పాక్ కోర్టులో లష్కర్-ఎ-తయిబా చీఫ్ హఫీజ్ పిటిషన్


hafiz-saeedఅమెరికా ఒత్తిడికి లొంగి పాకిస్ధాన్ ప్రభుత్వం తనపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నదనీ, ఆ ప్రయత్నాలను నిరోధించాలనీ కోరుతూ లష్కర్-ఎ-తయిబా (ఎల్.ఇ.టి) అధిపతి హఫీజ్ సయీద్ పాకిస్ధాన్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన జీవితానికి భద్రత లేదనీ, రక్షణ కల్పించాలనీ, ఏ క్షణంలోనైనా తనకు ప్రాణహాని జరగవచ్చనీ ఆయన పిటిషన్ లో కోరాడు. హాఫీజ్ పిటిషన్ మేరకు లాహోర్ హై కోర్టు పాక్ కేంద్ర ప్రభుత్వానికీ హోమ్ మంత్రికీ, పణ్జాబ్ హోమ్ మంత్రికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 25 లోపు ప్రతిస్పందన చెప్పాలని కోరింది.

తన బావ హాఫీజ్ అబ్దుర్ రెహ్మాన్ మక్కీతో కలిసి సయీద్ పిటిషన్ దాఖలు చేశాడు. రాజ్యాంగం ప్రకారం తాము స్వేచ్చా పౌరులమనీ, అమెరికా ఒత్తిడితో తమపై చర్యలు తీసుకోకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అడ్డుకోవాలనీ వారు పిటిషన్ లో కోరారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించాలనీ కోరారు. తమకు ఏ క్షణంలోనైనా హాని జరగవచ్చనీ తెలిపారు. అంతే కాకుండా తమ తలలకు వెలలు ప్రకటించిన అమెరికాని ఆ వెలలు ఉపసంహరించుకోవాల్సిందిగా కోరమని పాక్ ప్రభుత్వానికి చెప్పాలని పిటిషన్ లో కోరారు.

ముంబై టెర్రరిస్టు దాడులకు హఫీజ్ సయీద్ సూత్రధారుడని భారత ప్రభుత్వం భావిస్తోంది. ముంబై లో అనేక చోట్ల జరిగిన నరహంతక దాడుల్లో 166 మంది చనిపోగా, 293 మంది గాయపడ్డారు. టెర్రరిస్టు దాడులకు ప్రధాన టార్గెట్ అమెరికన్లు, బ్రిటన్లు, ఆస్ట్రేలియన్లు, యూదులు అని పశ్చిమ దేశాల పత్రికలు వార్తలు రాయగా దాడుల్లో చనిపోయింది మాత్రం ఎక్కువగా భారతీయులే. సజీవంగా అరెస్టయిన అజ్మల్ కసబ్ విచారణలో సైతం పశ్చిమ దేశాలవారిని టార్గెట్ చేసుకోవాలని తమకు ప్రత్యేక ఆదేశాలేవీ లేవని చెప్పినట్లుగా భారత పత్రికలు తెలిపాయి.

కొద్ది రోజుల క్రితం హఫీజ్ సయీద్ తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల వెల కట్టింది. ఇది రు. 50 కోట్లకు ఇది సమానం. టెర్రరిస్టు దాడులు జరిగి దాదాపు నాలుగేళ్ళు గడిచాక అమెరికా ఈ వెల ప్రకటించింది. ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణ యుద్ధంలో పాకిస్ధాన్ సహకారం కోసం ఇన్నాళ్లూ ఆగిన అమెరికా, సైనిక ఉపసంహరణ ప్రకటించాక ఇక పాకిస్ధాన్ అవసరం పెద్దగా లేదని భావించాక మాత్రమే హఫీజ్ తలకి వెల కట్టింది.

