ప్రస్తుత ఆర్మీ చీఫ్ పదవీ విరమణ చేశాక తదుపరి చీఫ్ గా ప్రభుత్వం నిర్ణయించిన ‘లెఫ్టినెంట్ జనరల్ బిక్రం సింగ్’ కి చెందిన ‘కాన్ఫిడెన్షియల్ ఫైలు’ ని కోర్టు ముందుంచాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశిచింది. జస్టిస్ ఆర్.ఏం.లోధా, జస్టిస్ హెచ్.ఎల్.గోఖలే లతో కూడిన డివిజన్ బెంచి ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరింది. బిక్రం సింగ్ ను తదుపరి ఆర్మీ చీఫ్ గా నియమించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. రిటైర్డ్ నావల్ చీఫ్ అడ్మిరల్ లక్ష్మీ నారాయణ రామ్ దాస్, మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎన్.గోపాల స్వామి లతో పాటు ఇతర మాజీ బ్యూరోక్రాట్లు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారిస్తోంది.
ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ వయసు కి సంబంధించిన అంశాన్ని పిటిషనర్లు ప్రారంభంలో ప్రస్తావించగా ఆ కేసు జోలికి వెళ్లడానికి కోర్టు నిరాకరించింది. వి.కె.సింగ్ వయసు వివాదంపై సుప్రీం కోర్టు ఇప్పటికే విచారించిందనీ, అంతిమ నిర్ణయం జరిగింది గనుక మళ్ళీ ఆ కేసు జోలికి పోమనీ తెలిపింది. దానితో పిటిషనర్లు వి.కె.సింగ్ వయసు అంశాన్ని వదిలిపెట్టక తప్పలేదు.
జనరల్ బిక్రం సింగ్ 2001 లో జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తుండగా ‘బూటకపు ఎన్ కౌంటర్’ కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో బిక్రం సింగ్ పైన జమ్మూ కాశ్మీరు హై కోర్టులో ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇదే కాకుండా భారత దేశం తరపున కాంగోలో స్ధానిక మహిళను వేధించి, అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన సైనికులపై చర్య తీసుకోలేదని కూడా బిక్రం సింగ్ పై ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తి సైన్యంలో అత్యున్నత పదవి అయిన ‘ఆర్మీ చీఫ్’ పదవికి అర్హుడు ఎలా అవుతాడని పిటిషనర్లు పిటిషన్ లో ప్రశ్నించారు.
నాలుగు గోడల మధ్య ‘ఇన్-కెమెరా’ లో విచారణ చేయాలన్న పిటిషనర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. పిటిషన్ లోని అంశాలన్నీ ఇప్పటికే పత్రికల్లో రావడం వల్ల దేశంలో ఇప్పటికే చర్చాంశంగా మారిందనీ, కొత్తగా రహస్య విచారణ వల్ల ఒరిగేదేమీ లేదనీ కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్ లోని అంశాలు ‘సెన్సిటివ్’ అనీ, బహిరంగ కోర్టులో విచారిస్తే నష్టం జరుగుతుందనీ పిటిషనర్లు వాదించారు. వారి వాదనను కోర్టు తిరస్కరించింది.
ఆర్మీ చీఫ్ నియామకంలో పిటిషనర్లు మతపరమైన కోణాన్ని చొప్పించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం కోర్టులో వాదించింది. సిక్కు మతానికి చెందినవారు లాబీయింగ్ చేసీన ఫలితంగా బిక్రం సింగ్ నియామకం జరిగినట్లుగా పిటిషనర్లు వాధించినట్లు ప్రభుత్వ ప్రస్తావన బట్టి అర్ధం అవుతోంది. ఈ అంశంపై సుప్రీమ్ కోర్టు ఏమి వ్యాఖ్యానించిందీ పత్రికల నుండి సమాచారం లేదు. మధ్యాహ్నం 2:00 గంటల లోపు బిక్రం సింగ్ కి చెందిన ‘కాన్ఫిడెన్షియల్ ఫైల్’ ఇవ్వాలని కోర్టు కోరింది.
లెఫ్టినెంట్ జనరల్ బిక్రం సింగ్ ప్రస్తుతం ఆర్మీ కి చెందిన ఈస్ట్రన్ కమాండ్ కి అధిపతిగా పని చేస్తున్నాఆడు. మే 31 తేదీన జనరల్ వి.కె.సింగ్ పదవీ విరమణ చేయనున్నాడు. ఆయన తర్వాత బిక్రం సింగ్ ఆర్మీ అత్యున్నత పదవి చేపట్టవలసి ఉంది. ఈ లోగా ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలయింది. పిటిషనర్లలో జర్నలిస్టు శామ్ రాజపా, సామాజిక కార్యకర్త ఎం.జి.దేవసహాయం లు కూడా ఉన్నారు. భారత సైనికులు కాంగో లో ఐక్యరాజ్య సమితి తరపున శాంతి సైనికులుగా వెళ్ళి కాంగో మహిళలను లైంగికంగా వేధించారనీ, అత్యాచారానికి పాల్పడ్డారనీ పిటిషనర్లు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన భారత సైనికులను విచారించి శిక్షించడంలో జనరల్ బిక్రం సింగ్ విఫలం అయ్యాడని పిటిషనర్లు ఆరోపించారు.