ఈజిప్టు ప్రజలు మరోసారి వీధుల కెక్కారు. చరిత్రాత్మక తాహ్రిరి స్క్వేర్ లో శుక్రవారం నుండి వేలాదిమంది నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మే 23 న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో అనేకమందిని ‘అనర్హులు’ గా ప్రకటించడం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆగ్రహానికి తాజా కారణంగా నిలిచింది. ప్రజల న్యాయమైన ఆగ్రహాన్ని నియంత్రణలో ఉంచుకున్న ‘ప్రభుత్వేతర సంస్ధలు’ (ఎన్.జి.ఓ) నిరసనలలో ముఖ్య పాత్ర నిర్వహించడం కొనసాగుతోంది. నిన్నటి వరకూ మిలట్రీ పాలకులతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ ఉద్యమాలలో చేరడానికి నిరాకరించిన ‘ముస్లిం బ్రదర్ హుడ్’ సంస్ధ తమ అభ్యర్ధిని కూడా అనర్హుడుగా మిలట్రీ ప్రకటించడంతో శుక్రవారం నిరసనలలో పెద్ద సంఖ్యలో తన మద్దతుదారులను సమీకరించింది. తాను ఆశించినంతగా అధికారాన్ని తమతో పంచుకోవడానికి మిలట్రీ అంగీకరించడం లేదని ఆ సంస్ధ భావిస్తోంది. సలాఫిస్టులు, సో కాల్డ్ లెఫ్టిస్టులు, సోషలిస్టులు, ఏప్రిల్ 9 యువజన ఉద్యమం, ముస్లిం బ్రదర్ హుడ్ మున్నగు సంస్ధలు తాజా నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహిస్తున్నాయి.
ప్రదర్శనలలో పాల్గొంటున్న వివిధ సంస్ధలు వివిధ లక్ష్యాలను, ఎజెండాలను కలిగి ఉండడంతో ఐక్య ఫ్రంట్ నాయకత్వంలో ఉద్యమం నిర్వహించడంలో విఫలం అవుతున్నాయి. ముఖ్యంగా ‘ముస్లిం బ్రదర్ హుడ్’ సంస్ధ ఐక్య ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు గండి కొట్టిందని ఇతర సంస్ధలు ఆరోపిస్తున్నాయి. ముస్లిం బ్రదర్ హుడ్ ని ఇస్లామిస్టులుగానూ, ఇతరులని లిబరల్స్ గానూ పత్రికలు పేర్కొంటున్నాయి. గత సంవత్సరం జనవరిలో మాజీ నియంత హోస్నీ ముబారక్ గద్దె దిగిన తర్వాత కూడా అనేక సార్లు తాహ్రిరి కూడలిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. వీటిలో పాల్గొనడానికి ముస్లిం బ్రదర్ హుడ్ నిరాకరిస్తూ వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో ఇతరుల కంటే అత్యధిక స్ధానాలు గెలుచుకోవడంతో మిలట్రీ జుంటాతో కలిసి అధికారం పంచుకోవడానికి అది సిద్ధపడింది. అయితే మిలట్రీ పాలకుల ఉద్దేశ్యం వేరుగా ఉంది. ముస్లిం బ్రదర్ హుడ్ కి గణనీయ స్ధాయిలో అధికారం అప్పగించినట్లయితే అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ఆటంకం కలుగుతుందని ఆ దేశాలు భావిస్తున్నాయి. దానితో ముస్లిం బ్రదర్ హుడ్ కి అధికార పగ్గాలు అందించకుండ మిలట్రీ పాలకులపై ఆ దేశాలు ఒత్తిడి తెచ్చి సఫలం అయ్యాయి.
