భారత రిజర్వ్ బ్యాంకు తన స్వల్ప కాలిక వడ్డీ రేట్లను తగ్గించింది. ద్రవ్య విధానాన్ని సమీక్షిస్తూ ఆర్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకుంది. 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వల్ల ప్రధానంగా కార్పొరేటు కంపెనీలు లబ్ది పొందుతాయి. నూతన పెట్టుబడుల కోసం, కంపెనీలు వ్యాపారాల విస్తరణ కోసం బ్యాంకులు మరిన్ని రుణాలను సమకూరుస్తాయి. తద్వారా నెమ్మదించిన ఆర్ధిక వృద్ధిని వేగవంతం చేయాలన్నది ఆర్.బి.ఐ లక్ష్యం. గృహ రుణాలపై కూడా వడ్డీ రేటు స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఆటో రుణాలపై కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయి. మరోపక్క ద్రవ్య చలామణీ పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింతగా పెరగనున్నది.
భారత జిడిపి వృద్ధి రేటు 2011-12 లో 6.9 ఉండగలదని ఆర్.బి.ఐ అంచనా వేసింది. 2007 కి ముందు సాధించిన 9 శాతం వృద్ధి రేటుకి ఇది చాలా తక్కువ. చైనా వలే రెండంకెల వృద్ధి రేటు సాధించడం భారత సంస్కరణ ప్రభోధకుల కల. ఈ కల వారికి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. రెండంకెల స్ధాయికి చేరుకోవడానికి బదులు భారత వృద్ధి రేటు క్రమంగా క్షీణించడం మొదలు పెట్టింది. ఆర్ధిక సంస్కరణల వల్ల ప్రజానీకంలో అత్యధికుల ఆదాయాలు తీవ్రగా పడిపోయి వారి కొనుగోలు శక్తి క్షీణించడమే దానికి ప్రధాన కారణం. ఈ వాస్తవాన్ని గ్రహించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి బదులు సంస్కరణలను మరింత తీవ్రం చేయడానికే పాలకులు నిశ్చయించుకున్నారు. వడ్డీ రేట్లు తగ్గించి కార్పొరేట్ కంపెనీలకు మరింత ప్రజా ధనాన్ని అప్పజెప్పి జి.డి.పి వృద్ధి రేటు పెంచడానికి చూస్తున్నారు. ఆ విధానాలు అమెరికా, యూరప్ లతో సహా అనేక దేశాల్లో విఫలమయినా పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు.
ఆర్.బి.ఐ తగ్గించిన వడ్డీ రేటును రేపో రేటు అంటారు. ఇది స్వల్పకాలానికి సంబంధించినది. బ్యాంకులు తమ వద్ద ఉన్న ద్రవ్య సెక్యూరిటీలను ఆర్.బి.ఐ కి అప్పజెప్పి ముందస్తుగా నిర్ణయించబడిన కాలానికీ, రేటుకి అప్పు తీసుకున్నట్లయితే ఆ రేటుని రేపో రేటుగా పిలుస్తారు. సెక్యూరిటీలేవీ అప్పజెప్పకుండా బ్యాంకులు, ఆర్.బి.ఐ వద్ద తీసుకునే అప్పులపై ఆర్.బి.ఐ వసూలు చేసే వడ్డీ రేటును ‘బ్యాంకు రేటు’ అంటారు. దానికీ రేపో కీ సంబంధం లేదు. ఒకటి స్వల్పకాలికమైనది కాగా, రెండవది దీర్ఘకాలికమైనది.
“సంక్షోభానికి ముందు ఉన్న దాని కంటే క్షీణించిన జిడిపి వృద్ధి రేటును దృష్టిలో పెట్టుకుని అంచనా వేసిన వృద్ధి ఆధారంగా రేపో రేటు ను తగ్గించాము. దీని వల్ల మూల ద్రవ్యోల్బణంలో పెరుగుదల ఉంటుంది” అని ఆర్.బి.ఐ గవర్నర్ డి.సుబ్బారావు తెలిపాడు. 2012-13 సంవత్సరానికి జిడిపి వృద్ధి 7.3 శాతంగా అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపాడు. ప్రభుత్వ అంచనా కంటే ఇది 0.3 శాతం తక్కువ. సి.ఆర్.ఆర్ (కేష్ రిజర్వ్ రేషియో – బ్యాంకులు ఆర్.బి.ఐ వద్ద ఉంచవలసిన డిపాజిట్ల నిల్వల శాతం) ను ఆర్.బి.ఐ తగ్గించకుండా 4.75 వద్దనే కొనసాగించింది. జనవరి నుండి ఇప్పటికే రెండు సార్లు సి.ఆర్.ఆర్ ను ఆర్.బి.ఐ తగ్గించీంది. తద్వారా బ్యాంకుల వద్ద మరిన్ని నిధులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంది.
