ఇండియాలో టి.బి చావులు రోజుకి 1,000


TB quoteభారత దేశ పాలకవర్గాలు సిగ్గుతో తల దించుకోవలసిన చేదు నిజం ఇది. ట్యూబర్కులోసీస్ (టి.బి) వ్యాధి బారిన పడిన భారతీయ రోగులు సరైన వైద్యం అందక రోజుకు 1,000 మంది చనిపోతున్నారు. మరే దేశంలోనూ ఇంతమంది టి.బి రోగులు మృత్యువాత పడడం లేదు. చనిపోతున్న టి.బి రోగుల్లో ప్రతి ఐదు నిమిషాలకు చనిపోతున్న ఒక పిల్లవాడు కూడా ఉన్నాడని టి.బి వ్యాధి నివారణ కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్ధ టి.బి.ఎ.ఐ (ట్యూబర్కులోసీస్ అలర్ట్ ఇండియా) తెలియజేసింది.

ప్రపంచంలో అత్యధిక టి.బి రోగులు భారత దేశంలోనే ఉన్నారని ఆ సంస్ధ తెలిపింది. ప్రపంచంలోని మొత్తం టి.బి రోగుల్లో 21 శాతం మంది ఇండియాలో ఉన్నారనీ, టి.బి రోగుల మొత్తం సంఖ్య 23 లక్షల చిలుకేననీ సంస్ధ తెలిపింది. అయితే ఇండియా టి.బి రోగులు ప్రపంచ రోగుల్లో 26 శాతం ఉంటారని ఒక అధ్యాయాన్ని ఉటంకిస్తూ బ్లూమ్ బర్గ్ పత్రిక తెలిపింది. కొత్త రోగుల సంఖ్య 2 లక్షల ఉండవచ్చని ఆ పత్రిక తెలిపింది. భారత దేశం తర్వాత అత్యధిక ట్యూబర్కులోసీస్ రోగ పీడితులు చైనాలో ఉన్నారని తెలిపింది. ప్రపంచ రోగుల్లో 15 శాతం చైనాలో ఉన్నారని తెలిపింది. రానున్న దశాబ్దంలో టి.బి వ్యాధిని ఎదుర్కోవడానికి తగిన ‘యాక్షన్ ప్లాన్’ రూపొందించుకోవడంతో పాటు ఇతర లక్ష్యాలతో టి.బి.ఎ.ఐ సంస్ధ శనివారం హైద్రాబాద్ లో సమావేశం నిర్వహించింది. జాతీయ స్ధాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టి.బి.ఎ.ఐ బ్రిటన్ కి చెందిన టి.బి అలర్ట్ యు.కె సంస్ధతో భాగస్వామ్యం ఉన్న సంస్ధ అని తెలుస్తోంది.

టి.బి వ్యాధి వ్యాప్తిని అరికట్టలేకపోవడం ఒక సంగతి కాగా, చికిత్సకోసం అందుబాటులో ఉన్న మందులన్నింటినీ పూర్తి స్ధాయిలో ప్రతిఘటిస్తున్న టి.బి క్రిములు దేశంలో వ్యాప్తి చెందడం మరొక సంగతి. భారత దేశంలో కొన్ని ప్రాంతాల్లో టి.బి క్రిములు మందులకు పూర్తి స్ధాయిలో ప్రతిఘటించే స్ధాయికి చేరుకున్నాయని గత జనవరిలో బి.బి.సి ఓ వార్త ప్రచురించింది. ముంబై లోని మురికివాడల్లో ఈ రకం టి.బి కనుగొన్నామని హిందూజా గ్రూపుకి చెందిన ఒక ప్రవేటు ఆసుపత్రి ప్రకటించింది. దగ్గర దగ్గరగా ఇళ్ళు ఉండే మురికివాడల్లో టి.బి వ్యాప్తి వేగంగా ఉంటుందనీ, ఈ నేపధ్యంలో చూసినపుడు పూర్తి స్ధాయి ప్రతిఘటనను అభివృద్ధి చేసుకున్న టి.బి వ్యాధి విస్తృత వ్యాప్తిలో ఉండవచ్చని ముంబై డాక్టర్లు అభిప్రాయ పడ్డారు. మందులకు పాక్షికంగా స్పందించే టి.బి వ్యాధులు కూడా భారత దేశంలో విస్తృత వ్యాప్తిలో ఉన్నాయని అనేకసార్లు పత్రికలు తెలిపాయి. మందులకు స్పందించని టి.బి కి వైద్యం చేయడం చాలా చాలా కష్టమని డాక్టర్లు చెప్పే మాట.

