మమత ఫాసిస్టు పోకడ -కార్టూన్


మమత ఫాసిస్టు పోకడలు కొనసాగుతున్నాయి. తన పై గీసిన కార్టూన్ ను ఫార్వర్డ్ చేసినందుకు యూనివర్సిటీ ప్రొఫెసర్ ను అరెస్టు చేయించింది. తన ప్రతిష్టను మసకబార్చడానికి కుట్రలు జరుగుతున్నాయంటూ యధావిధిగా తన చర్యను సమర్ధించుకుంది. జాదవ్ పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంబికేష్ మహాపాత్ర, ఆయన ఇంటిపక్కనే నివసిస్తున్న సుబ్రత సేన్ గుప్తా లను శుక్రవారం బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి మమత పరువు భంగం, మహిళ ప్రతిష్టకు మచ్చతేవడం, హేకింగ్ లాంటి సెక్షన్లను ప్రొఫెసర్ పై నమోదు చేశారు.

మమత చర్యను రాజకీయ పార్టీలు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. ఫాసిస్టు పోకడలు మానుకోవాలని హితవు పలికారు. ఒక వ్యంగ్య కార్టూన్ గీసినంతనే భంగమయ్యే బలహీన ప్రతిష్టా ముఖ్యమంత్రిది అని ప్రశ్నించారు. మమత చర్యను నిరసిస్తూ యూనివర్శిటీ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్ధులు ప్రదర్శన నిర్వహించారు. అరెస్టుకు ముందు త్రిణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తనను తీవ్రంగా కొట్టి తెల్లకాగితంపై బలవంతంగా సంతకం తీసుకున్నారని ప్రొఫెసర్ విలేఖరులకు తెలిపాడు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రదీప్ నారాయణ్ ఘోష్ సైతం ప్రొఫెసర్ అరెస్టును ఖండించాడు. ఇంత చిన్న విషయానికి ప్రొఫెసర్ ను అరెస్టు చేయలేరనీ, ఇంకేదో మనసులో పెట్టుకున్నారని వ్యాఖ్యానించాడు.

mamata_cartoon

ఈ కార్టూన్ ను ‘ది హిందూ’ ప్రచురించింది.

One thought on “మమత ఫాసిస్టు పోకడ -కార్టూన్

  1. విశేఖర్ గారూ,
    ఇప్పుడే చూస్తున్నాను.. ఈ లింకును.
    భారత పాలకవర్గ రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ మనం చూడని వార్త. మమత మంత్రివర్గంలోని ఒక మంత్రి సభలో వందలాదిమంది తృణమూల్ కేడర్‌ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, సిపిఎమ్ కేడర్‌కు తమ కుమార్తెలను ఇచ్చి పెళ్లి చేయవద్దని, సిపిఎం సభ్యుల పక్కన కూడా కూర్చోవద్దని బహిరంగ సలహా ఇచ్చాడు. చివరకు గుడ్డిద్వేషానికి మారుపేరయిన తమిళ రాజకీయాల్లో కూడా ఇలాంటి ప్రకటనలు చేసుకున్న చరిత్ర ఇంతవరకు వినలేదు. ఎవరపైనయినా తీవ్రమైన నిరసన తెలపడానకి ‘మనిషా పశువా’ అనే పదబంధం ఉపయోగిస్తుంటాము. దీన్ని కాస్త మార్చి ‘మనిషా మమతా మంత్రా.’ అని పలికితే సరిపోతుంది ఇకనుంచి.

    సాంప్రదాయ భారత్ చాలా మారిందని, ఇంకా మారుతుందని చాలామంది పెద్దలు అటుంటే వింటున్నాము. కాని “అంటరానితనం” అనే భావన సహస్ర ముఖాల్లో నేటికీ వ్యక్తీకరించబడుతోందని పై ఉదంతం చాచికొట్టి మరీ చెబుతోంది కదూ..!

    ఇలాంటి విషయాల్లో మన పశ్చిమబెంగాల్ ‘కమ్యూనిస్టు దొరలు’ తక్కువ తినలేదులెండి. అప్పుడు వాళ్లూ, ఇప్పుడు వీళ్లూ…

    అభినవ హిట్లర్ల కొత్త రకం ప్రవచనాలను కింది లింకులో చూడగలరు.

    Don’t marry, talk to CPM supporters Mamata minister tells cadres

    http://www.indianexpress.com/news/dont-marry-talk-to-cpm-supporters-mamata-minister-tells-cadres/937919/

వ్యాఖ్యానించండి