ఆదివారం మధ్యాహ్నం నుండి సోమవారం ఉదయం వరకూ కొనసాగిన ‘కాబూల్ దాడి’ నిర్వహించింది పాకిస్ధాన్ కి చెందిన ‘హక్కానీ గ్రూపు’ అని అసోసియేటేడ్ ప్రెస్ తెలిపింది. కాబూల్ తో పాటు మరో మూడు ఆఫ్ఘన్ నగరాలపైన దురాక్రమణకి వ్యతిరేకంగా పోరాడుతున్న మిలిటెంట్లు ఒకేసారి దాడులకు పాల్పడ్డారు. ‘దురాక్రమణకు తాలిబాన్ ప్రతిఘటన బలహీన పడిందని ఫిబ్రవరిలో వ్యాఖ్యానించిన అమెరికాకి తమ అంచనా తప్పని తెలియజేయడానికే ఈ దాడులకు పాల్పడ్డామని తాలిబాన్ ప్రతినిధి జబీయుల్లా తెలిపాడు. తమ ‘వేసవి దాడులకు’ ఇది శాంపిల్ మాత్రమేననీ, ఇంకా ప్రారంభం కాలేదనీ తెలిపాడు.
దాడులకి దిగిన 37 మంది మిలిటెంట్లలో ఒకరు సజీవంగా పట్టుబడ్డాడు. పట్టుబడిన మిలిటెంటు తాము ‘హక్కానీ నెట్ వర్క్’ కు చెందినవారమని’ అంగీకరించినట్లు ఆఫ్ఘన్ భద్రతాధికారిని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. ఆఫ్ఘన్ భద్రతా బలగాలు, నాటో బలగాలు సముక్తంగా జరిపిన ప్రతి దాడిలో 36 మంది మిలిటెంట్లు చనిపోయారనీ ఆఫ్ఘన్ అధికారి తెలిపాడు. దాడుల్లో ఎనిమిది మంది పోలీసు అధికారులు, ముగ్గురు పౌరులు చనిపోయారని ఆఫ్ఘన్ హోమ్ మంత్రి బెస్మిల్లా మొహమ్మది తెలిపాడు.
ఆది వారం నుండి సోమవారం ఉదయం వరకూ మిలిటెంట్లు జరిపిన బహుముఖ దాడితో తాలిబాన్ తదితర మిలిటెంట్లు బలీయంగానే ఉన్న సంగతి స్పష్టమయిందని ఏ.పి అభిప్రాయపడింది. ఆఫ్ఘన్ భద్రతా బలగాలలో చొచ్చుకుపోగల సామర్ధ్యం తమకి ఇంకా ఉందని మిలిటెట్లు రుజువు చేసుకున్నారని తెలిపింది. ఆఫ్ఘన్ భద్రతా బలగాల మద్దతు, సహకారం లేనిదే ఈ దాడి సాధ్యం అయి ఉండేది కాదని పరోక్షంగా సూచించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్ధ మధ్య ఉండే కాబూల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ లో అమెరికా, బ్రిటన్, జర్మనీ, నాటో ల ఎంబసీలతో పాటు అనేక ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయి. వాటి మధ్య నిర్మాణంలో ఉన్న భవనంలోకి ప్రవేశించి మిలిటెంట్లు భారీ దాడులకు పాల్పడ్డారు. భద్రతా వ్యవస్ధను దాటుకుని అక్కడికి వెళ్ళాలంటే ఆఫ్ఘన్ భద్రతా బలగాల సహకారం తప్పనిసరి.