హఫీజ్ సయీద్, రెహ్మాన్ మక్కీ లు పాకిస్ధాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. స్వేచ్ఛగా తిరుగుతున్నవారిని పట్టిచ్చినవారికి బహుమానం ప్రకటించడమే పెద్ద మోసం. హావీజ్, రెహ్మాన్ లు నేరస్ధూలనీ, వారి నేరాల నిరూపణకి తగిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయనీ అమెరికా భావించినట్లయితే ఆ సంగతి పాక్ ప్రభుత్వంతో చెప్పాలి. నేరస్ధుల ఒప్పంధం ప్రకారం వారిని తమకు అప్పగించాలని పాక్ ని కోరాలి. సాక్ష్యాలని పాక్ ప్రభుత్వానికి ఇవ్వాలి. నేరం జరిగిన స్ధలం భారత దేశంలో ఉన్నది కనుక ఆ సాక్ష్యాలను భారత దేశానికి కూడా ఇవ్వాలి. అందుకు తగిన ఒప్పందం అమెరికా, భారత్ ల మధ్య ఉన్నది కనుక దానిని గౌరవించాలి.

ఇవేవీ అమెరికా చేయలేదు. ముంబై దాడులకు ఏర్పాట్లు చేసిన ప్రధాన నిందితులు తహవ్వూర్ రాణా, హేడ్లీ లు అమెరికా కష్టడీలోనే ఉన్నారు. హేడ్లీ విచారణలో పూర్తిగా సహకరించి సాక్ష్యాధారాలు అందజేశాడు. వీరిని భారత ప్రభుత్వానికి అప్పగించవలసి ఉండగా అది చేయలేదు. కనీసం విచారించడానికి అవకాశం ఇవ్వాలని భారత ప్రభుత్వం కోరినప్పటికీ అమెరికా అందుకు అంగీకరించలేదు. అమెరికా వచ్చి ఫార్మల్ గా విచారణ చేస్తామని చెప్పినా ఒప్పుకోలేదు. ఇవేవీ చేయని అమెరికా అకస్మాత్తుగా నాలుగేళ్ళు గడిచాక సయీద్, మక్కీలను పట్టిచ్చినవారికి బహుమతి అంటూ ప్రకటించడం మోసం తప్ప మరొకటి కాదు.

ఆల్-ఖైదాతో సంబంధం ఉంది కనుక ఎల్.ఇ.టి టెర్రరిస్టు సంస్ధ ని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి చేత కూడా ప్రకటింప చేసింది. అదే ఆల్-ఖైదాతో కలిసి అమెరికా లిబియా అధ్యక్షుడు కల్నల్ గడ్డాఫీని హత్య చేయించింది. వైమానిక దాడులు చేసి, సి.ఐ.ఏ గూఢచారులను దింపి లిబియాను సర్వనాశనం చేసింది. ఆ తర్వాత లిబియా ప్రభుత్వంలో ఆల్-ఖైదా భాగస్వామిగా ఉండడానికి సహకరించింది. ఆల్-ఖైదాతో కలిసే సిరియా అధ్యక్షుడికి వ్యతిరేకంగా కిరాయి తిరుగుబాటుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు సైనిక, రాజకీయ, ఆయుధ మద్దతు ఇస్తున్నాయి. ఆల్-ఖైదా తో సంబంధం ఉన్న ఎల్.ఇ.టి టెర్రరిస్టు సంస్ధ అయితే, ఆల్-ఖైదాతో అంట కాగుతున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు ఏం కావాలి? నిజానికి అమెరికాని టెర్రరిస్టు రాజ్యం అని చెప్పడానికి ఆల్-ఖైదాతో పని లేదు. ఆల్-ఖైదాని పెంచి పోషించిందే అమెరికా. టెర్రరిస్టు సంస్ధలకి జన్మనిచ్చి, వాటి సాయంతో ప్రపంచ వ్యాపితంగా ప్రభుత్వాలను కూలగొట్టిన, ఇంకా అదే పనిలో ఉన్న అమెరికాయే అతి పెద్ద టెర్రరిస్టు.

వ్యాఖ్యానించండి