క్లుప్తంగా… 24.04.2012


Telanganaజాతీయం

జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

జగన్ అవినీతి ఆస్తుల కేసులో సి.బి.ఐ ఉచ్చు బిగిస్తున్నదని ఫస్ట్ పోస్ట్ తెలిపింది. సెక్షన్ 164 కింద సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం ద్వారా పకడ్బందీగా కేసు విచారణ సాగిస్తునట్లు వెల్లడించింది. మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేసిన సాక్షుల వాంగ్మూలాలను సాక్ష్యాలుగా కోర్టు పరిగణిస్తుందనీ, వాటిని ఆ తర్వాత సాక్షులు వెనక్కి తీసుకోవడానికి లేదనీ ఆ పత్రిక తెలిపింది. అలాంటి సాక్ష్యాలను రహస్యంగా ఉంచుతూ కింది కోర్టులో అప్పుడే వాటిని వెల్లడించడానికి సి.బి.ఐ ఇష్టపడడం లేదనీ తెలిపింది. 12 మంది వరకూ సాక్షుల నుండి సెక్షన్ 164 కింద వాంగ్మూలాలు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. డెలాయిట్ కంపెనీ డైరెక్టర్ నారాయణ్ సుదర్శన్, వాన్ పిక్ కంపెనీకి చెందిన నలుగురు వ్యక్తులు (ఒక పాత డైరెక్టర్, ముగ్గురు ఉద్యోగులు) దుబాయ్ ఎన్.ఆర్.ఐ వ్యాపారి మాధవ్ రామచంద్రన్ లాంటివారు ఆ సాక్షులలో ఉన్నారని తెలిపింది.

తెలంగాణ ఎంపీల సస్పెన్షన్, ప్రభుత్వంపై బి.జె.పి, లెఫ్ట్ పార్టీల విమర్శలు

సభా కార్యక్రమాలను భంగం కలిగిస్తున్నారంటూ ఎనిమిది మంది తెలంగాణ కాంగ్రెస్ ఎం.పిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పాలక పార్టీ ఎం.పిలను సస్పెండ్ చేయడం కనీవినీ ఎరగనిదని లెఫ్ట్ పార్టీలు విమర్శించాయి. డిమాండ్లు పట్టించుకోవడం లేదంటూ పాలక పార్టీ ఎం.పీలే ఆందోళన చేయడం, వారిని వారి పార్టీ ప్రభుత్వమే సస్పెండ్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే ఈ పరిస్ధితికి కారణమని వారు విమర్శించారు. ఇదిలా ఉండగా తెలంగాణ కు మద్దతు నిస్తున్న బి.జె.పి పార్టీ ఎం.పిల సస్పెన్షన్ కి అనుకూలంగా ఓటేసింది. కేంద్ర ప్రభుత్వ నిష్క్రియా పరత్వం రాష్ట్రాన్ని బాధాకర పరిస్ధితికి నేట్టిందని ఆ పార్టీ విమర్శించింది.

అన్నా బృందం నుండి మరొకరి తొలగింపు

అన్నా బృందం మరొక సభ్యుడిని తొలగించింది. ముఫ్తి షమూమ్ కజ్మీ సమావేశాన్ని రహస్యంగా తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ ఆయనని తొలగించారు. తనకసలు మొబైల్ ఫోన్ ఆపరేషనే సరిగా తెలియదనీ ఇక సమావేశాన్ని ఎలా రికార్డు చేస్తాననీ ముఫ్తీ ప్రశ్నించాడు. తాము సమావేశంలో ఉండగానే గతంలో అనేకసార్లు సమావేశ వివరాలు బయటికి ఎలా వెళ్ళేవనీ దానికి బాధ్యుడు ముఫ్తీయేనని తమకిపుడు అర్ధమయిందనీ అన్నా బృందం అంటోంది.

డీజెల్ ధరలపై నియంత్రణ ఎత్తివేత

డీజెల్ ధరలను కూడా డీ కంట్రోల్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్యాస్ ధరల్ని మాత్రం ఇప్పుడే డీ కంట్రోల్ చేసే ఆలోచనేదీ తమకు లేదని ప్రకటించింది.

అంతర్జాతీయం

యూరప్ దేశాల్లో ముస్లింలపై వివక్ష

యూరోపియన్ దేశాలు ముస్లిం మతస్ధులపై వివక్షను పాటిస్తున్నాయని లండన్ మానవహక్కుల సంస్ధ ‘ఆమ్నేస్టీ ఇంటర్నేషనల్’ మంగళవారం వెల్లడించిన నివేదికలో విమర్శించింది. విధ్య, ఉద్యోగం రంగాలతో పాటు రోజువారీ జీవనంలో కూడా యూరప్ దేశాల జాతీయ చట్టాలు, నిబంధనలు వివక్ష పాటిస్తున్నాయని నివేదిక తెలిపింది. ముస్లింలలో అత్యధిక నిరుద్యోగం ఉన్నదనీ, ఫ్రాన్సు, బెల్జియం, నెదర్లాండ్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ఉద్యమాలు నిర్వహిస్తున్నారని తెలిపింది. సాంప్రదాయక దుస్తులు ధరించిన ముస్లిం మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడానికీ, విద్యా సంస్ధల్లో అడ్మిషన్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారనీ తెలిపింది. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ముస్లింలపై ద్వేషం ప్రచారం చేస్తున్నాయనీ తెలిపింది. నివేదిక అంశాలను ప్రెస్ టి.వి ప్రచురించింది.

ఇజ్రాయెల్ గ్యాస్ ఒప్పందం రద్దును ప్రశంసించిన ఈజిప్టు పార్లమెంటు

ఇజ్రాయెల్ కి గ్యాస్ సరఫరా రద్దు చేయడాన్ని ఈజిప్టు పార్లమెంటు ప్రశంసలతో ముంచెత్తింది. ముస్లిం బ్రదర్ హుడ్ సంస్ధకి అధిక స్ధానాలు ఉన్న పార్లమెంటు ఈ చర్య కోసమే తాము చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ దురాక్రమణలో ఉన్న పాలస్తీనా ప్రజలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించింది. అయితే ఈజిప్టు అంతర్జాతీయ సహకార మంత్రి ఫయ్జా అబుల్ నాగా మాత్రం కొత్త షరతులతో, కొత్త రేట్లతో, సరికొత్త గ్యాస్ అమ్మకం కాంట్రాక్టు కుదుర్చుకోవడానికి ఈజిప్టు సిద్ధంగా ఉందని ప్రకటించి ఈజిప్టు మిలట్రీ పాలకుల ఉద్దేశ్యాన్ని తెలియజేశాడు.

వ్యాఖ్యానించండి