పై చదువులకోసం అమెరికా వెళ్ళే డాక్టర్లు ఇక ‘రిటర్న్ బాండ్’ ఇవ్వాలి


AZADపై చదువుల కోసం అమెరికా వెళ్ళే డాక్టర్లు ఇక నుండి దేశానికి తిరిగొస్తామని బాండ్ పేపర్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. అమెరికాలో చదువులు పూర్తయ్యాక అక్కడే స్ధిరపడడానికి భారతీయ డాక్టర్లు మొగ్గు చూపుతున్నారనీ, ఉన్నత చదువుల పేరుతో వెళ్ళి అక్కడే ఉండిపోతున్నారనీ ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి వారిని అడ్డుకోవడానికి కొత్త నిబంధన విధిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపాడు.

“ఏ విధ్యార్ధి అయినా వైద్య చదువుల కోసం అమెరికా వెళ్తే చదువు పూర్తయ్యాక మళ్ళీ ఇండియా తిరిగి వస్తామని బాండ్ ఇవ్వాలి. గత మూడు సంవత్సరాలలో 3000 మంది డాక్టర్లు అమెరికా వెళ్ళి మళ్ళీ రాలేదు. అమెరికా నుండి తిరిగి రాకపోతే, అక్కడ ప్రాక్టీసు చెయ్యడానికి అనుమతించబోము” అని ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ సోమవారం పత్రికలకు తెలిపాడు.

ఈ సంవత్సరం నుండీ అమెరికా ప్రభుత్వం విద్యార్ధులను ‘ఎన్.ఓ.సి’ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) సమర్పించాలని నిబంధన విధించినట్లు తెలుస్తోంది. “మరే దేశమూ ఎన్.ఓ.సి అడగడం లేదు” అని మంత్రి తెలిపాడు. బాండ్ ఇవ్వకపోతే ఆ విద్యార్ధికి ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వవద్దని అమెరికా ప్రభుత్వానికి చెబుతాము” అని మంత్రి తెలిపాడు.

గ్రామీణ ప్రాంతాలలో సేవలు అందించడానికి ప్రత్యేక కోర్సు ప్రవేశపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ‘బాచిలర్ ఆఫ్ రూరల్ హెల్త్ కేర్’ పేరుతో సదరు కోర్సును ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఈ కోర్సు కోసం ఎం.సి.ఐ అనుమతి ఇస్తుందని ఆజాద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. “డాక్టర్ల సంఘాలు కోర్సును వ్యతిరేకిస్తున్నాయి. వారికి ఈ విషయంలో స్వార్ధ ప్రయోజనాలు ఉన్నాయని నిస్సందేహంగా చెప్పగలను” అని మంత్రి వ్యాఖ్యానించాడు. “కారికులం సిద్ధం అయింది. రాష్ట్రాలకు కోర్సును అమలు చేయడంలో స్వేచ్చ ఉంది. అయితే భారత దేశ వ్యాపితంగా ఈ కోర్సుకి ఒకే ప్రమాణాలు రూపొందించడానికి వీలుగా ఎం.సి.ఐ గుర్తింపును కోరుతున్నాం. ఎం.సి.ఐ త్వరగా కదలాల్సి ఉంది.” అని ఆజాద్ వ్యాఖ్యానించాడు.

సీనియర్ డాక్టర్ల వద్ద కాంపౌండర్లుగా పని చేస్తున్నవారు కొంత కాలం తర్వాత గ్రామాల్లో ఆర్.ఎం.పి లుగా స్వంతగా ప్రాక్టీసు పెట్టే అలవాటు ఇండియాలో విస్తృతంగా ఉంది. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆర్.ఎం.పి లు ముందు వరుసలో ఉన్నారు. వీరే లేనట్లయితే గ్రామీణ భారతానికి వైద్యం కనీస స్ధాయిలో కూడా  అందకపోయేది. వీరి స్ధానంలో కొత్త కోర్సు చదివినవారిని ప్రవేశపెట్టవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఆలోచనలా కనిపిస్తోంది.

