‘కోర్టు ధిక్కారం’ కేసులో పాక్ ప్రధాని దోషి, 30 సెకన్లు జైలు


Pak PMపాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ పై ‘కోర్టు ధిక్కారం’ నేరం రుజువయిందని పాకిస్ధాన్ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. నేరం రుజువయినప్పటికీ ‘సంకేతాత్మక’ శిక్షతో ప్రధానిని కోర్టు వదిలిపెట్టింది. ఆయనపై జైలు శిక్ష గానీ, మరొక శిక్షగానీ విధిస్తున్నట్లు కోర్టు ప్రకటించలేదు. గిలానీ ప్రధాని పదవికి వచ్చిన ముప్పేమీ లేదని కూడా తెలుస్తోంది. మాజీ మిలట్రీ పాలకుడు ముషార్రఫ్ పాలనలో అధ్యక్షుడు జర్దారీతో పాటు అనేకమంది రాజకీయ నాయకులపై ఉన్న అవినీతి కేసుల్లో ముషార్రఫ్ క్షమా భిక్ష ప్రసాదించాడు. క్షమా భిక్ష చెల్లదని తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు జర్దారీపై అవినీతి కేసులు తిరిగి తెరవాలని ప్రధాని గిలానీని ఆదేశించినప్పటికీ ఆయన నిరాకరించడంతో ‘కోర్టు ధిక్కారం’ కేసును సుప్రీం కోర్టు నమోదు చేయించింది.

మిలట్రీ పాలకుడు ముషార్రఫ్ కూ పాకిస్ధాన్ రాజకీయ పార్టీలకూ అమెరికా కుదిర్చిన ఒప్పందం (ఒత్తిడి) మేరకు జర్ధారీతో పాటు అనేక రాజకీయ నాయకులపైన ఉన్న అవినీతి కేసుల్లో క్షమాభిక్ష ప్రసాదించారు. ముషార్రఫ్ అధికారం త్యజించి కేసులేవీ లేకుండా గౌరవంగా దేశం నుండి వెళ్లిపోవడానికీ, పాకిస్ధాన్ లో తిరిగి ఎన్నికల నాటకం మొదలవడానికీ అమెరికా ఒత్తిడిమేరకు కుదిరిన ఒప్పందం దోహదపడింది.

అయితే ఎన్నికల ద్వారా అధికారం చేజిక్కించుకున్న పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వానికీ, మిలట్రీ కీ మధ్య అనేక తగువులు తలెత్తాయి. అధికారం పంచుకోవడంలోనూ, అమెరికా అందించే దళారీ సొమ్ముని తమలో తాము భాగాలు చేసుకోవడంలోనూ పౌర ప్రభుత్వ నాయకులకూ, మిలట్రీ నాయకులకీ తలెత్తిన ఘర్షణలు కోర్టు కేసుల ద్వారా కూడా వ్యక్తం అయ్యాయి. రాజకీయ నాయకులను అదుపులో ఉంచే ప్రయత్నాల్లో భాగంగానే మిలట్రీ పనుపున, అధ్యక్షుడు జర్ధారీపై అవినీతి కేసులు దాఖలాయ్యాయని బి.బి.సి లాంటి వార్తా సంస్ధలు విశ్లేషించాయి.

బిన్ లాడెన్ హత్య జరిగాక ‘పాక్ మిలట్రీ పౌర ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు పన్నుతున్నదనీ, అదే జరిగితే అమెరికాయే పాక్ ప్రభుత్వాన్ని ఆదుకోవాలనీ, అందుకు ప్రతిఫలంగా పాక్ మిలిటెంట్లను చంపడానికి పాకిస్ధాన్ లో ఎక్కడంటే అక్కడ బాంబులు వేసుకోవడానికి అనుమతిస్తామనీ జర్దారీ రాసిన లేఖను అమెరికాలోని పాక్ వ్యాపారి ఒకరు వెల్లడించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. లేఖతో తనకు సంబంధం లేదని జర్దారీ ప్రకటించినప్పటికీ అలాంటి లేఖ తనకు అందినమాట వాస్తవమేననీ అప్పటి అమెరికా ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’ మైక్ ముల్లెన్ అంగీకరించాడు. జర్దారీ కేసులు పాక్ ప్రభుత్వం, కోర్టుల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనలో భాగమైనప్పటికీ కేసుల వెనక పాక్ మిలట్రీ హస్తం ఉందని అందరూ భావిస్తున్నారని బి.బి.సి విశ్లేషించింది.

దేశాధ్యక్షుడిగా కొనసాగినంతవరకూ ఆసిఫ్ ఆలీ జర్దారీ కోర్టు కేసులనుండి రక్షణ ఉంటుందని ప్రధాని కోర్టులో వాదించాడు. గిలానీ వాదనను కోర్టు తిరస్కరించింది. “ఉద్దేయపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కోర్టును అగౌరవపరిచి” కోర్టు ధిక్కారానికి గిలానీ పాల్పడ్డాడని సుప్రీం కోర్టు గురువారం తీర్పు చెప్పింది. అధ్యక్షుడు జర్దారీపై గతంలో దాఖలైన కేసులను తిరిగి తెరవాలంటూ స్విస్ ప్రభుత్వానికి లేఖ రాయాలని తాము కోరినప్పటికీ తమ ఆదేశాలని ప్రధాని తిరస్కరించాడని కోర్టు తీర్పులో పేర్కొంది. నేరం రుజువయినందున కోర్టు లేచి నిలబడేంతవరకూ ప్రధాని గిలానీ జైలు శిక్ష అనుభవిస్తాడని తీర్పు చెప్పింది. తీర్పు ముగిసిన వెంటనే జడ్జి లేచి నిలబడడంతో 30 సెకన్లు మాత్రమే గిలానీ జైలు అనుభవించినట్లయింది.

కేసు విచారణ కోసం ప్రధాని గిలానీ మూడుసార్లు కోర్టుకు హాజరయ్యాడు. నామ మాత్ర శిక్ష తమకు విజయమేనని గిలానీ మద్దతుదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో నేరం రుజువయిందని తీర్పు పేర్కొన్నప్పటికీ అదేమీ పట్టించుకునే స్ధితిలో వారు లేరు. అయితే కోర్టు తీర్పు నేపధ్యంలో ప్రధాని పదవికి గిలానీ ఆటోమేటిగ్గా అనర్హుడుగా మారే అవకాశం ఇంకా ఉందని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. తీర్పు పూర్తి పాఠం వెలువడ్డాకగానీ దాని ప్రభావం అర్ధం కాదని అవి వ్యాఖ్యానిస్తున్నాయి. 

వ్యాఖ్యానించండి