ఈజిప్టులోనూ, మధ్య ప్రాచ్యం (Middle East) ప్రాంతంలోనూ అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ప్రయోజనాలకు ప్రతినిధిగా హోస్నీ ముబారక్ ముప్ఫై యేళ్ళు నియంతృత్వం నెరిపాడు. ఇప్పుడా పాత్రను ఈజిప్టు మిలట్రీ పాలకులు పోషిస్తున్నారు. పశ్చిమ దేశాల ప్రయోజనాలు, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తున్న మిలట్రీ పాలకులు ప్రజాస్వామిక సంస్కరణల కోసం జరుగుతున్న పోరాటాలను నిరంకుశంగా అణిచివేస్తూ వచ్చాయి. అనేక మంది ఉద్యమకారులపై వందలాది కేసులు బనాయించి జైళ్ళలో కుక్కింది. అనేకమంది విద్యార్ధులు, యువకులను మాయం చేయించింది. అర్ధరాత్రి దాడులు, అరెస్టులు, చిత్రహింసలతో ప్రజాస్వామిక ఆకాంక్షలను అణచివేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నది.
అయితే పార్లమెంటు ఎన్నికల్లో అధిక స్ధానాలు గెలుచుకున్న ముస్లిం బ్రదర్ హుడ్ తో మిలట్రీ ప్రభుత్వం సాపేక్షికంగా సంయమనంతో వ్యవహరించింది. మిలట్రీ తో కుమ్మక్కయ్యి అధికారం పంచుకోవడం కోసం ముస్లిం బ్రదర్ హుడ్ ‘విప్లవాన్ని’ అమ్మేసిందని ఇతర సంస్ధలు అనేకసార్లు ఆరోపించాయి. పార్లమెంటులో ఇస్లామిస్టుల ఆధిపత్యం ఉన్నప్పటికీ మిలట్రీ జనరల్సే ఇంకా అధికారం గుప్పిట్లో పెట్టుకోవడం వల్లనే శుక్రవారం ప్రదర్శనలలో ఆ సంస్ధ హాజరయిందని అవి ఆరోపించాయి. అధికారం పంచుకోవడానికి అంగీకరిస్తే, మరోసారి మిలట్రీ పాలకులతో రాజీ పడడానికి ముస్లిం బ్రదర్ హుడ్ (ఎం.బి) సిద్ధపడుతుందని ఆ సంస్ధలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. “బ్రదర్ హుడ్ కి అధికారం దక్కితే చాలు. గతంలో కూడా వారి వ్యవహారం చూశాం. వాళ్ళు విప్లవాన్ని హీనపరిచారు. వారి చేతులకి అమరుల రక్తం అంటింది” అని ఒక ప్రదర్శకుడు వ్యాఖ్యానించాడని ‘ది హిందూ’ తెలిపింది. అయితే ఎం.బి మాత్రం తాను విప్లవాన్ని కాపాడడానికే ప్రయత్నిస్తున్నానని చెప్పుకుంటోంది.
ఈజిప్టులో మే 23 న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి పరివర్తన సాధించే దిశలో ఈ ఎన్నికలు మైలు రాయి కానున్నాయని పశ్చిమ దేశాల పత్రికలు హోరెత్తిస్తున్నాయి. మిలట్రీ పాలకులు ఇచ్చిన హామీ ప్రకారం అధ్యక్ష ఎన్నికలు ముగిశాక అధికారాన్ని పూర్తిగా అధ్యక్షుడికీ, పార్లమెంటుకీ అప్పగించి మిలట్రీ తప్పుకోవలసి ఉంది. కానీ గత కొద్ది నెలలుగా మిలట్రీ అనుసరిస్తున్న విధానాలు దాని హామీకి అనుగుణంగా లేవు. అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా తన ఆధిపత్యం కొనసాగించడానికి మిలట్రీ ప్రయత్నిస్తున్నదన్న అనుమానాలు అందరికీ కలుగుతున్నాయి. ఉదాహరణకి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో ఏకంగా పది మందిని అనర్హులుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ప్రధాన పోటీదారులు ముగ్గురినీ అనర్హులుగా ప్రకటించి నామినేషన్లు రద్దు చేసింది. వీరిలో ముస్లి బ్రదర్ హుడ్ కి చెందిన ప్రధాన పోటీదారు కూడా ఉన్నాడు. ఎం.బి ప్రధాన పోటీదారుని అనర్హుడిగా చేయడంతో డమ్మీ అభ్యర్ధి ప్రధాన పోటీదారుగా ఎంచుకోవలసిన పరిస్ధితి తలెత్తింది. ముస్లిం మతతత్వ వాదులయిన ‘సలాఫిస్టుల’ అభ్యర్ధి మరో ప్రధాన పోటీదారుడుగా ఉండగా ఆయనని కూడా అనర్హుడిగా ప్రకటించారు. ఇలా అభ్యర్ధులను కోల్పోయినవారందరూ శుక్రవారం ప్రదర్శనలో భాగస్వాములయ్యారు. వీరికి కావలసింది అధికారమే తప్ప ప్రజాస్వామ్యం కాదు.
