ఆరు నెలల్లో మరిన్ని సంస్కరణలు -ప్రధాని ఆర్ధిక సలహాదారు


Kaushik Basuవచ్చే ఆరునెలల్లో భారత దేశంలో ముఖ్యమైన ఆర్ధిక సంస్కరణలు  మరిన్ని అమలు  చేయనున్నామని ప్రధాని ప్రధాన ఆర్ధిక సలహాదారు కౌశిక్ బసు ప్రకటించాడు. 2014 వరకూ ‘బిగ్ టికెట్’ సంస్కరణలేవీ సాధ్యం కాదని ప్రకటించి రాజకీయ, ఆర్ధిక వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన కౌశిక్ బసు బి.జె.పి తో పాటు ప్రవేటు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేయడంతో తన గొంతు సవరించుకున్నాడు. సబ్సిడీలను తగ్గించే చర్యలను ప్రభుత్వం చేపడుతుందని ఆయన సూచించాడు. డీజెల్ ధర్లపై నియంత్రణ, రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులు లాంటి సంస్కరణల చర్యలు కూడా ప్రభుత్వం చేబడుతుందని ఆయన తెలిపాడు.

జి.ఎస్.టి (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్) లాంటి అతి పెద్ద సంస్కరణ చేపట్టడం కష్టంతో కూడుకున్నాడని కౌశిక్ బసు అన్నాడు. “ఎందుకంటే అది మంచిది. ప్రస్తుత పన్నుల వ్యవస్ధలో అది జరగాలనీ అందురూ కోరుకోరు” అని వ్యాఖ్యానించాడు. మంచిదే అయినా అందరూ ఎందుకు కోరుకోరో కౌశిక్ బసు వివరించలేదు. అందరూ కోరుకోనిది మంచిది ఎలా అవుతుందో కూడా ఆయన చెప్పవలసి ఉంది.

ప్రజా చట్టాలు నామ మాత్రం, సంస్కరణలే శాశ్వతం

2014 లోపు ముఖ్యమైన ఆర్ధిక సంస్కరణలు ఏవీ సాధ్యం కాదని గత బుధవారం ప్రకటించి కౌశిక్ బసు కంపెనీ వర్గాలలో ప్రకంపనలు సృష్టించాడు. కంపెనీల తరపున బి.జె.పి పార్టీ కూడా ఆందోళనలో భాగం పంచుకుంది. వామ పక్షాలు, విప్లవ పార్టీలు ‘ఆర్ధిక సంస్కరణల’ దుష్ఫలితాలపై విస్తృతంగా ప్రచారం చేయడంతో భారత దేశంలోని మేధో వర్గాలలోనూ, కార్మికవర్గంలోనూ ఆర్ధిక సంస్కరణలపై సాధారణ వ్యతిరేకత ఏర్పడింది. ఆర్ధిక సంస్కరణల ప్రత్యక్ష ఫలితాలను అనుభవించిన కార్మికవర్గం గత ఇరవై యేళ్లలో ఉద్యమాలను నిర్వహించింది. ఫలితంగా యు.పి.ఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రజానుకూల చట్టాలను, పధకాలనూ చేపట్టింది. ‘సమాచార హక్కు చట్టం’, ‘విద్యా హక్కు చట్టం, ‘ఉపాధి హామీ పధకం’, ‘ఆహార భద్రతా చట్టం’ మొదలయినవి ఆ జాబితాలో ఉన్నాయి.

ఈ చట్టాలనూ, పధకాలనూ చూపుతూ ఆర్ధిక సంస్కరణలను ముందుకు తీసుకుపోవాలని యు.పి.ఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా అసలీ చట్టాలే ఆర్ధిక సంస్కరణలకు వ్యతిరేకమైనవిగా స్వదేశీ విదేశీ ప్రవేటు కంపెనీలు భావిస్తున్నాయి. ప్రవేటు కంపెనీల ఆందోళనలను భారతీయ జనతా పార్టీ మోస్తున్నది. 2014 లోపు ఆర్ధిక సంస్కరణలు సాధ్యం కాదని కౌశిక్ బసు ప్రకటించిన తర్వాత బి.జె.పి ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ కి తన ప్రభుత్వంలోని భాగస్వాములపైన నియంత్రణ లేదనీ, వారు చెప్పినట్టల్లా ఆడుతున్నదనీ, వారి ఒత్తిళ్లకు లొంగి సంస్కరణలను అటకెక్కించ్చిందని విమర్శలు గుప్పించింది. తాను అధికారంలోని వస్తే సంస్కరణలను వేగవంతం చేస్తామనీ, కనుక తమకు నిధులిచ్చి ప్రోత్సహించాలనీ కంపెనీలకు పరోక్షంగా సందేశాన్ని పంపింది. సంస్కరణల వల్ల కష్టాలు పడుతున్న కోట్లాది శ్రామిక జనానికి ఎన్నికల్లో తాగబోయించి, వారి ఓట్లకు డబ్బులిచ్చి దారికి తెచ్చుకోవచ్చన్నది వారి నమ్మకం.

