ఆఫ్ఘన్ల శరీర భాగాలతో ఫోటోలు దిగిన అమెరికా సైనికులు


L A Timesఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధంలో అమెరికా సైనికుల నీచ ప్రవర్తనకి హద్దు లేకుండా పోతోంది. దురాక్రమణకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆత్మాహుతి బాంబర్ల విడి శరీర భాగాలతో అమెరికా సైనికులు దిగిన ఫోటోలను ‘లాస్ ఏంజిలిస్ టైమ్స్’ పత్రిక ప్రచురించింది. ఆఫ్ఘన్ యుద్ధంలో విధులు నిర్వర్తించిన సైనికుడే తమకు ఆ ఫోటోలు అందించచాడని ఆ పత్రిక తెలిపింది. ఫోటోలు ప్రచురించవద్దని అమెరికా మిలట్రీ కోరినప్పటికీ ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికుల ప్రవర్తన ఎలా ఉన్నదీ అమెరికా ప్రజలకు తెలియాలన్న ఉద్దేశ్యంతో కొన్ని ఫోటోలు ప్రచురిస్తున్నామని పత్రిక తెలిపింది. అమెరికా సైనికుల్లో క్రమ శిక్షణ, నాయకత్వ సామర్ధ్యం లోపించడం వల్ల ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికుల భద్రతకు ప్రమాదం ఏర్పడిందని ఫోటోలు అందించిన సైనికుడు అభిప్రాయపడినట్లు పత్రిక తెలిపింది.

సైనికుడు తమకు 18 ఫోటోలు ఇచ్చాడని పత్రిక తెలిపింది. అయితే ఇప్పటివరకూ రెండు ఫోటోలను మాత్రమే ‘లాస్ ఏంజిలిస్ టైమ్స్’ ప్రచురించింది. అమెరికా రక్షణ కార్యదర్శి లియోన్ పెనెట్టా తమ సైనికుల ప్రవర్తన నీచంగా ఉండని ఖండించాడు. చనిపోయిన మిలిటెంట్ల శరీరాలతో ‘వీలయినంత మానవత’ తో వ్యవహరించాలని సైనికులకు స్పష్టమైన ఆదేశాలున్నాయని తెలిపాడు. ఫోటోల ప్రచురణ వల్ల ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా వ్యతిరేకత తీవ్రం అవుతుందనీ, దానివల్ల ఆఫ్ఘన్ లోని అమెరికా సైనికుల భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందనీ తెలిపినప్పటికీ పత్రిక ఫోటోలను ప్రచురించడాన్ని ఖండిస్తున్నానని ప్రకటించాడు.

ఆఫ్ఘనిస్ధాన్ లోని అమెరికా రాయబారి రేయాన్ క్రాకర్ ‘అనైతిక కంపు కొడుతున్నాయని’ వ్యాఖ్యానించాడు. ఆఫ్ఘనిస్ధాన్ లో ప్రాణాలను త్యాగంUS solders' inhumanity 02 చేసిన వందల మంది సైనికులనూ, పౌరులనూ అవమానపరిచేవిగా ఉన్నాయని అన్నాడు. అమెరికా సైనికుల సంస్కృతిని అవి ప్రతిబింబించడం లేదని బాధపడ్డాడు. సంఘటనలపై సీరియస్ గా విచారణ జరుపుతామని సైనికాధికారులు ప్రకటించారు.

అమెరికా సైనికులు దుర్మార్గాలకు పాల్పడినప్పుడల్లా అమెరికా అధికారులు, సైనిక కమాండర్లు ఇలాంటి నీతి వాక్యాలు వల్లించడం అలవాటుగా చేసుకున్నారు. వీరు ఎన్ని నీతిలు చెప్పినప్పటికీ వాస్తవాలు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్నట్లుగా సముద్రాలు, ఖండాంతరాలు దాటి ఒక   స్వతంత్ర దేశాన్ని అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి దురాక్రమించిన అమెరికా తమ సైనికులు రుజు వర్తనతో ఉండాలని బోధనలు చెయ్యడం పెద్ద హిపోక్రసీ. ‘నాగరికతల యుద్ధం’ పేరుతో ప్రపంచ స్ధాయిలోనే ముస్లిం మతంపై అనైతిక దుష్ప్రచారాన్ని ప్రారంభించి కొనసాగిస్తూ, తన సైనికుల భద్రత వరకు వచ్చేసరికి ‘నైతిక బోధనలకు’ దిగడం మోస పూరితం.

