విదేశాల్లో తాము సాగించే గూఢచార కార్యకలాపాలకు ‘వాణిజ్య ముసుగు’ కావాలంటూ అమెరికా రక్షణ విభాగం కాంగ్రెస్ అనుమతి కోరింది. విదేశాలలో వాణిజ్యవేత్తల ముసుగులో మిలట్రీ గూఢచర్యానికి పాల్పడడానికి అమెరికాకి చెందిన ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్’ (డి.ఒ.డి) అమెరికా కాంగ్రెస్ ముందు ప్రతిపాదనలు ఉంచిందని ‘ఇన్ సైడ్ డిఫెన్స్’ వెబ్ సైట్ తెలిపింది. అమెరికా సైనికులను నేరుగా రంగంలోకి దించడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందనీ, వాణిజ్య ముసుగులో రహస్య మిలట్రీ కార్యకలాపాల కోసం అనుమతి ఇచ్చినట్లయితే అటువంటి ముప్పును తగ్గించవచ్చనీ డి.ఒ.డి తన ప్రతిపాదనల్లో పేర్కొంది.
వాణిజ్యవేత్తల ముసుగులో గూఢచర్యం నిర్వహించేందుకు తమకు అధికారాలు ఇవ్వాలని పెంటగాన్ (అమెరికా మిలట్రీ హెడ్ క్వార్టర్స్) కోరుతోంది. డి.ఒ.డి కి ఇపుడున్న అధికారాలను మరింతగా విస్తృతపరుచుకోవడానికి పెంటగాన్ ప్రతిపాదనలు ఉద్దేశించాయని ‘ఇన్ సైడ్ డిఫెన్స్’ తెలిపింది. ఇటీవల కాలంలో ఆల్-ఖైదా, దాని అనుబంధ సంస్ధలతో కొనసాగుతున్న ఘర్షణతో పాటు “ఇతర పరిణామాలు రహస్య మిలట్రీ కార్యకలాపాలను చిన్న (స్మాల్ స్కేల్) స్ధాయిలో క్రమం తప్పకుండా నిర్వహించవలసిన అవసరాన్ని ఎత్తి చూపాయి. టెర్రరిస్టులకూ, వారి స్పాన్సర్లకూ వ్యతిరేకంగా యుద్ధరంగాన్ని తయారు చేయడానికి ఈ రహస్య మిలట్రీ గూఢచార కార్యకలాపాలు అవసరం” అని డి.ఒ.డి ప్రతిపాదనలు పేర్కొన్నట్లుగా ‘ఇన్ సైడ్ డిఫెన్స్’ తెలిపింది.
అమెరికా మిలట్రీ నిర్వహించే ‘కోవర్ట్’ ఆపరేషన్లకూ, రహస్య (clandestine) ఆపరేషన్లకూ తేడా ఉంటుందని ‘ఇన్ సైడ్ డిఫెన్స్’ తెలిపింది. కోవర్ట్ ఆపరేషన్లు వాటి వెనుక అమెరికా ఉందన్న నిజాన్ని దాచి పెడితే, రహస్య ఆపరేషన్లు మొత్తం రహస్య మిషన్ నే దాచిపెడతాయని ఆ పత్రిక తెలిపింది. రహస్య మిలట్రీ గూఢచర్యానికి వాణిజ్య ముసుగు తొడిగినట్లయితే రహస్యంగా ఒక మిషన్ నడుస్తుందన్న విషయమే తెలియదన్నమాట. గూఢకార్యం కోసం ఏదో ఒక ఎన్.జి.ఒ (ప్రభుత్వేతర సంస్ధ) ను స్ధాపించినట్లయితే ఆ ఎన్.జి.ఒ, ఎప్పుడన్నా దొరికిపోయినా దాని వెనుక అమెరికా ఉందన్న సంగతి మరుగున ఉంటుంది. అయితే వాణిజ్య ముసుగులో గూఢచర్యం నిర్వహించడానికి డి.ఒ.డి కి అధికారం లేదు. అలాంటివి గతంలో ఉన్నప్పటికీ దానికి ‘డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజన్సీ’ (డి.ఐ.ఏ) అనుమతి అవసరం అయేది. ఇప్పుడు డి.ఐ.ఏ అనుమతి లేకుండానే స్వంతగా తానే అలాంటి కార్యకలాపాలు నిర్వహించడానికి అధికారం ఇవ్వాలని డి.ఒ.డి ప్రతిపాదిస్తోంది.