కొత్త కోర్సు ద్వారా గ్రామీణ ప్రజానీకానికి మేలు చేకూరితే అంతకంటే కావలసింది ఏముంది? అయితే దీనిని డాక్టర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నదీ ఆజాద్ చెప్పలేదు. తమ ప్రాక్టీసు పడిపోతుందేమోనన్న భయంతో వ్యతిరేకిస్తున్నారని ఆజాద్ చెప్పినది నిజమే అయితే అది ఎంత మాత్రం క్షంతవ్యం కాదు. ఇప్పటికే రోగులు పీల్చి పిప్పి చేసే రాక్షసులుగా అనేకమంది డాక్టర్లు వ్యవహరిస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా పరీక్షలు జరిపించాలని కోరడం, అవసరం లేని మందులను కొనిపించడం చేస్తున్నారన్న ఆరోపణలు విస్తృతంగా ఉన్నాయి. గ్రామాలలో ఆర్.ఎం.పి డాక్టర్లు పట్టణాలలోని ప్రవేటు ఆసుపత్రులకు ఏజెంట్లుగా కూడా పని చేస్తున్నారని ఇటీవల ఆంధ్ర జ్యోతి ఒక కధనం ప్రచురించింది. గ్రామీణ ప్రజల్లో ఉండే పేదరికం, ఆవిద్య, అవగాహనా రాహిత్యం ఉన్నత చదువులు చదువుకున్న డాక్టర్లకు డబ్బు సంపాదనకు పెట్టుబడిగా ఉపయోగపడడం బాధాకరం. ఈ పరిస్ధితి మారడానికి కొత్త కోర్సు ఏమైనా ఉపయోగపడుతుందా? ప్రభుత్వాల దృక్పధం మారకుండా కొత్త కోర్సులు ఎన్ని వచ్చినా ఏమి లాభం? 

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి తిరిగి రానిది ఒక్క డాక్టర్లే అన్నట్లుగా ప్రభుత్వం భావిస్తున్నదేమో తెలియదు. భారత దేశంలోని శ్రామిక ప్రజలు నిర్మించిన సౌకర్యాలతో అనేక ఉన్నత చదువులు చదువుకున్నవారు డాలర్ల కోసం ఎంచక్కా విదేశాలకు ఎగిరిపోతున్నారు. ‘దేశం నాకేమిచ్చింది అనడం కంటే దేశానికి నేనేమిచ్చాను’ అని ప్రశ్నించుకోవాలన్న సూత్రాన్ని వీరు పట్టించుకుంటున్నట్లు లేదు. విదేశాలలో స్ధిరపడి అక్కడే గుడులు నిర్మించుకుని పూజలు చేస్తేనో, అప్పుడప్పుడూ వచ్చే భారతీయ పండగలు జరుపుకుంటేనో దేశ భక్తి అయిపోదని వీరు గుర్తించవలసి ఉంది. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం వహించకుండా, తమ ఉన్నత చదువులు భారత దేశ ప్రజానీకానికి ఉపయోగపడకుండా వీరు దేశం గురించి ఎన్ని కబుర్లు చెప్పినా వృధా.

One thought on “పై చదువులకోసం అమెరికా వెళ్ళే డాక్టర్లు ఇక ‘రిటర్న్ బాండ్’ ఇవ్వాలి

  1. చదువులు మనదేశం లో సేవలు వేరొక దేశం లో అని మా చిన్నప్పుడు వక్తృత్వ పోటీ పెట్టినప్పుడు నాకు ఇంచు మించు దే తరహా ఆలోచనలే ఉండేవి,
    స్వంతహా గా ఉండాలి అండీ, ఏదో రూల్ ప్రకారం అని కాకుండా!
    మొన్న ee madhyane ilaanti discussion మా coleege stho raagaa akkada unna soukarya vanthamaina sukha pradhamaina bhdramaina jeevanam
    ikkada lenappudu vaatini kaavalanukuni vellatam akkada undatam tappa? అని edu prashninchagaa,
    nenu minnakundi povaalsi vacchindi…

వ్యాఖ్యానించండి