నిజానికి సంస్కరణల అమలులో యు.పి.ఏ, ఎన్.డి.ఏ కూటమీలు రెండూ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. కాకపోతే అమలు తీరులోనే వైరుధ్యాలున్నాయి. ఆ వైరుధ్యాలు కూడా తీవ్రమైనవేవీ కావు. ఒకరు నెమ్మదిగా ‘స్లో పాయిజన్’ గా సంస్కరణలు అమలు చేయాలని చూస్తుండగా, మరొకరు మొరటుగా, ‘షాక్ ట్రీట్ మెంట్’ లా అమలు చేయాలని చూస్తున్నారు. (‘షాక్ ట్రీట్ మెంట్’ వాది అయిన బి.జె.పి నేతృత్వంలోని ఎన్.డి.ఏ కి 2004 ఎన్నికల్లో ప్రజలు ‘షాక్’ ఇచ్చినప్పటికీ ఇంకా తెలివి వచ్చినట్లు లేదు.) చేదు మాత్రని తీపి పూత పూసి మింగిద్దామని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, అసలు తీపి పూత పూసే ఖర్చు పెట్టుకోవడం ఎందుకని బి.జె.పి కూటమి వాదిస్తోంది. రెండు కూటమిలూ సంస్కరణలను అమలు చేసేవే. ప్రజల ప్రయోజనాలకు హాని కలిగించేవే. ఒకరు పది సంవత్సరాలలో కలిగించే నష్టాన్ని మరొక ఐదు సంవత్సరాల్లోనే కలిస్తారు. అంతే తేడా. కంపెనీల తరుపున అమెరికా, యూరప్ ల ఒత్తిడి పెరిగే కొద్దీ, ఆ దేశాలలో ఆర్ధిక సంక్షోభం మరింత తీవ్రం అయే కొద్దీ ఈ తేడా పోనూ పోనూ తగ్గుతూ పోతుంది. ప్రజా ఉద్యమాలు మాత్రమే ఆ తేడాను పెంచగలవు. అసలు సంస్కరణలే లేకుండా పోవాలంటే నిర్ణయాత్మక ప్రజా ఉద్యమాలే శరణ్యం.

యు.ఐ.డి మోసం

“రానున్న రోజుల్లో సాధ్యమయ్యే సంస్కరణల్లో సబ్సిడీ సంస్కరణ ఒకటి. ఆర్ధిక మంత్రి బడ్జెట్ లో ఈ విషయమై ప్రకటించి ఉన్నాడు. యు.ఐ.డి (యూనీక్ ఐడెంటిఫికేషన్) పద్ధతిని ఇప్పటికే అభివృద్ధి చేశాము. దానిని ఉపయోగించి సబ్సిడీ వ్యవస్ధలో లీకేజీని అరికట్టడానికి ప్రయత్నిస్తాము” అని కౌశిక్ బసు అన్నాడు. “ఇండియాలో సబ్సిడీ లీకేజీ భారీగా ఉంది. దీనిని అరికడితే మన కోశాగార లోటు (ఫిస్కల్ డిఫిసిట్) ని తగ్గించవచ్చు” అని ఆయన అన్నాడు. అయితే, యు.ఐ.డి విషయంలో కేంద్ర రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఇన్నాళ్లూ చెబుతున్నది అబద్ధమన్నమాట!

గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవాలన్నా, రేషన్ తెచ్చుకోవాలన్నా యు.ఐ.డి తప్పని సరిగా ఉండాలని ఆయా షాపుల వద్ద నిబంధనలు విధించారని కొద్ది నెలల క్రితం ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనతో అప్రమత్తమైన ప్రజా సంఘాలు ఆ పద్ధతిని నిరసించాయి. యు.ఐ.డి పేరుతో ప్రజలకి ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని చూస్తున్నారని ఆరోపించాయి. అదీ కాక యు.ఐ.డి రూప కల్పన విదేశీ స్వదేశీ ప్రవేటు కంపెనీలకు అప్పజెప్పడం వల్ల ప్రజలకు సంబంధించిన సమాచారం అంతా ప్రవేటు కంపెనీల వద్ద ఉన్నదనీ కంపెనీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ఈ సమాచారం దేశాలు దాటి పోయి ప్రజల భద్రతకు ప్రమాదం ఏర్పడిందనీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశ వ్యాపితంగా అనేక మంది మేధో వర్గాలు సైతం యు.ఐ.డి వ్యవస్ధ ప్రజా వ్యతిరేకం అని నిరసనలు తెలిపాయి. ఈ ఆరోపణలకు, నిరసనలకు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించాయి. సబ్సిడీలను తగ్గించడానికి యు.ఐ.డి ని ఉపయోగించబోమని హామీ ఇచ్చాయి. గ్యాస్, రేషన్ లకు యు.ఐ.డి అవసరం లేదనీ చెప్పాయి. కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం స్వయంగా ఈ వివరణ ఇచ్చాడు. ఇప్పుడు కౌశిక్ బసు చేసిన ప్రకటనతో అవన్నీ అబధ్ధాలేనని తేలిపోయింది.

రిటైల్ రంగం ప్రవేటీకరణ

“మల్టీ బ్రాండ్ రిటైల్ లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయానికి వస్తే వంద శాతం ఖచ్చితంగా చెప్పలేము. కానీ అది జరగడానికి ఎక్కువ ఆవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అది భారత రైతులకు, చిన్న ఉత్పత్తిదారులకు భారీ ప్రోత్సాహాన్నిస్తుంది. మదుపుదారుల విశ్వాసాన్ని కూడా ఆ చర్య మెరుగుపరుస్తుంది” అని కౌశిక్ బసు తెలిపాడు. పాలకులకి మదుపుదారుల విశ్వసనీయత పై ఉండే ఆందోళన సామాన్య ప్రజానీకం విశ్వసనీయతపై లేదు. సామాన్యుల విశ్వసనీయత ఎన్నికల్లో మాత్రమే లెక్కలోకి వస్తుంది. ఓట్లు పొంది అధికారం చేజిక్కాక ఇక ప్రజల విశ్వసనీయతతో పని లేదు. విదేశీ పెట్టుబడులు దేశాన్ని ముంచెత్తి తద్వారా కమీషన్లు పెరగాలంటే  పెట్టుబడిదారుల విశ్వసనీయతే వారికి కావాలి. అందుకోసం సంస్కరణలు వేగం వంతం చేయడానికి, ప్రజా ప్రయోజనాలు ఫణంగా పెట్టడానికీ వారు సిద్ధం.

ఆరు నెలల్లో రిటైల్ రంగం ప్రవేటీకరణ కోసం ప్రయత్నాలు ఊపందుకుంటాయని కౌశిక్ బసు హామీ ఇస్తున్నాడు. రిటైల్ రంగం ప్రవేటీకరణకి వ్యతిరేకంగా చిన్న వ్యాపారులు, పట్టణ స్ధాయి సూపర్ బజార్ల తో పాటు కోట్లాది రిటైల్ దుకారణదారు కుటుంబాలు వీధికెక్కినా పట్టించుకునే పరిస్ధితిలో ప్రభుత్వం లేదని కౌశిక్ బసు ప్రకటన స్పష్టం చేస్తోంది. ప్రజల వ్యక్తిరేకతను ఎలా అధిగమించి ప్రవేటీకరణని పూర్తి చేయాలన్నదే వారి ధ్యాస తప్ప ప్రజలకు నష్టం కనుక పక్కన బెట్టాలన్న ఆలోచన వారు చేయడం లేదు.