ఆదివారం జరిగిన దాడి గత ఆరు నెలల కాలంలోనే అత్యంత భారీ దాడిగా వార్తా సంస్ధలు అభివర్ణించాయి. అమెరికా, నాటో బలగాలను ఉపసంహరించుకోవడానికి నిర్ణయం జరిగి ఆఫ్ఘన్ బలగాలకు ఆ దేశ భద్రతా బాధ్యతలు అప్పజెప్పడానికి ఉద్యుక్తులవుతున్న తరుణంలో ఈ విధంగా నాలుగు రాష్ట్రాలలో ఒకేసారి భారీ దాడులు జరగడం అమెరికా, నాటో ల పధకాలకు భంగకరమని వ్యాఖ్యానించాయి. “దాడులు మా గూఢచార వైఫల్యం. ముఖ్యంగా నాటో గూఢచార సామర్ధ్యానికి అప్రతిష్టాకరం” అని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ వ్యాఖ్యానించాడు. కాబూల్ తో పాటు ఇతర నగరాలలోకి మిలిటెంట్లు చొరబడడానికి నాటో బలగాలు అవకాశం ఇచ్చాయని వ్యాఖ్యానిస్తూ పూర్తి స్ధాయి విచారణ జరగాలని కోరాడు. పనిలో పనిగా దాడులకు ఆఫ్ఘన్ బలగాలు స్పందించిన తీరు అమోఘమని పొగడ్తలు కురిపించాడు.
సెప్టెంబరులో అమెరికా ఎంబసీ పైనా, నాటో కేంద్ర కార్యాలయంపైనా దాడి జరిగాక అంత స్ధాయిలో జరిగిన భారీ దాడి ఇదేనని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా దాడులకు హక్కానీ గ్రూపే నాయకత్వం వహించింది. హక్కానీ గ్రూపుకు అమెరికా, నాటో బలగాలు తీవ్రంగా భయపడతాయి. ‘అత్యంత ప్రమాదకరమైన నెట్ వర్క్’ గా హక్కానీ ని అమెరికా అభివర్ణిస్తుంది. దాదాపు 10,000 పోరాట యోధులు హక్కానీ గ్రూపు కింద ఉన్నారని అమెరికా అంచనా. ఆఫ్ఘనిస్ధాన్ లో నాటో బలగాలకు తీవ్రమైన ప్రమాదం హక్కానీ గ్రూపు నుండే ఉన్నదని అమెరికా అనేకసార్లు ప్రకటించింది. “నంగార్హార్ రాష్ట్రంలో అరెస్టయిన టెర్రరిస్టు హక్కానీ గ్రూపే దాడులు నిర్వహించిందని అంగీకరించాడు” అని హోమ్ మంత్రి మొహమ్మది చెప్పాడని ‘ది హిందూ’ తెలిపింది.
జలాలుదీన్ హక్కానీ, ఆయన కుమారుడు సిరాజుద్దీన్ హక్కానీ లు హక్కానీ గ్రూపుకి నాయకులు. తూర్పున పాకిస్ధాన్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో వీరి కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉన్నాయి. హక్కానీ గ్రూప్ తో తాలిబాన్ కి దగ్గరి సంబంధాలు ఉన్నాయి. తాలిబాన్ లోని మోడరేట్లతో తాము చర్చలు జరుపుతున్నామని అమెరికా కొద్ది నెలలుగా చెప్పుకుంటోంది. అయితే గ్వాంటనామో బే లో ఉన్న తమ నాయకులను విడుదల చేయడానికి అమెరికా నిరాకరించడంతో ఖతార్ రాజధాని దోహాలో జరుగుతున్నా చర్చలకు మంగళం పాడుతున్నట్లు తాలిబాన్ ఫిబ్రవరిలో ప్రకటించింది. తమ అనుమతి లేకుండా అమెరికాతో చర్చలు కొనసాగిస్తున్నందుకు తమ నాయకుడొకరిని తాలిబాన్ నిర్భంధలోకి కూడా తీసుకుంది. అరెస్టయిన వారి స్ధానంలో మరొక నాయకుడితో చర్చలు జరుపుతున్నామని అమెరికా అధికారులు చెప్పినట్లుగా ‘ది హిందూ’ ఒక కధనంలో తెలియజేసింది. దురాక్రమణ ప్రతిఘటనోద్యమాన్ని చీల్చడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే అది చెప్పే చర్చలను చూడవలసి ఉంటుంది.