుకోవడానికి కంపెనీలు వేసే ఎత్తుగడ ఇది.

    భారత దేశంలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాంట్రాక్టు ఉద్యోగులని తీసుకోవడంతో ఇది సరిపోలుతుంది.

    (మొత్తం రద్దు చేసిన ఉద్యోగాలు 3100 – కొత్త ఉద్యోగాలు 883 = నికరంగా తీసేసినవి 2217)

  2. ‘సూటిగా’ అన్నతర్వాత ‘సుత్తి లేకుండా’ అని వాడటం ఎఫ్ ఎం రేడియోల్లో తరచూగా వాడే పద బంధం లెండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చిన యూత్ ఫుల్ సరదా పదజాలంలో ఇదీ ఒకటి !

వ్యాఖ్యానించండి