డీజెల్ కంట్రోల్

ప్రభుత్వాలు లక్ష్యం గా పెట్టుకున్న సంస్కరణలలో పెట్రోల్, డీజెల్, కిరోసిన్ లపై నియంత్రణల ఎత్తివేత. పెట్రోల్ ని పూర్తిగా ఇప్పటికే డీ కంట్రోల్ చేశారు. డీజెల్ ని కూడా డీ కంట్రోల్ చేస్తామని చాలా కాలంగా వారు చెబుతున్నారు. అయితే డీజెల్ డీ కంట్రోల్ ని ఆటో కంపెనీలు ప్రతిఘటిస్తున్నాయి. దాని వల్ల డీజెల్ పై ఆధారపడి నడిచే కార్లు, ఇతర వాహనాల అమ్మకం పడిపోతుందని వారి భయం. కంపెనీల వల్లనే డీజెల్ డీ కంట్రోల్ ఆగింది తప్ప ప్రజల డబ్బులని పొదుపు చేద్దామని కాదు. ప్రభుత్వం వద్ద ఆటో లాబీ, డీజెల్ లాబీ లలో ఎవరు పై చేయి సాధిస్తారన్నదానిపైనే డీజెల్ ధరల డీ కంట్రోల్ ఆధారపడి ఉంది. ఇందులో ప్రజలను పట్టించుకున్నవారే లేరు.

డీజెల్ డీ కంట్రోల్ విషయంలో “పాక్షికంగా చర్యలు తీసుకోవచ్చు. డీజెల్ పైన పాక్షికంగా నియంత్రణ ఎత్తివేయడానికి సాధ్యపడవచ్చు. పాక్షిక ఎత్తివేత అన్నది ఎలా ఉంటుందో స్పష్టంగా చెప్పలేము. అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. లీటర్ కి ఇచ్చే సబ్సిడీని కొద్ది మేరకు పరిమితం చేసే పద్ధతి అనుసరణీయంగా ఉంది. దీని ద్వారా వినియోగదారుడికి పాక్షికంగా రక్షణ ఉంటుంది. అదే సమయంలో ప్రపంచ ధరలలో హెచ్చుతగ్గులను కూడా పాక్షిక నియంత్రణ ఎత్తివేత ప్రతిఫలిస్తుంది. మార్కెట్ సామర్ధ్యం పెంచడానికి ఇది అత్యవసరం” అని కౌశిక్ బసు అన్నాడు. మార్కెట్ సామర్ధ్యం పెంచితే ప్రజల జీవన సామర్ధ్యం పడిపోతుందన్న సంగతి కౌశిక్ బసుకి అనవసరం. ప్రధానికి ప్రధాన సలహాదారుగా ఆయన ఉన్నది సంస్కరణల వేగం పెంచడానికే. ప్రధాని నేరుగా ప్రజల ద్వారా ఎన్నికయిన వ్యక్తి కాదు గనక ఆయనకి ప్రజల గోడు పట్టదు. అణు కంపెనీల కోసం ప్రధాని పదవి త్యాగానికి కూడా సిద్ధపడిన వ్యక్తికి ప్రజల గోడు ఎలా పడుతుంది?

3 thoughts on “ఆరు నెలల్లో మరిన్ని సంస్కరణలు -ప్రధాని ఆర్ధిక సలహాదారు

  1. BJP ఎప్పుడూ ముసుగు వేసుకోకుండానే ప్రజల్ని దోచుకుంటుంది. అధికారంలో లేకపోయినా ముసుగు లేకుండానే దోపిడీవాదాన్ని వినిపిస్తోంది.

  2. అవును. బి.జె.పి మత తత్వ ముసుగు హిందూ ఓట్ల కోసమే. అధికారంలోకి వచ్చాక హిందూ దేశ వనరుల్ని, హిందూ ప్రజల జీవితాల్ని పశ్చిమ దేశాల కంపెనీలకి అప్పజెప్పడానికి దానికేమీ అభ్యంతరం ఉండదు. ఎన్.డి.ఎ ప్రభుత్వం అనుసరించిన విధానాలని పశ్చిమ దేశాలు వేనోళ్ల కొనియాడాయి. వారి పొగడ్తలు చాలనుకుని “దేశం వెలిగిపోతోంది” అని నినాదం ఇచ్చేశారు. ఫలితం అనుభవించారు. అధికారం నుండి ఎనిమిదేళ్ల ఎడబాటు కూడా వారి విధానాల్లో మార్పు తెచ్చినట్లు లేదు. బి.జె.పి, కాంగ్రెస్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేకపోవడం దేశ ప్రజలకి తీవ్ర నష్టం కలిగిస్తోంది.

  3. ఒకవేళ 2014లో బిజెపి గెలిచినా వాళ్ళు 2019లో మళ్ళీ ఓడిపోతారు. కాంగ్రెస్‌ని ఎదిరించడం బిజెపికి చేతకాదు. కాంగ్రెస్ ఐదేళ్ళు దోచుకుంటే బిజెపి మరో ఐదేళ్ళు దోచుకోవడం మాత్రం చెయ్యగలదు.

వ్యాఖ్యానించండి