ఫోటోలోని దృశ్యాలు అమెరికా సైనికుల మానవతా రాహిత్యాన్ని ఎట్టి చూపుతున్నాయి. ఆత్మాహుతి దాడుకి పాల్పడిన ఒక మిలిటెంట్ రెండు కాళ్ళు తెగిపడ్డాయి. ఆ కాళ్ళు రెండింటినీ ఎత్తి చూపుతూ నవ్వుతూ ఫోజులిచ్చిన దృశ్యం ఒక ఫోటోలో చిత్రించబడి ఉంది. రోడ్డు పక్క బాంబులు అమర్చుతూ అవి ప్రమాదవశాత్తూ పేలిపోవడంతో చనిపోయిన మిలిటెంట్ల శవాల పక్కన అభ్యంతర కరంగా మరొక ఫోటోలో ఫోజులిచ్చారు. ఇద్దరు సైనికులు చనిపోయిన ఆఫ్ఘన్ దేశీయుడి చేతివేళ్ళలో మధ్య వేలిని ఎత్తి పట్టిన దృశ్యం ఒక ఫోటోలో ఉందని డెయిలీ మెయిల్ తెలిపింది. చనిపోయిన మరొక ఆఫ్ఘన్ చేతిని భుజం మీద వేసుకుని మరొక సైనికుడు ఇకిలిస్తున్న ఫోటోను ఎల్.ఏ.టైమ్స్ ప్రచురించింది.  రెండు ఫోటోలూ రెండు విడి విడి ఘటనలకు చెందినవి. మొదటి ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత రెండవ ఘటన జరిగిందని పత్రిక తెలిపింది. US solders' inhumanity

మరొక ఫోటోలో ‘జోంబీ హంటర్’ బ్యాడ్జి ధరించిన సైనికుడొకరు ఆఫ్ఘన్ దేశీయుడి శవం పక్కన నిలబడి ఫోజు ఇచ్చాడని డెయిలీ మెయిల్ తెలిపింది. తాలిబాన్ కి బలం ఉన్న జాబూల్ రాష్ట్రంలో 2010 లో జరిగిన ఘటనల సందర్భంలో ఈ ఫోటోలు దిగారని తెలిపింది. అంతకుముందు పొలంలో పని చేసుకుంటున్న ఆఫ్ఘన్ బాలుడిని చంపి ఇదే పద్ధతిలో బాలుడి శవాన్ని ట్రోఫీగా చూపుతూ సైనికులు దిగిన ఫోటోలు అప్పటికే పత్రికల్లో వచ్చాయి. ఆ ఫోటోలపై ప్రపంచ వ్యాపితంగా నిరసనలు వెల్లువెత్తాయి. సైనికుల ప్రవర్తన సరిగా లేదని అప్పుడు కూడా అమెరికా అధికారులు, సైనిక కమాండర్లూ ప్రకటనలు గుప్పించారు. మరొక సారి చనిపోయిన ఆఫ్ఘన్ మిలిటెంట్లపై ఒంటికి పోస్తూ చిత్రీకరించిన వీడియోలు ఇంటర్నెట్ లో విడుదల అయ్యాయి. ఇటీవల అమెరికా సైనిక స్ధావరంలో ముస్లింల మత గ్రంధం ఖురాన్ ప్రతులను ఉన్నతాధికారుల ఆదేశాలతోనే సైనికులు దగ్ధం చేశారు. ఈ ఘటనలు జరిగినప్పుడల్లా అమెరికా ఉత్తుత్తి ఆపాలజీలు చెబుతూనే ఉన్నారు. ఒక దాని తర్వాత మరొకటి ఘటనలు వెల్లడవుతూనే ఉన్నాయి. ఘటన జరిగినప్పుడల్లా ‘ఐసోలేటెడ్ ఘటనలు’ గా కొట్టి పారేస్తూ వస్తున్నారు.

లాస్ ఏంజిలిస్ టైమ్స్ పత్రిక ప్రకారం ‘పారా ట్రూపర్స్’ కాంబాట్ టీం కి చెందిన సైనికుడొకరు ఈ ఫోటోలను అందించాడు. ఆఫ్ఘనిస్ధాన్ లోని అమెరికా సైనిక స్ధావరాల్లో నాయకత్వం, క్రమ శిక్షణ విచ్ఛిన్నం కావడంతో అక్కడ అమెరికా సైనికుల భద్రతకు ప్రమాదం ఏర్పడినట్లు భావిస్తున్నట్లు చెప్పాడు. 3500 పారాట్రూపర్లు ఉన్న బ్రిగేడ్ లో 3500 సభ్యులున్నారనీ, అందులో 35 మంది ఆఫ్ఘన్ మిలిటెంట్ల చేతిలో చనిపోయారనీ తెలుస్తోంది. తమ సహచరులు చనిపోవడంతోనే మనసు చెదిరి సైనికులు ఇలా ప్రవర్తించారని ఫోటోలు అందించిన సైనికుడు చెప్పాడని ఎల్.ఏ.టైమ్స్ తెలిపీంది. దురాక్రమణ యుద్ధానికి ఆఫ్ఘన్లు ఇస్తున్న న్యాయమైన ప్రతిఘటన లో సహచర సైనికుడు చనిపోతేనే మనసు చెదిరితే, మూడు దశాబ్ధాలుగా పరాయి దేశాల సైనిక పదఘట్టనల కింద బతుకులీడుస్తున్న ఆఫ్ఘన్లు ఇంకెంతగా మనసులు కష్టపెట్టుకోవాలో అమెరికా సైనికులు ఆలోచించాల్సి ఉంది.

వ్యాఖ్యానించండి