టి.బి అతి తేలికగా వ్యాపించే అంటు వ్యాధి. పేదరికం అంటే టి.బికి చాలా ఇష్టం. దరిద్రం తాండవిస్తున్న చోట టి.బి స్వేచ్ఛగా సంచరిస్తుంది. రోగిTB దగ్గినా, తుమ్మినా, మాట్లాడినా, ఊసినా టి.బి క్రిములు గాలిలోకి ప్రవేశిస్తాయి. టి.బి క్రిములున్న గాలిని పీల్చినవారు తేలికగా జబ్బు బారిన పడతారు. ఒక టి.బి రోగి సంవత్సరానికి కనీసం 10 నుండి 15 మంది వరకూ కొత్త రోగులకు జబ్బు అంటిస్తాడని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్యాక్ట్ షీట్ చెబుతోంది. ఈ నేపధ్యంలో చూసినపుడు ముంబై డాక్టర్లు చెప్పింది ఎంత వాస్తవమో అర్ధం అవుతుంది. ప్రభుత్వాలు, ప్రజలు ఉమ్మడిగా చైతన్యవంతంగా కృషి చేస్తే తప్ప ఇలాంటి జబ్బుల్ని పూర్తిగా అరికట్టడం సాధ్యం కాదు. ప్రజలను మోటివేట్ చేయడం కూడా ప్రభుత్వాల నిబద్ధతపై ఆధారపడి ఉన్న విషయం. నేటికీ మలేరియా చావులను అనుమతిస్తున్న ప్రభుత్వాలు టి.బి లాంటి ప్రాణాంతక దరిద్రుల వ్యాధిని అరికట్టడానికి కృషి చేస్తుందని ఆశించగలమా?

టి.బి నివారించడంలో భారత ప్రభుత్వ కృషి సరిగ్గా లేదని గత నెలలో ప్రపంచ టి.బి దినం (మార్చి 23) సందర్భంగా  అసోసియేటెడ్ ప్రెస్ ఒక కధనం వెలువరించింది. ప్రభుత్వ మద్దతుతో సాగుతున్న టి.బి నిర్మూలనా ప్రోగ్రామ్ లు సరిపోకపోవడం, మందుల అమ్మకంపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల భారత దేశంలో మందులకు స్పందించని టి.బి వ్యాధులు పెరుగుతున్నాయని ఎ.పి తెలిపింది. డ్రగ్ రెసిస్టెంట్ టి.బి కేసులు ఇండియాలో ప్రతి సంవత్సరం 99,000 నమోదవుతున్నాయని అందులో చాలా కొద్ది మందికి మాత్రమే ప్రభుత్వం కార్యక్రమాల ద్వారా వైద్యం అందుతోందని తెలుస్తోంది.

టి.బి వైద్యానికి మామూలుగా చికిత్స చేయడం తేలికేననీ కానీ ఆరు నుండి పది నెలల పాటు చికిత్స తీసుకోవాల్సిన రోగులు ప్రతి కూల పరిస్ధితుల వలన మధ్యలో నే చికిత్స మానేయడమో, మధ్య మధ్య లో మందులు మానేయడమో చేస్తున్నారనీ దానితో క్రిములు ప్రతిఘటనా శక్తిని పెంచుకుంటున్నాయనీ ఎ.పి కధనం తెలిపింది. టి.బి అధికంగా సోకేది పేదలకే గనుక వారినికి చికిత్స అందించే బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ప్రభుత్వ టి.బి నిర్మూలనా కార్యక్రమాలు రోజు మార్చి రోజు మాత్రమే మందులు అందిస్తున్నాయి. దానితో రోగులు మధ్యలో మందులో తీసుకోవడం మానేసే ప్రమాదం అధికంగా ఉండని టి.బి నిర్మూలనా కార్యకర్తలను ఉటంకిస్తూ ఎ.పి తెలిపింది. ఈ పరిస్ధితుల్లో రోగులు ప్రవేటు వైద్యులను ఆశ్రయిస్తారనీ కానీ వారికి టి.బి వైద్యంలో పూర్తి పరిజ్ఞానం లేకపోవడం వల్ల తప్పుడు మందులు ఇచ్చి టి.బి క్రిములు శక్తివంతం కావడానికి దోహదపడుతున్నారని కార్యకర్తలు తెలిపారు. కార్యకర్తల వాదనలపై వివరణ కోరడానికి భారత ప్రభుత్వాన్ని సంప్రదించగా అసలు సమాధానమే లేదని ఎ.పి తెలిపింది.

మరింత మంది పేదలను సృష్టించే విధానాలను ఇష్టంగా అమలు చేస్తున్న భారత రాజకీయ నాయకులూ, ప్రభుత్వాలు టి.బి లాంటి పేదల జబ్బుల్ని అంతం చేయడానికి చిత్త శుద్ధితో కృషి చేయగలరని ఆశించడం నేతి బీరలో నేయి వెతకడమే.