సమీప భవిష్యత్తులో మళ్ళీ వడ్డీ రేటును తగ్గించాలని భావించడం లేదని సుబ్బారావు తెలియజేశాడు. దానివల్ల ద్రవ్యోల్బణం హద్దులు దాటాడానికి అవకాశం ఉందని ఆయన అభిప్రాయం. అయితే తాజా రేటు కోత వల్ల కూడా ద్రవ్యోల్బణం పెరగడం ఖాయమే. జి.డి.పి పెరగాలి కనుక అందుకు మార్గం కంపెనీలకు నిధులివ్వడం మార్గమని ప్రభుత్వం భావించింది కనుక, ద్రవ్యోల్బణం పెరిగినా వడ్డీ రేట్లు తగ్గించడానికే నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా రైతులకి గానీ, ఇతర వృత్తులవారికి గానీ అదనంగా నిధులు అందజేసే ఉద్దేశ్యాలేవీ లేవు. కనుక ప్రజలకి వడ్డీ రేట్ల కోతకీ సంబంధం లేదు. ప్రజలని ఏ మాత్రం పట్టించుకోని చర్య ఇది.
“వృద్ధి రేటు పక్కకి వెళ్ళడం (తొమ్మిది శాతంగా ఉన్న వృద్ధి తగ్గిపోవడం దారి తప్పడం గానే ఆర్.బి.ఐ భావిస్తోంది) ఒక మాదిరి స్ధాయిలో (మోడెస్ట్) ఉంది. అదే సమయంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదాలు కొనసాగుతున్నాయి. అందువల్ల సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు మళ్ళీ తగ్గించడానికి అవకాఆశమ్ లేదు” అని సుబ్బారావు తెలిపాడు. రేపో రేటు తగ్గించడంతో పాటు బ్యాంకుల వద్ద నిధులు పెంచడానికి మరో వనరును కూడా ఆర్.బి.ఐ గవర్నర్ సమకూర్చాడు. ‘మారిజినల్ స్టాండింగ్ ఫెసిలిటీ’ ద్వారా తమ డిపాజిట్లలో 2 శాతాన్ని బ్యాంకులు రుణాలుగా పొందడానికి అవకాశం కల్పించాడు. ఇది ఇప్పటివరకూ 1 శాతంగా ఉంది. తక్షణం ఇది అమలులోకి వస్తుంది.
వృద్ధి రేటు కోసం రేపో రేటు తగ్గించినప్పటికీ ద్రవ్యోల్బణం పెరుగుదల తమకు ఆందోళనగానే ఉన్నదని ఆర్.బి.ఐ తెలిపింది. ఆహార ద్రవ్యోల్బణం పరిమితికి మించి కొనసాగుతున్నదని ఆర్ధిక మంత్రి ప్రణబ్ కూడా రెండురోజుల క్రితం ఆందోళన వ్యక్తం చేశాడు. ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా చేసుకునే ఆర్.బి.ఐ గత 36 నెలల్లో 13 సార్లు వడ్డీ రేట్లు పెంచుతూ పోయింది. ప్రపంచంలోని మరే సెంట్రల్ బ్యాంకూ ఇంత దూకుడుగా వడ్డీ రేట్లు పెంచలేదని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు అనేకసార్లు అభివర్ణించాయి. వడ్డీ రేలు పెంచినా, తగ్గించినా ఆ మార్పుల లక్ష్యంలో ప్రజల బాగోగులు లేకపోవడమే అసలు సమస్య.
congratulations sir u have done excellent performance , it is most useful for students
Hi Rajasekhar, Thank you. Pl tell your friends to visit the blog.
chala bagundhi sir meru echina information prathi student ki baga use avuthundhi present compitative exams ki chala useful ga vuntundhi thanku so much.
ఖతిజ గారూ సంతోషం. మీ మిత్రులకు కూడా ఈ బ్లాగ్ ని పరిచయం చేస్తే మరింత ఉపయోగపడగలదు.