ఇది రాజస్ధాన్ లో జరిగిన ఘోరం. అప్పుడే పుట్టిన బాలిక మురికి కాలవలో ప్రత్యక్షమైంది. పొద్దున్నే చేసే వ్యాయామంలో భాగంగా నడుస్తూ అటుగా వచ్చినవారు పాప ఏడుపు విని పోలీసులకు చెప్పడంతో పాప బతికిపోయింది. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ పొందుతోంది. ఒక ఎన్.జి.ఓ సంస్ధ ముందుకు వచ్చి పాపని దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాజస్ధాన్ రాజధాని జైపూర్ కి 300 కి.మీ దూరంలో ఉన్న ఉదయ్ పూర్ నగరంలో జరిగిందీ ఘటన. శనివారం ఉదయం జాగింగ్ చేస్తూ వెళుతున్నవారికి పాప ఏడుపు వినిపించింది. వెళ్ళి చూస్తే మురికి కాలవ పక్కనే పాప బిగ్గరగా ఏడుస్తూ కనపడింది. వారు వెంటనే పోలీసులకి ఫోన్ చేసి విషయం తెలియజేసారు. ఈ సంగతి పోలీసులే విలేఖరులకు తెలిపారు.
“కొంతమంది జాగర్లు పాప ఏడుపు విన్నారు. ఉదయ్ పూర్ రోడ్ ఏరియాలో మురికి కాలవ లో పడిపోతున్నట్లుగా ఉన్న పాపని వారు చూశారు.” అని పోలీసు అధికారి తెలిపాడని ఇండియా టుడే పత్రిక తెలిపింది. “శనివారం బాగా పొద్దు పోయాక పాపని అక్కడ పారేశారు. అమ్మాయి అయినందువల్లనే పారేసినట్లు కనిపిస్తోంది. ఇక్కడ జనం అమ్మాయిలకంటే అబ్బాయిలే కావాలనుకుంటారు. మురికి కాలవలో పారేయడం చాలా క్రూరం” అని పోలీసు అధికారి అన్నాడు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశామనీ, పాప తల్లిదండ్రులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామనీ పోలీసు అధికారి తెలిపాడు.
2011 జనాభా లెక్కల ప్రకారం రాజస్ధాన్ రాష్ట్రంలో, 0-6 సంవత్సరాల వయసు మధ్య పిల్లలలో ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకూ 883 మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. 2001 లో ఈ నిష్పత్తి 1000:909 ఉండగా అది 1000:883 కి పడిపోయింది.
జాతీయ స్ధాయిలో చూసినా, 0-6 సంవత్సరాల పిల్లల్లో బాలికల సంఖ్య గత పది సంవత్సరాలలో పడిపోయింది. 2011 జనాభా లెక్కల్లో బాలురు బాలికల నిష్పత్తి 1000:927 ఉంటే, అది 2011 లో 1000:914 కి పడిపోయింది. అత్యధిక నిష్పత్తి మిజోరాం (971), మేఘాలయ (970) లలో నమోదు కాగా, అత్యంత ఘోరమైన నిష్పత్తి హర్యానా (830), పంజాబ్ (846) లలో నమోదయింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పుట్టబోయేది పాపో, బాబో తెలిసిపోతోంది. పుట్టకముందే పిండం సెక్స్ ఏమిటో డాక్టర్లు చెప్పకుండా నిషేదిస్తూ చట్టాలు ఉన్నాయి. అయినా డబ్బు తీసుకుని పిండం సెక్స్ చెప్పడం, అమ్మాయి అయితే డబ్బు తీసుకుని అబార్షన్లకు కూడా సిద్ధపడడం డాక్టర్లు చేస్తూనే ఉన్నారు. ఫలితంగా పిండం దశలోనే అమ్మాయిలు తల్లిదండ్రులు, డాక్టర్ల చేతిలో హత్యలకు గురవుతున్నారు. తలిదండ్రుల కళ్ళు కప్పి భూమి పైకి వచ్చినవారు సైతం కొందరు ఇలా మురికి కాల్వల పక్కనా, అనాధాశ్రమాల మెట్లపైన తేలుతున్నారు. పెరుగుతున్న దశలో పోషణా లోపానికి గురవుతున్నారు. వివాహ దశలో, వివాహం జరిగాక కూడా వరకట్న సమస్యను ఎదుర్కొంటున్నారు. కట్న పిశాచుల చేతిలో మరణిస్తున్నారు. ఇలా అన్నీ దశల్లోనూ సమాజం నుండి వివక్ష ఎదుర్కొంటున్నప్పటికీ దానికి కారణం పురుషాధిక్య సమాజం కాక మరేమవుతుంది?