13 thoughts on “ఇండియాలో టి.బి చావులు రోజుకి 1,000

  1. టిబికి వైద్యం చెయ్యడం చేతకాదు కానీ ఆరోగ్యశ్రీ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులకి కోట్లు అపాత్ర దానం చెయ్యడానికి మాత్రం డబ్బులు ఉంటాయి.

  2. పారిశ్రామిక రొగాననేటివి పెట్టుబడిదారివిదానం వల్ల మాత్రమే పుట్టుక వస్తాయి. ఇవి గత సమాజాలలొ లేవు. యంత్రాల వల్ల చెతులు, వెళ్ళు, శరీరభాగాలు పొగొట్టుకొవడం కుడా జరుగుతుంది .కాలుష్యం, లాంటి వాటివి కార్మిక వర్గాన్నె కాక పెట్టుబడిదారీ వర్గాన్ని కుడా వెంటాడతాయి. వాడు వుండేది వెరే గ్రహం మీదకాదు కద. అంటు వ్యెదులు లాంటివి మొదట కార్మిక వర్గాని చెరినా క్రమక్రమంగా పెట్టుబడిదారులను కుడా వదలవు.

  3. శేషుబాబు గారూ ధన్యవాదాలు. బ్లాగు నచ్చినట్లయితే మరింతమందిని బ్లాగుకి పరిచయం చేయండి. దానివల్ల మరింత మందికి విషయాలు తెలిసే అవకాశం ఉంది.

  4. manchi vishleshana. bagundhi. TB gurinchi pattinchukonidhe endhukante sir, TB nirodhinche karyakrakramaniki, AIDS, etc jabbula laga world bank, ledha UN lanti samsthalu dabbulu ivvavu anukunta. enthokontha migalandhe e pani cheyarukadha mana nayaka mahanubhavulu.? sigguchetu..

  5. శేఖర్ గారు మీరు చెప్పింది నిజం. ఎయిడ్స్ జబ్బుకి జన్మనిచ్చిన అమెరికా దాన్ని ప్రపంచానికి రుద్దింది. ఖర్చు పెట్టే ప్రతి పైసాలోనూ కమిషన్లు మిగిల్చుకునే రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లకి దేశ ప్రజల అవసరాలు పట్టవు.

  6. ప్రైవేటు డాక్టర్లకి వైద్యం తెలియక కాదు తప్పుడు మందులు ఇచ్చేది. కొందరు స్వార్థ డాక్టర్లు కంపెనీలకు అమ్ముడుపోవటం వల్ల అతిగా మందులు ఇవ్వటం లేదా వ్యాధి తో సంబంధం లేని మందులు ఇవ్వటం జరుగుతున్నాయి. ఈ సమస్యలకు అసలు పరిష్కారం ప్రజల knowledge ని పెంచడమే. కాని కొందరు పెట్టుబడిదారులవటం వల్లా, మిగిలినవారు పెట్టుబడిదారులని తిట్టుకునేవారవటం వల్లా, ఎవరూ ప్రజల్కు ఏమీ ఒరగబెట్టడం లేదు!!

  7. TB is not poor mans disease.it is wide spread now.My son is completely vaccinated but he was infected. Thank god it is cured.The govt should think that whether the BCG vaccine is really working.It is very serious problem because it spreads through air and we cant take prevention methods.

  8. అనిత గారూ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెలువరించిన నివేదికలు టి.బి ని ప్రధానంగా పేదల జబ్బుగా ప్రస్తావిస్తున్నాయి. అలా అన్నంత మాత్రాన ఇతర వర్గాలకు టి.బి సోకదని కాదు. టి.బి అంటు వ్యాధి గనుక రోగి నుండి క్రిములు సోకినవారు ఎవరైనా ఆ వ్యాధి బారిన పడతారు. అయితే పేదవారు జబ్బు నయం కావడానికి ప్రభుత్వాసుపత్రులపైనే ఆధారపడాలి. పేదవారి చుట్టూ ఉండేది ప్రధానంగా పేదవారే. ఆ దృష్ట్యా పేదవారు ఎక్కువగా టి.బి బారిన పడతారు. చదువు తక్కువగా ఉండడం, అత్తెసరు చదువులు చదివినా సరైన అవగాహన లేకపోవడం ఇవన్నీ పేదవారిని టి.బి ఎక్కువగా బలి తీసుకుంటోంది.

    టి.బి విస్తృతంగా వ్యాప్తిలో ఉందన్న విషయాన్ని డబ్ల్యూ.హెచ్.ఒ నివేదికలు కూడా చెబుతున్నాయి. ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టడం లేదని కూడా విమర్శిస్తున్నాయి.

వ్యాఖ్యానించండి