హోస్నీ ముబారక్ అనుచరుడంటూ మాజీ ఇంటలిజెన్స్ అధికారిని పోటీ నుండి తప్పించిన మిలట్రీ ముబారక్ మంత్రివర్గంలో విదేశాంగ
మాత్రిగా ఉన్న అమీర్ మౌస్సా ను మాత్రం ముట్టుకోలేదు. ఈయనని ‘ఫ్రంట్ రన్నర్’ గా పత్రికలు అబ్బివర్ణిస్తున్నాయి. గతంలో ఈ పత్రికలు ఫ్రంట్ రన్నర్ గా చెప్పిన ఐ.ఏ.ఇ.ఏ మాజీ అధ్యక్షుడు ఎల్ బరాదీ ఇప్పుడు పత్తా లేడు. అమీర్ మౌస్సా హోస్నీ ముబారక్ మంత్రివర్గంలో ఉంటూ పదేళ్ళ పాటు (జూన్ 2001- జూన్ 2011) అరబ్ లీగ్ (22 అరబ్ దేశాల కూటమి) సెక్రటరీ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. అరబ్ లీగ్ అధినేతగా అరబ్ ప్రజల ప్రయోజనాలు కాపాడవలసి ఉండగా, అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించాడు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు నమ్మినబంటుగా పని చేశాడు. లిబియాలో అమెరికా, యూరప్ దేశాలు నడిపిన కిరాయి తిరుగుబాటుని పూర్తిగా సమర్ధించాడు. గడ్డాఫీ నేతృత్వంలోని లిబియాపై ‘నో ఫ్లై జోన్’ విధింపజేయడంలోనూ, ఆ దేశంపై దుష్ట త్రయ దేశాలైన అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ లు వైమానిక దాడులు చేసి వేలాది లిబియా పౌరులను ఊచకోత కోయించడంలోనూ ముఖ్యమైన పని ముట్టుగా ఉపయోగపడ్డాడు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు తిరుగుబాటు పేరుతో గడ్డాఫీని కూలదోసి హత్య చేయడంలో అరబ్ లీగ్ పాత్ర ప్రముఖమైనది. ఆ పాత్రలో అమీర్ మౌస్సా సమర్ధవంతంగా జీవించి దుష్ట త్రయం మన్ననలు అందుకున్నాడు. ఇలాంటి వ్యక్తి ఈజిప్టు అధ్యక్షుడు కావడం అంటే ఈజిప్టు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు సమూలంగా నేలమట్టం కావడమే.
ఒకవేళ ముస్లిం బ్రదర్ హుడ్ అభ్యర్ధి ఎన్నికల్లో నెగ్గినా పెద్దగా తేడా ఏమీ ఉండబోదు. ఇప్పటికే మిలట్రీ జుంటాతో కుమ్మక్కై తన ప్రజావ్యతిరేక స్వభావాన్ని అది నిరూపించుకుంది. మతాన్ని అడ్డు పెట్టుకుని అధికారాన్ని చెలాయిస్తున్న అనేక మత తత్వ అరబ్ పాలక పార్టీల్లో ముస్లిం బ్రదర్ హుడ్ ఒకటి. సిరియాలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సు దేశాల కిరాయి సైనికులతో కలిసి ‘తిరుగుబాటు’ పేరుతో ప్రజలను ఊచకోతకోస్తున్న సంస్ధల్లో ముస్లిం బ్రద్ర్ హుడ్ కూడా ఉండడం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు. ఇతర సంస్ధలతో కలిపి మిలట్రీ పాలనకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్ధిని నిలపడానికి ముస్లిం బ్రదర్ హుడ్ అంగీకరించలేదు. అధికారంలో మెజారిటీ వాటా కోసం అమెరికా, యూరప్ ల ప్రతినిధులతో ఆ సంస్ధ ఘర్షణ పడుతున్నదే తప్ప దానివల్ల ఈజిప్టు ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. ఈ ఘర్షణలకు భౌతిక రూపంగానే శుక్రవారం నుండి జరుగుతున్న నిరసన ప్రదర్శనలను చూడవలసి ఉంటుంది. పశ్చిమ దేశాలు అటు మిలట్రీ తో కుమ్మక్కై ప్రజల నిరసనలను అణచివేస్తూనే ఇటు నిరసనలలో కూడా తమ ప్రతినిధులను ఉంచుతున్నాయి. సి.ఐ.ఏ ఆధ్వర్యంలోని ‘నేషనల్ లీగ్ ఫర్ డేమోక్రసీ’ నుండి నిధులు అందుకుంటున్న సో కాల్డ్ పోరాట సంస్ధ ‘ఏప్రిల్ 9 యూత్ మూవ్ మెంట్’ తాజా ప్రదర్శనలలో ప్రముఖ పాత్రను నిర్వహిస్తోంది. (ఈ సంస్ధను పశ్చిమ పత్రికలు లెఫ్టిస్టు సంస్ధగా చెప్పడం పెద్ద విడ్డూరం.) అయితే మెజారిటీ ప్రదర్శకులు ఎం.బి కి చెందినవారని పత్రికల ద్వారా తెలుస్తోంది.
ప్రదర్శనలలో పాల్గొంటున్న వివిధ సంస్ధలు తమ తమ వేదికలను ఏర్పాటు చేసుకున్నాయి. తమ వేదికలపై నుండి ఉపన్యాసాలు దంచుతూ తమకే ప్రత్యేకమైన నినాదాలు ఇస్తున్నాయని పత్రికలు చెబుతున్నాయి. లెఫ్టిస్టు వేదికలనుండి విప్లవ నినాదాలు వినిపిస్తుండగా సలాఫిస్టుల వేదికలనుండి ఖురాన్ బోధనలు వినిపిస్తున్నాయని ‘ది హిందూ’ తెలిపింది. సలాఫిస్టులు తమ ఏజెండా ప్రకారం తమ అభ్యర్ధి ‘హాజెమ్ అబు ఇస్మాయిల్’ అభ్యర్ధిత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాయి. అబు ఇస్మాయిల్ తల్లికి అమెరికా పౌరసత్వం ఉందని చెబుతూ ఆయనను అనర్హుడిగా మిలట్రీ ప్రకటించింది. ముస్లిం బ్రదర్ హుడ్ అభ్యర్ధి మోర్సీ ఫోటోలను ఆ సంస్ధ మద్దతుదారులు ప్రదర్శిస్తున్నారు. దాదాపు సగం సీట్లతో పార్లమెంటులో ప్రధాన పార్టీగా ఉన్నప్పటికీ అధికారం అనుభవించడానికి అవకాశం రాకపోవడం ఆ సంస్ధకి మింగుడు పడడం లేదు. మిలట్రీ ఏర్పరిచిన కేబినెట్ ని రద్దు చేసి తమ స్వంత కేబినెట్ ఏర్పాటు చేయడానికి ఎం.పి ప్రయత్నించింది. ఆ ప్రయత్నాన్ని మిలట్రీ ఒప్పుకోలేదు. న్యాయ వ్యవధ, ఎన్నికల కమిషన్, కొత్త రాజ్యాంగ రచన అన్నింటినీ మిలట్రీ ప్రభావితం చేస్తున్నాడని ఎం.బి ఆరోపిస్తున్నది. రాజ్యాంగ సభ తన ఆధీనంలో ఉండాలని కూడా ఎం.బితో పాటు ఇతర ఇస్లామిస్టులు డిమాండ్ చేశారు. ఇస్లామేతర సభ్యులు రాజ్యాంగ సభ నుండి తప్పుకోవడంతో దానిని కోర్టు రద్దు చేసింది.