వాణిజ్య ముసుగుని ఉపయోగించేలా డి.ఒ.డి అధికారాన్ని విస్తృతం చేసినట్లయితే అమెరికా సైనికుల ప్రాణాలు కాపాడినట్లవుతుందని డి.ఒ.డి వాదిస్తోంది. “అలాంటి ఆపరేషన్లను కాపాడుకోవడం కోసం రెవిన్యూని ఉత్పత్తి చేసే వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించడానికి వీలుగా డి.ఒ.డి కి అధికారాలను విస్తృతం చేయాలి. విదేశాలలో ప్రమాదకర ఆపరేషన్లు నిర్వహిస్తున్న అమెరికా భద్రతా బలగాలకు అవి ముఖ్యమయిన రక్షణ కవచంగా ఉపయోగపడతాయి” అని డి.ఒ.డి తన ప్రతిపాదనలో పేర్కొంది.
డి.ఒ.డి తన ప్రతిపాదనలను సమర్ధించుకునే వాదనేదీ కాంగ్రెస్ ముందు చేయలేదని కాంగ్రెస్ వర్గాలను ఉటంకిస్తూ ‘ఇన్ సైడ్ డిఫెన్స్’ తెలిపింది. కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిగే కొద్దీ డి.ఒ.డి కోరుతున్న అధికారాలు ఎలాంటివో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందనీ, అలాగే అలాంటి అధికారాలు మొత్తంగా కొత్త తరహావేమో తెలుసుకుంటుందనీ కాంగ్రెస్ వర్గాలు తెలిపినట్లు ‘ఇన్ సైడ్ డిఫెన్స్’ తెలిపింది. వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ లకు చెందిన ఇంటలిజెన్స్ కమిటీలను లూప్ లో ఉంచాలని డి.ఒ.డి ప్రతిపాదనలు కోరుతున్నాయనీ, ఆ మేరకు ప్రస్తుత చట్టంలో అదనపు పదజాలాన్ని చేర్చాలనీ ఇన్ సైడ్ డిఫెన్స్ తెలిపింది. అయితే సాయుధ దళాల సేవలకు సంబంధించిన హౌస్ మరియు సెనేట్ కమిటీలకు వాణిజ్య కార్యకలాపాల ‘క్లాసిఫైడ్’ వివరాలు తెలియజేస్తామని డి.ఒ.డి చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
కుట్ర కుతంత్రాల పుట్ట సి.ఐ.ఏ అమెరికా మిలట్రీ ఆధీనంలోనే నడుస్తుంది. ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల్లో ప్రజల ఓట్లతో ఎన్నికయిన ప్రభుత్వాలను కుట్రలు చేసి కూలగొట్టడంలో సి.ఐ.ఏ ప్రముఖ పాత్ర పోషించింది. ప్రజాస్వామ్య సంస్ధాపన పేరుతో ప్రజాస్వామిక ప్రభుత్వాలనే కూలగొట్టి నియంతలను కాపాడుతూ వచ్చింది. అమెరికా కంపెనీల ప్రయోజనాలు అంగీకరిస్తే నియంతలను కాపాడింది. అమెరికా కంపెనీల ప్రయోజనాలని తిరస్కరించి తమ దేశ ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా ఎంచుకున్న అనేక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ప్రభుత్వాలను కుట్రలు చేసి కూల్చివేసింది. ఇవన్నీ కాక వాణిజ్యం పేరుతో కంపెనీల ముసుగులో కూడా దేశ విదేశాల్లో ప్రవేశించి కంపెనీ ఉద్యోగుల రూపంలోనే రహస్య మిలట్రీ గూఢచర్యం నిర్వహించడానికి డి.ఒ.డి ప్రతిపాదనలు ఉద్దేశించాయి.
అమెరికా కుట్రలకు భారత దేశం కూడా అతీతమేమీ కాదు. స్వాంతంత్ర్యం వచ్చిన తొలి నాళ్ళలోనే ఫోర్డ్ కంపెనీ ప్రతినిధుల రూపంలో సి.ఐ.ఏ గూఢచారులను అమెరికా భారత దేశంలో చొప్పించిందని పత్రికలు అనేకమార్లు ప్రస్తావించాయి. కాంగ్రెసేతర మాజీ ప్రధాని ఒకరి సి.ఐ.ఏ గూఢచారి అని కూడా వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి. భారత దేశంలో కూడా అమెరికా భద్రతా బలగాలు రహస్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అమెరికా మిలట్రీ కమాండర్ ఒకరు ఇటీవల కాంగ్రెస్ ముందు సాక్ష్యం ఇచ్చాడు. అమెరికా మెప్పు కోసం భారత ప్రజలకు ఉపయోగపడే ఇరాన్ గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ప్రభుత్వాలు మనల్ని ఏలుతున్నాయి. ఈ నేపధ్యంలో చూసినపుడు అమెరికా డి.ఒ.డి ప్రతిపాదనలు భవిష్యత్తులో భారత దేశానికి ప్రమాదకరంగా పరిణమించక మానవు.