మార్చి నెలలో హోల్ సేల్ ధరలపై ఆధారపడి లెక్కించిన ద్రవ్యోల్బణం 6.89 శాతానికి తగ్గితే, రిటైల్ ధరలపై ఆధారపడి లెక్కించిన ద్రవ్యోల్బణం 9.47 శాతానికి పెరిగింది. రిటైల్ వ్యాపారులకి మాత్రమే అందుబాటులో ఉండే హోల్ సేల్ ధరలకీ, వినియోగదారులకి అందుబాటులో ఉండే రిటైల్ ధరలకీ ఉన్న వ్యత్యాసాన్ని ఈ గణాంకాలు ఎత్తి చూపుతున్నాయి. పాలు, కూరగాయలు, ప్రోటీన్ ఆధారిత ఆహార ఉత్పత్తులు, వంటనూనె ఉత్పత్తులు… వీటి ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది.
రిటైల్ ద్రవ్యోల్బణం ‘కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్’ (CPI) ఆధారంగా లెక్కిస్తారు. ప్రధాన ద్రవ్యోల్బణాన్ని మాత్రం ‘హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్’ (WPI) ద్వారా ప్రభుత్వం లెక్కిస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకునేది ప్రధాన ద్రవ్యోల్బణం గురించే. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 6.95 శాతం ఉంటే దాన్ని మార్చి లో 6.89 కి తగ్గించామని ప్రభుత్వం చాటుకుంది. తీరా చూస్తే ప్రజలు చెల్లించే ధరలపై ఆధారపడి లెక్కించే రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 8.83 శాతం ఉండగా మార్చిలో 9.47 శాతానికి పెరిగిపోయింది. హోల్ స్ధాయిలో ధరలు తగ్గితే ఆ తగ్గింపు వినియోగదారుల వరకూ చేరడం లేదని దీని ద్వారా స్పష్టం అవుతోంది. ధరల హెచ్చు తగ్గుల్లో కూడా లాభాలు గుంజుకుంటున్న పరిస్ధితి ఇక్కడ కనిపిస్తోంది.
ఆర్ధిక విధానాలలోనూ, ద్రవ్య విధానాల సమీక్షలోనూ, ప్రభుత్వాలు ప్రకటించే ‘మాక్రో ఎకనామిక్’ గణాంకాలలోనూ ప్రభుత్వాలు ‘ప్రధాన ద్రవ్యోల్బణం’ నే పరిగణనలోకి తీసుకుంటాయి. అంటే విధానాల రూపకల్పనలోనూ, సమీక్షలోనూ ప్రభుత్వాలు ప్రజలు చెల్లిస్తున్న ధరలను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నమాట. దీన్ని బట్టి ధరల పెరుగుదల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ప్రభుత్వాల పరిశీలనలో ఉన్నాయా లేవా అన్న అనుమానం కలుగుతోంది. నిజానికి కొత్తగా అనుమానం కలగవలసిన అవసరం కూడా లేదు.
వివరాల్లోకి వెళ్తే, ధాన్యాల ధరలు 2.78 శాతం పెరిగాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు దారుణంగా 15.22 శాతం పెరిగాయి. పాలు సమతులిత ఆహారం అనీ, పాలు అందకపోవడం వల్లనే పసిపిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారనీ తెలిసినదే. అలాంటి పాల ధరలు ఏకంగా పదిహేను శాతం పెరిగితే, కొద్దో గొప్పో పాలు తీసుకునే పేద వర్గాల పిల్లలు వాటికి మరింత దూరం అవుతారు. కానీ ఈ పరిస్ధితి ప్రభుత్వం దృష్టిలో లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి విడుదలయ్యే సర్వేల నివేదికలని చూసి మొసలి కన్నీళ్లు కార్చడానికి మాత్రం ప్రభుత్వ పెద్దలు సిద్ధంగా ఉంటారు.
పంచదార మార్చి లో 3.78 శాతం పెరగ్గా, కాయ ధాన్యాలు 4.89 శాతం పెరిగాయి. ప్రోటీన్ ఆహారాలయిన గుడ్లు, చేపలు, మాంసం ధరలు 10.06 శాతం పెరిగాయి. కూరగాయలు కూడా భారీగా 9.55 శాతం పెరిగాయి.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారీగా కూడా ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 8.79 శాతం ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 10.3 శాతం ఉందని గణాంకాలు తెలిపాయి. ఫిబ్రవరిలో ఇవి వరుసగా 8.36 శాతం, 9.45 శాతం నమోదయ్యాయి.