ఓ వైపు ముస్లిం టెర్రరిజం పై యుద్ధం చేస్తున్నామని చెప్పుకునే అమెరికా, యూరప్ లు తమ ప్రయోజనాలు నెరవేరతాయనుకుంటే వారికి
మద్దతుగా నిలవడానికి కూడా సిద్ధపడతున్నాయి. ఒకపుడు ఆల్-ఖైదా టెర్రరిస్టులపై పోరాటం పేరుతో గడ్డాఫీకి మద్దతు నిచ్చిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు ఇప్పుడు అదే ఆల్-ఖైదా భాగస్వామిగా ఉన్న లిబియా ప్రజావ్యతిరేక ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాయి. లిబియా ప్రభుత్వంలో ఆల్-ఖైదా ప్రతినిధి గా ఉన్న అబ్దెల్ హకీం బెల్హాడ్జ్ అలియాస్ అబు అబ్దుల్లా ఆల్-సాదిక్ ను అమెరికా, బ్రిటన్ లు నిర్భందించి సంవత్సరాల తరబడి చిత్ర హింసలు పెట్టాయి. అదే వ్యక్తికి ఇపుడు లిబియాలో మద్దతు నిస్తున్నాయి. లిబియా ప్రభుత్వంలో ప్రధాన పాత్ర నిర్వహిస్తున్న సాదిక్ ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వంపైన దావా వేశాడు. గడ్డాఫీ కి చెందిన జైళ్ళలో నిర్భందించి బ్రిటన్ గూఢచారులు తనను చిత్ర హింసలు పెట్టారంటూ మరొక లిబియా ఇస్లామిస్టు సమీ ఆల్-సాది కూడా బ్రిటన్ ప్రభుత్వంపై దావా నడుపుతున్నాడు. (వీరు దావా వేసినప్పటికీ బ్రిటన్ ప్రభుత్వం నుండి ‘ఆపాలజీ’ మాత్రమే కోరుతున్నారు. ఆపాలజీ చెబితే కేసులు ఉపసంహరించుకుంటామని చెబుతున్నారు.) ఇక్కడ గ్రహించవలసిన విషయం దుష్ట్ర త్రయ దేశాలు చెప్పే ముస్లిం టెర్రరిజం, ప్రజాస్వామిక ఉద్యమాలకు మద్దతు అన్నీ ఒట్టివేనని. వారి వ్యాపార ప్రయోజనాలకు అంగీకరిస్తే ఒసామా బిన్ లాడెన్ ని ఆఫ్ఘన్ గద్దె పై కూచోబెట్టడానికి కూడా అవి అంగీకరిస్తాయి.
అధికారం కోసం ప్రయత్నిస్తూనే అమెరికా, యూరప్ ల ప్రాపకం కోసం ఈజిప్టులోని వివిధ గ్రూపుల పాలకవర్గాలు ప్రయత్నిస్తున్నాయి. వీరికి ఈజిప్టు ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు. అధికారం చేజిక్కాక హోస్నీ ముబారక్ లాగా దేశ వనరులను అమెరికా, యూరప్ ల కంపెనీలకు అప్పజెప్పడానికి వీరు సిద్ధమేనని గత సంవత్సర కాలంగా జరుగుతున్న పరిణామాల ద్వారా స్పష్టం అవుతోంది. ఈజిప్టు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను అడ్డు పెట్టుకుని అధికారం సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో మిలట్రీ కూడా తన ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ విజేత తమకు అనుకూలుడుగా ఉండేలా ఇప్పటి నుండే జాగ్రత్త పడుతున్నాది. తమ అధికారానికి సవాలు గా ఉంటారని భావించినవారిని అసలు పోటీయే చేయకుండా నివారించింది. ముబారక్ నియంతృత్వ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న అమీర్ మౌస్సా ఎన్నికల్లో విజేతగా నిలపడానికి భవిష్యత్తులో మరిన్ని ఎత్తులు అది వేస్తుంది. మిలట్రీ ఎత్తుగడలను ఎదుర్కొని అధిగమించడంలో భాగంగానే ముస్లిం బ్రదర్ హుడ్ తాజా ప్రదర్శనలకు తెర తీసింది. ప్రజల నిరసనలను చూపి అధికారంలో మెజారిటీ కోసం అది ప్రయత్నిస్తోంది. వీరందరి చేతుల్లో ఈజిప్టు ప్రజల ఆకాంక్షలు నిలువునా సమాధి అయిపోయాయి.