‘కళా రంగం’ పై తీవ్ర అణచివేత ఉన్న ఆఫ్ఘనిస్ధాన్ లో ఒక మహిళ వీధి చిత్రాలు గీయడానికి పూనుకోవడం సాహసమే. కాబూల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అయిన షంషియాని హస్సాని (24) ఆమె మిత్రుడు ఫౌషంజి హస్సాని (25) లు గీసిన చిత్రాలివి. మెయిన్ రోడ్లపక్కన ఉన్న గోడలపై గీయడానికి ఆఫ్ఘన్ ప్రభుత్వాధికారులు అంగీకరించలేదు. దానితో ముప్ఫై యేళ్ల యుద్ధాల్లో శిధిలమైన భవనాల్లో లోపలి గోడలే వారి కళా తృష్ణకు సాధనాలయ్యాయి. తామే ఫొటోలు తీసి పత్రికలకు ఇవ్వడంతో వారి కృషి ఇలా బయటి ప్రపంచానికి తెలిసి వచ్చింది.
“తాను లేచి నిలబడ గలనా లేక పడిపోతానా అని ఆమె భయపడుతోంది. ఆఫ్ఘన్ మహిళ తాము వేసే ప్రతి అడుగులోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే” అని షంషియానీ మెట్లపై కూర్చుని ఉన్న స్త్రీని ఉద్దేశిస్తూ చెప్పింది. “మూడు దశాబ్దాల యుద్ధంలో స్త్రీలు అత్యధిక భారాన్ని తమ భుజాలపై మోయవలసి వచ్చింది” అని ఆమె తెలిపింది. ఇరానియన్ బ్లాగర్ మరియం నమాజీ, షంషియానీ ని ఆఫ్ఘనిస్ధాన్ యొక్క ఫిమేల్ బ్యాంక్సీ (ప్రముఖ ఇంగ్లండ్ వీధి చిత్రకారుడు)” గా అభివర్ణించింది. అమెరికా నేతృత్వంలో నాటో ఆఫ్ఘనిస్ధాన్ దురాక్రమణకి దిగాక షంషియాని ఇరాన్ లో శరణార్ధిగా పెరిగింది.
ఆఫ్ఘనిస్ధాన్ మత పెద్దలను సూచించే చిత్రాలు గీయకుండా తాము జాగ్రత్తలు తీసుకుంటామని ఫౌషంజీ తెలిపాడు. మనుషుల ముఖాలను గీయడాన్నే తాలిబాన్ నిషేధించిందట. అలా గీయడం ‘అన్-ఇస్లామిక్’ అని తాలిబాన్ బోధనట.
+








